మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన పులివెందులలో మీడియాతో మాట్లాడారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని భయాందోళన చెందారు. తనకేమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు.
వివేకా హత్య కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారి పలు సంచలన విషయాలు చెప్పారు.
ఈ కేసులో అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతల పరోక్ష ప్రమేయంపై దస్తగిరి వాంగ్మూలం ఇవ్వడం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆయనకు సీబీఐ రక్షణ కల్పించింది. అయితే పోలీసులు తనకెలాంటి రక్షణ ఇవ్వడం లేదని దస్తగిరి తాజా ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి.
తన రక్షణ నిమిత్తం ఇద్దరు పోలీసులను నియమించినట్టు జిల్లా పోలీస్‌శాఖ చెబుతోందని, వారెవ్వరూ పులివెందులలో తన ఇంటి వద్ద కాపలా లేరని దస్తగిరి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రక్షణ కరువైందన్నారు. ఇంటి నుంచి బయటికి వెళ్లిన ప్రతిసారి సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌కు ఫోన్ చేసి చెప్పాలంటే ఇబ్బందిగా ఉందన్నారు.
పులివెందుల్లో ఎక్కడికెళ్లాలన్నా భయంగా ఉందని దస్తగిరి ఆందోళన వ్యక్తం చేశారు. తన వద్ద ఎవరూ రక్షణగా లేరన్నారు. సర్వైలెన్స్ పేరుతో పోలీసులు తప్పించుకుంటున్నారని దస్తగిరి ఆరోపించారు. అసలేం జరుగుతున్నదో అర్థం కావడం లేదన్నారు. తనకేమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని దస్తగిరి ప్రశ్నించడం గమనార్హం. ఈ నేపథ్యంలో సీబీఐ, కడప జిల్లా పోలీస్‌శాఖల స్పందనపై ఆసక్తి నెలకుంది.