జీవీఎల్ నరసింహారావు ని టీడీపీ కూటమి లైట్ తీసుకుంది. కానీ ఆయన బలం ఏంటో ఇపుడు కళ్లారా చూస్తోంది. ఎక్కడో ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన జీవీఎల్ కి విశాఖలో బలమేముంది అని అనుకుంటే ఆయనకు వివిధ సామాజిక వర్గాలు మద్దతుగా నిలిచి ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాయి. గతంలో ఎపుడూ ఏ అభ్యర్ధి విషయంలో జరగని విధంగా జీవీఎల్ విషయంలో జరుగుతోంది అని అంటున్నారు.
జన జాగరణ సమితి జీవీఎల్ కే విశాఖ ఎంపీ టికెట్ బీజేపీ ఇవ్వాలి అంటూ విశాఖ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఫ్లెక్సీలు కట్టి రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. జీవీఎల్ కి విశాఖ సమస్యలు తెలుసు. ఆయన జనంలో ఉంటున్న నేత. ఆయనకు టికెట్ రాకుండా కుటుంబం, కులం ప్రధాన పాత్ర పోషించాయని కూడా ఆరోపిస్తూ వెలసిన ఈ ఫ్లెక్సీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
అలాగే నవ్యాంధ్ర సొండికుల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నెమలిపురి కోటేశ్వర చౌదరి ఒక ప్రకటన చేస్తూ జీవీఎల్ కే మా మద్దతు అని స్పష్టం చేశారు. మా యొక్క సామాజిక వర్గాన్ని కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చే విషయంలో జీవీఎల్ చేసినటువంటి అనితర సాధ్యమైనటువంటి కృషి మా సామాజిక వర్గానికి ఎంతో మేలు చేసిందని ఆయన పేర్కొన్నారు.
దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తి వలన విశాఖ అభివృద్ధి మాత్రమే కాకుండా అన్ని సామాజిక వర్గాలు అన్ని తరగతుల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అంటున్నారు. వివిధ సామాజిక వర్గాలతో పాటు ఉత్తరాది ప్రాంతానికి చెందిన వారు వారి సంఘాలు కూడా జీవీఎల్ కి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖలో బీజేపీకి టికెట్ ఇవ్వకపోతే తాము ఎవరికీ మద్దతు ఇవ్వమని చెబుతున్నారు
విశాఖలో ఎన్నో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. వాటి ఉద్యోగ సంఘాలు కూడా బీజేపీ విశాఖ నుంచి పోటీలో ఉండాలని అంటున్నారు. విశాఖ నుంచి ఢిల్లీ వెళ్ళిన బీజేపీ నేతలు కేంద్ర బీజేపీ పెద్దలతో జీవీఎల్ కి టికెట్ ఇమ్మని కోరుతున్నారు
విశాఖలో జీవీఎల్ కి టికెట్ విషయంలో ఈ విధంగా ఒత్తిడి సాగుతోంది. దాంతో జీవీఎల్ కి టికెట్ ఇస్తే ఒక తంటా ఇవ్వకపోతే ఒక తంటా అన్నట్లుగా టీడీపీ పరిస్థితి ఉంది. జీవీఎల్ కి టికెట్ ఇస్తే అనకాపల్లి సీటుని బీజేపీ నుంచి తీసుకోవాలి. అక్కడ సీఎం రమేష్ పోటీలో ఉన్నారు. లేకపోతే విశాఖ అరకు అనకాపల్లి మూడూ బీజేపీ ఖాతాలోకి పోతాయి.
విశాఖ ఎంపీ సీటు తీసుకుంటే బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ కి అన్యాయం జరుగుతుంది. ఆయన ఇప్పటికే ప్రచారంలోకి వెళ్లిపోయారు. అలా కాకుండా టీడీపీకే ఎంపీ సీటు ఇస్తే మాత్రం విశాఖలోని కొన్ని వర్గాలు కూటమికి మద్దతు ఇచ్చే విషయంలో ఆలోచిస్తాయని అంటున్నారు. ఆ విధంగా ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. దీంతో టీడీపీ కూటమికి ఇదంతా ఇరకాటంగా ఉంది.