“ఒంగోలులో కారు లాక్కున్న ఘటన.. జగన్ కి సంక్షేమ పథకాలు అండగా ఉన్నాయి కదా..!
విజయవాడ ఆస్పత్రిలో దుర్ఘటన.. జగన్ సంక్షేమ పథకాలు పేదలకి ఆర్థిక సాయం అందిస్తున్నాయి కదా..!
ఆర్ఐ పై దాడి చేసిన మట్టి మాఫియా.. పథకాలే ప్రభుత్వానికి శ్రీరామ రక్ష..!”
ఇలా ఎక్కడ ఏ తప్పు జరిగినా వైసీపీకి ఉన్న భరోసా ఒక్కటే. సంక్షేమ పథకాలు. కానీ ఎన్నికలకింకా రెండేళ్ల టైమ్ మాత్రమే ఉంది. ఎన్నికలకు ముందు ఎక్కడ తడబడినా, పథకాల విషయంలో ఏమాత్రం ఆలస్యమైనా ఆ రిజల్ట్ మాత్రం దారుణంగా ఉంటుంది. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా.. జగన్ మాత్రం మరో రెండేళ్లు పథకాలతో కత్తిమీద సాము చేయాల్సిందే.
ఏపీలో జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ మంచివే. అదే సమయంలో ఆయన ప్రజలు ఆశించిన దానికంటే కాస్త ఎక్కువే ఇస్తున్నారు. అదీ మంచిదే. ఎక్కడా ఎప్పుడూ ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా పింఛన్లు అందుతున్నాయి, సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి మరీ ఆలస్యం కాకుండా ఆర్థిక సాయం చేస్తున్నారు.
ఇది ఇంకా మంచిది. లెక్కలు బాగున్న రోజులు అన్నీ బాగుంటాయి, లెక్కల్లో తేడా వచ్చిందంటే మాత్రం.. పెట్టని అమ్మ ఎలాగూ పెట్టలేదు, పెట్టే జగన్ కి ఏమొచ్చింది అనే లాజిక్కులు వెదుక్కుంటారు జనం. ఇక్కడ జనం ఆలోచనా ధోరణిని ఎవరూ తప్పుపట్టలేరు కానీ, ప్రభుత్వం వారికి అలా అలవాటు చేసిందంతే..
చంద్రబాబు హయాంలో సామాజిక పింఛన్ ఒకటో తేదీ ఇచ్చిన దాఖలాలే లేవు. 15వ తేదీ వరకు పంపిణీ సాగుతూ ఉండేది, నెలాఖరులో కూడా కొంతమంది చేతికి డబ్బులందేవి. ఇప్పుడలా లేదు, ఠంచనుగా ఒకటో తేదీనే పింఛన్ ని ఇంటికి తీసుకొచ్చి వాలంటీర్లు చేతిలో పెడుతున్నారు. కానీ ఒక్కరోజు లేటైతే మాత్రం టీడీపీ అనుకూల మీడియా రెచ్చిపోతోంది. ఒకటో తేదీ అన్నారుగా, రెండ్రోజులు ఎందుకు లేటైంది అని లాజిక్ తీస్తోంది. జనంలో లేనిపోని అలజడి సృష్టించడానికి రెడీ అవుతోంది.
ఇలాంటి దశలో పింఛన్ ఒకరోజు లేటయినా జగన్ సమాధానం చెప్పుకోవాలి, రైతు భరోసా ఒక నెల ఆలస్యమైనా వివరణ ఇచ్చుకోవాలి. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల గురించి లేనిపోని పుకార్లు విని వైరి వర్గాలకు వంతపాడుతున్నారు. జగన్ అన్నిటినీ సమన్వయం చేసుకుంటున్నారు కాబట్టి సరిపోయింది.
కరోనా కాలంలో కూడా కష్టనష్టాలు ఎదురైనా ఆర్థిక సాయం మాత్రం ఎక్కడా ఆగలేదు. ఒక రకంగా జనానికి, పార్టీ నేతలకు సంతోషంగా ఉంది కానీ, జగన్ మాత్రం మూడేళ్లు ముళ్లబాటలోనే నడిచారు. మరో రెండేళ్ల పాటు ఈ కత్తిమీద సాము చేయాల్సిందే. ఎక్కడ, ఎప్పుడు ఏ పథకం ఆలస్యమైనా దాని ప్రభావం గట్టిగా ఉంటుంది. అలాంటి సీన్ క్రియేట్ చేయడానికి ప్రతిపక్షం, వారి అనుకూల మీడియా రెడీగా ఉంటాయి. జర జాగ్రత్త జగన్.