అరకులో టీడీపీ కూటమికి కష్టాలు!

ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీలో అరకు అసెంబ్లీ సీటు చాలా ముఖ్యమైనది. టూరిజం స్పాట్ గా ఎదుగుతున్న అరకులో ఏ రాజకీయ పార్టీ గెలిచినా అరకుని కేంద్ర బిందువుగా తీసుకుంటారు. అరకు పేరుతో పార్లమెంట్…

ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీలో అరకు అసెంబ్లీ సీటు చాలా ముఖ్యమైనది. టూరిజం స్పాట్ గా ఎదుగుతున్న అరకులో ఏ రాజకీయ పార్టీ గెలిచినా అరకుని కేంద్ర బిందువుగా తీసుకుంటారు. అరకు పేరుతో పార్లమెంట్ సీటు కూడా ఉంది. అలా అరకు ప్రాముఖ్యత ఎనలేనిది.

అటువంటి అరకులో 2009 తరువాత టీడీపీ జెండా ఎగరలేదు . 2014, 2019 లలో వరసగా వైసీపీ గెలిచింది. ఈసారికి అరకులో టీడీపీ పుంజుకుంది అంటే ఆ సీటుని తీసుకెళ్ళి బీజేపీకి పొత్తులో భాగంగా అప్పగించారు. దాంతో అరకు సీటుకి మొదట టీడీపీ అభ్యర్ధిగా ప్రకటించిన సియారి దొన్ను దొర ఫైర్ అవుతున్నారు

అరకు లో తనకు టికెట్ ఇచ్చి తరువాత మార్చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాట మాత్రం అయినా చెప్పలేదని అన్నారు. గిరిజనులు అంటే అంత చులకనా అని టీడీపీ అధినాయకత్వం మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే దొన్ను దొర ఏర్పాటు చేసిన సమావేశానికి పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు కార్యకర్తలు హాజరయ్యారు. వారంతా ఒక్కటే స్పష్టం చేస్తున్నారు. అరకు సీటుని దొన్ను దొరకు ఇస్తేనే పనిచేస్తామని బీజేపీకి అసలు సహకరించేది లేదని వారు అల్టిమేటం ఇచ్చేసారు.

టిడిపి మొదటి జాబితాలో అరకు టికెట్‌ కేటాయించి ఇప్పుడు బిజెపికి ఇవ్వడం ఎంతవరకు సమంజసమని దొన్ను దొర ప్రశ్నించారు. అరకులో ఒక శాతం కూడా ఓటు బ్యాంకు లేని బిజెపికి ఎలా టికెట్‌ ప్రకటిస్తారని ఆయన నిలదీశారు. బిజెపి అధిష్టానం ఒత్తిడితోనే బిజెపికి టికెట్‌ కేటాయించడం జరిగిందని నారా లోకేష్ అంటున్నారని, అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారని అయితే తనకు ఆ మాటల మీద నమ్మకం లేదని దొన్ను దొర చెప్పడం విశేషం.

అరకు టికెట్ ని బిజెపికి టికెట్‌ కేటాయించిన విషయం తెలుసుకుని ఇంట్లో కుటుంబమంతా మనస్థాపానికి గురై చనిపోవడానికి కూడా సిద్ధమయ్యామని దొన్ను దొర ఆవేదన వ్యక్తం చేశారు. దొన్ను దొరకు టికెట్‌ వచ్చేంత వరకు పోరాడతామని లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టి పోటీ చేయిస్తామని అరకు టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ పరిణామాలతో అరకు టీడీపీ కూటమిలో ముసలం బయల్దేరింది. దొన్ను దొర ఇండిపెండెంట్ గా 2019లో పోటీ చేసి 27 వేలకు పైగా ఓట్లు తెచ్చుకున్నారు. ఈసారి కూడా ఆయన పోటీకి సిద్ధపడుతున్నారు. దాంతో టీడీపీ కూటమికి ఇక్కడ కష్టాలే అంటున్నారు.