“సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తాం. కానీ సిన్సియారిటీ లేకపోతే ఎలా?
సీనియారిటీ ఉన్నప్పటికీ జనాలతో ఓట్లు వేయించలేని సీనియారిటీతో ఏం లాభం?
ఓట్లు వేయించలేని సీనియర్లు కూడా పార్టీలో తమకే ప్రాధాన్యం కావాలని కోరితే ఎలా?
ఫీల్డ్ లో పనిచేయకుండా మాయ చేసే సీనియర్లు ఎవరో నాకు తెలుసు..”
ఇటీవల టీడీపీ సీనియర్లపై చంద్రబాబు వేసిన పంచ్ డైలాగ్స్ ఇవి. గతంలో పార్టీలో కట్టప్పల్ని ఏరిపారేస్తామంటూ తూతూమంత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకున్న చంద్రబాబు.. ఇప్పుడు సీనియర్ల విషయంలో కూడా డైలాగ్స్ కే పరిమితం కాబోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితిల్లో ఇలా పరోక్షంగా పంచ్ లు వేయడం తప్ప బాబు ఏం చేయలేరు. తన పార్టీలో సీనియర్లను ఏం చేయలేని దుస్థితి బాబుది. కాకపోతే ఆ సీనియర్లు ఎవరనే చర్చ మాత్రం పసుపు తమ్ముళ్లలో జోరుగా చర్చ సాగుతోంది.
టీడీపీలో అన్నీ పచ్చ ఏనుగులే..?
చంద్రబాబు హయాంలో మంత్రి పదవులు అనుభవించిన ఒకరిద్దరు మినహా మిగతా వారంతా ఇప్పుడు లైమ్ లైట్లో లేరు. అసలు ఎవర్ని ఎక్కడ ఏ ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబెట్టినా గెలవలేని పరిస్థితి. పోనీ వారు ఎమ్మెల్యేగా గెలవకపోయినా పర్లేదు, కనీసం వారి సొంత ఊరిలో సర్పంచ్ ని కూడా గెలిపించుకోలేని స్థితిలో సీనియర్లున్నారు.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని తీసుకుంటే.. తన నియోజకవర్గంలో గజినీలాగా ఓడిపోతూ మండలితో మంత్రి పదవి పొందారు, అది పోయిన తర్వాత తిరిగి పరపతి పెంచుకునే దిశగా ఆలోచించకుండా నియోజకవర్గానికి దూరంగా నెల్లూరులో కూర్చుని రాజకీయాలు చేస్తుంటారాయన.
యనమల రామకృష్ణుడు కూడా టీడీపీ తరపున వకాల్తా పుచ్చుకున్నట్టు తెరపై కనిపించడానికి ఓకే కానీ, క్షేత్ర స్థాయిలో ఆయనకి ఓట్లు రావు, సీటు లేదు. అందుకే ఆయన కూడా మండలి బ్యాచే. ఒకరా ఇద్దరా.. కళా వెంకట్రావు, చినరాజప్ప.. ఈ లిస్ట్ లో ఉన్న రిటైర్మెంట్ బ్యాచ్ అంతా మాటలకే కానీ, చేతలకు పనికి రాదు. వీరందరిపై అవకాశం వచ్చినప్పుడల్లా ఇలా చిర్రుబుర్రులాడటం మినహా చంద్రబాబు చేసేదేమీ లేదు.
ప్రక్షాళన మొదలైతే బాబు సంగతేంటి..?
స్థానిక ఎన్నికల్లో కనీసం తన సొంత మున్సిపాల్టీని కూడా గెలుచుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు చంద్రబాబు. కుప్పం మున్సిపాల్టీ వైసీపీ పరం అయినప్పుడే అక్కడ బాబు పరపతి ఎంతుందో అర్థమైంది. పైన బాబు చెప్పిన సిన్సియార్టీ, సీనియార్టీ లెక్కలు తీస్తే ముందు ఆయన్నే సాగనంపాలి. సో.. అందరూ తనలాంటివాళ్లే కాబట్టి, కేవలం డైలాగులు చెప్పి తప్పించుకుంటున్నారాయన.
వైసీపీ ఏవైనా స్వీయ తప్పిదాలు చేస్తే చంద్రబాబుకి ఓట్లు పెరుగుతుయి కానీ, నేరుగా చంద్రబాబు వల్ల, ఆయన లాంటి సీనియర్ల వల్ల టీడీపీకి వచ్చే లాభం ఏమాత్రం లేదు. కానీ చంద్రబాబు నేరుగా మాటల తూటాలు పేల్చారు కాబట్టి.. సీనియర్లంతా ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నారు.