వైసీపీని సర్వనాశనం చేసి, టీడీపీలోకి వెళుతూ నీతులు చెప్పడం ఆయనకే చెల్లింది. రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ పార్టీకి, తన పదవికి రాజీనామా చేశారు. తెలుగుదేశంలో చేరనున్నట్టు ప్రకటించే సందర్భంలో ఆయన కీలక ఆరోపణలు చేశారు.
హిందూపురం టికెట్ ఇవ్వనందుకు బాధగా లేదని, కానీ అమర్యాదగా ప్రవర్తించినందుకే రాజీనామా చేసినట్టు ఇక్బాత్ తెలిపారు. అలాగే మైనార్టీలకు, పోలీసులకు ఏదైనా చేయాలన్నా, ఆ అవకాశం లేకుండా పోయిందని వాపోయారు. చంద్రబాబు హయాంలోనే మైనార్టీలకు రక్షణ ఉండేదన్నారు.
రాజకీయాలతో సంబంధం లేని ఓ ఐపీఎస్ అధికారిని అందలం ఎక్కిస్తే, ఏమవుతుందో ఇక్బాల్ ఉదంతం అన్ని పార్టీలకు ఓ గుణపాఠం. హిందూపురంలో నందమూరి బాలకృష్ణపై 2019 ఎన్నికల్లో ఇక్బాల్‌ను వైసీపీ బరిలో నిలిపింది. ఇక్బాల్ ఓడిపోయారు. అయినప్పటికీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తగిన గౌరవాన్ని కల్పించారు. పార్టీ అంత మంచి చేస్తే, ఆయన చేసిందేంటి? అనే ప్రశ్నకు షాకింగ్ సమాధానం వస్తుంది.
హిందూపురంలో వైసీపీకి ఏ దిక్కూ లేని సమయంలో పార్టీ జెండా మోసిన మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డిని హత్య చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2022లో హిందూపురం వైసీపీ మాజీ సమన్వయకర్త రామకృష్ణారెడ్డిని అత్యంత కిరాతకంగా చంపారు. ఈ కేసులో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్సీ ఇక్బాల్‌తో పాటు ఆయన పీఏ గోపీకృష్ణ, రవి, వరుణ్, నాగన్నలపై కేసు నమోదు చేశారు.
రామకృష్ణారెడ్డి హత్య కేసు ఎపిసోడ్‌లో నియోజక వర్గ ప్రజానీకం ఆరోపణలన్నీ ఇక్బాల్, ఆయన పీఏ వైపే. తనకు ఎమ్మెల్యే టికెట్, ఆ తర్వాత ఓడిపోయాక ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన పార్టీకి న్యాయం చేయకపోగా, తీవ్ర నష్ట చేయడంలో ఇక్బాల్ తన వంతు పాత్రను పోషించడం నిజం కాదా? ఇప్పుడు హిందూపురం అసెంబ్లీ టికెట్‌ను దీపిక అనే మహిళకు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక ఇక్బాల్ పార్టీ వీడేందుకు సాకులు వెతుక్కుంటున్నారు.
చంద్రబాబు హయాంలో ఎమ్మెల్యే టికెట్లు ఎంత మందికి ఇచ్చారు? వారిలో గెలిచిన వారెంత మంది? కేబినెట్‌లో చోటు దక్కిందెవరికో ఇక్బాల్ సమాధానం చెప్పి, టీడీపీలో చేరితే మంచిది. ఐపీఎస్ అధికారి, ముస్లిం మైనార్టీ అని ఆదరిస్తే, ఎలా వుంటుందో ఇక్బాల్ ఉదంతం ఒక గుణపాఠం. పార్టీ కోసం కష్టపడే వారికి తగిన ప్రాధాన్యం ఇస్తే ఇలాంటివి ఎదురు కావు.