విశాఖ జిల్లాలో శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీకి భక్తుల తాకిడి ఎక్కువ. అందులో రాజకీయ భక్తులు ఇంకా ఎక్కువ. ఈ మధ్యనే హర్యానా నుంచి వచ్చిన బీజేపీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్వామీజీ దర్శనం చేసుకున్నారు. మరో వైపు వైసీపీలో కొత్తగా మంత్రులు అయిన వారు వరసబెట్టి స్వామీజీ ఆశీస్సుల కోసం తరలివస్తున్నారు.
ఇపుడు టూరిజం మంత్రి ఆర్కే రోజా కూడా విశాఖ పర్యటనలో మొదటిగా దర్శనం చేసుకున్నది స్వామీజీనే. శారదాపీఠానికి వచ్చిన మినిస్టర్ రోజాకు స్వామి ఆశీస్సులు అందచేశారు. ఆ మీదట ఆమె అక్కడ ఉన్న దేవతా మూర్తులకూ పూజలకు చేశారు.
శారదాపీఠానికే విశిష్టతగా చెప్పుకునే శ్రీ రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం కోసం రోజా ఆమెకు కూడా ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. రోజా కుటుంబ సమేతంగానే స్వామీజీని కలిశారు.
ఇప్పటి దాకా రోజా రాష్ట్రంతో పాటుగా రాష్ట్రేతర ఆలయాల సందర్శన చేస్తూ వచ్చారు. ఇపుడు శారదాపీఠంతో ఈ మొక్కులు పూర్తి అయ్యాయా లేక ఇంకా మరిన్ని క్షేత్రాల దర్శనాలు ఉన్నాయా అన్నది చూడాలి. మొత్తానికి రోజా కోరుకున్న విధంగా మంత్రి అయ్యారు. దానికి స్వామి ఇచ్చిన ఆశీస్సుల బలం కూడా ఉందని ఆమె గట్టిగానే నమ్ముతున్నారు.