తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని స్థాపించి.. తెలంగాణ ప్రయోజనాలు తప్ప మరో పరమావధి లేని పార్టీగా దానికి ప్రజల్లో గుర్తింపు తీసుకురావడంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు చాలా సంవత్సరాల కిందటే కృతకృత్యలయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత గానీ, అందకు ముందుగానీ.. తెలంగాణ అనే పదాన్ని జోడించుకుని ఇంకా కొన్ని పార్టీలు పుట్టుకొచ్చాయి గానీ.. కేసీఆర్ స్థాయిలో వారు ప్రజల్లోకి వెళ్లలేకపోయారు.
తెలంగాణ ఆత్మగా నిలవగల పార్టీలుగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. రాష్ట్రసాధన కోసం జరిగిన పోరాటాల్లో కూడా కీలకంగా వ్యవహరించడంతో.. తెలంగాణ రాష్ట్ర సమితికి పేటెంట్ దొరికినట్లు అయింది. తమ పార్టీకి తెలంగాణ తప్ప మరో ఆశయం ఏదీ లేదనే స్థితిని కేసీఆర్ పణంగా పెట్టేశారు. పార్టీని జాతీయ పార్టీగా మారుస్తున్నానంటూ భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టారు.
రాష్ట్ర రాజకీయాలను కొడుకు చేతిలో పెట్టేసి.. కేటీఆర్ ను సీఎం చేయాలనే ఆశ, తాను కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లిపోయి.. హస్తినాపురంలో చక్రం తిప్పాలనే అత్యాశ ఆయనను ఆ నిర్ణయంవైపు పురిగొల్పాయి. అప్పట్లోనే తెలంగాణ అనే పదాన్ని పార్టీ పేరులోంచి తొలగించేయడం పట్ల కొందరు అభ్యంతరాలు వ్యక్తంచేసినట్లుగా వార్తలు వచ్చాయి.
తెరాసను అలాగే ఉంచి, కావలిస్తే భారాస పేరుతో మరో కొత్త పార్టీ పెడితే బాగుంటుందనే అభిప్రాయాలను కూడా పలువురు వ్యక్తం చేసినట్టుగా వార్తలు వచ్చాయి. మొత్తానికి తెరాసనే భారాసగా మారింది. చాలా మంచి ముహూర్తం చూసుకుని కేసీఆర్ ఆ పార్టీ ప్రకటన చేశారు. ఆ వెంటనే ఇతర రాష్ట్రాల్లో చాలా దూకుడుగా పార్టీ శాఖలను ఏర్పాటుచేసే పనికి పూనుకున్నారు.
మహారాష్ట్రకు పలుమార్లు పర్యటనలు చేశారు. అక్కడ అనాకానీ నాయకులందరికీ ప్రగతిభవన్ లో కండువాలు కప్పి భారాసలో మహారాష్ట్ర మొత్తం చేరిపోతున్నదనే భావనను కలిగించారు. ఏపీ, ఒదిశా శాఖలను కూడా ఏర్పాటుచేశారు. ఇంతా చేస్తే.. చివరికి సొంత రాష్ట్రంలో పార్టీ చతికిలపడింది. దారుణంగా ఓటమి పాలైంది.
అప్పటినుంచి వారిలో పునరాలోచన ఉన్నది గానీ.. తాజాగా రైతు దీక్షల పేరుతో పోరాటాలకు పిలుపు ఇవ్వగా.. పాలకుర్తిలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. పార్టీ పేరును తిరిగి తెరాసగా మార్చడానికి ఆలోచిస్తున్నట్టు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నాటినుంచి ఇలాంటి ప్రతిపాదన పలువురు నాయకులనుంచి వినిపిస్తూనే ఉంది.
తాజాగా పార్టీ మేనేజ్ మెంట్ కూడా అందుకు సుముఖంగా ఉన్నట్టు ఎర్రబెల్లి మాటల వల్ల తెలుస్తోంది. ఎటూ భారాస ఇప్పుడు పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నా.. తెలంగాణ హద్దు దాటి మరొక్కచోటనైనా అభ్యర్థులను నిలబెట్టే స్థితిలో లేదు. కేసీఆర్ ఇక జాతీయ రాజకీయాల ఊసు మానుకుని.. పార్టీని తిరిగి తెరాసగా మార్చేసి.. ఇంటగెలిస్తే చాలుననే ధోరణికి వస్తారని పలువురు అంచనా వేస్తున్నారు.