ఇప్పటివరకు ఎన్నో రకాల ప్రేమకథలు చూశాం. ఇంకా చెప్పాలంటే ప్రతి వారం ఒక ప్రేమకథ రిలీజ్ అవుతూనే ఉంటుంది. కానీ ఇది ఇప్పటివరకు ఎవ్వరూ టచ్ చేయని, తెరపై ఎవ్వరూ చూడని లవ్ స్టోరీ. ఈ కథ గురుక చుట్టూ తిరుగుతుంది. అదే ప్రత్యేకత. ఆ సినిమా పేరు డియర్.
జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘డియర్’. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కథ మొత్తం హీరోయిన్ గురక చుట్టూ తిరుగుతుంది.
హీరోకు నిద్ర తక్కువ. నైట్ చాలా తక్కువసేపు మాత్రమే పడుకుంటాడు. హీరోయిన్ తో పెళ్లయిన తర్వాత ఆ కొద్ది నిద్ర కూడా అతడికి దూరమౌతుంది. ఎందుకంటే హీరోయిన్ కు గురక వీక్ నెస్. పడుకుంటే గురక పెడుతుంది. ఇలాంటి ఇద్దరు కలిసి ఎలా కాపురం చేశారు, తన వైవాహిక బంధాన్ని ఎలా కాపాడుకున్నారనేది ఈ సినిమా స్టోరీ.
కొద్దిసేపటి కిందట విడుదల చేసిన ట్రయిలర్ లో మేటర్ ఏంటనేది క్లియర్ గా చెప్పేశారు. నాగచైతన్య వాయిస్ ఓవర్ తో సినిమా కథ ఏంటనేది ట్రయిలర్ లో చెప్పడం బాగుంది. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు, సంగీతం కూడా అందించాడు జీవీ.
ఒక్కరోజు గ్యాప్ లో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలవుతుంది. తమిళ వెర్షన్ ఏప్రిల్ 11న, తెలుగు వెర్షన్ ను ఏప్రిల్ 12న విడుదల చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను అన్నపూర్ణ స్టుడియోస్ (ఆంధ్రా), ఏషియన్ సినిమాస్ (నైజాం) రిలీజ్ చేస్తున్నాయి.