ఈ సమ్మర్ కు పెద్ద సినిమాలన్నీ మొహం చాటేశాయి. సమ్మర్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందనుకున్న దేవర వాయిదా పడింది. కచ్చితంగా వస్తుందనుకున్న కల్కి కూడా పోస్ట్ పోన్ అయింది. ఇక ఈ వేసవికి ఇంతే అనుకున్న టైమ్ లో ఓ పెద్ద సినిమా పడింది.
శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారతీయుడు-2 సినిమాను జూన్ లో విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. 1996లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
అవినీతికి వ్యతిరేకంగా పోరాడే స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతిగా కమల్ హాసన్ ఇందులో కనిపించబోతున్నారు. నిజానికి ఈ సినిమాను గతేడాది చివర్లోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ శంకర్ తో వ్యవహారం మామూలుగా ఉండదు కదా. అలా వాయిదాల మీద వాయిదాలు పడుతూ జూన్ కు వచ్చి పడింది. జూన్ లో కూడా ఏ తేదీకి రిలీజ్ అనేది ఇంకా చెప్పలేదు.
కమల్ తో పాటు భారీ తారాగణం ఇందులో ఉంది. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ప్రియా భవానీ శంకర్, ఎస్ జే సూర్య, బాబీ సింహా.. ఇలా చాలామంది స్టార్స్ ఈ సినిమాలో నటించారు. అనిరుధ్ సంగీతం అందించాడు.
ఈ నెలాఖరు నుంచి ఈ సినిమాకు ప్రచారం ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈ మేరకు కాజల్, రకుల్ కు సమాచారం అందించారు. వాళ్ల ఇంటర్వ్యూలతో భారతీయుడు-2 ప్రచారం మొదలుకానుంది.