వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఓట్ల పేలాలు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఏరుకుంటున్నారు. తన అన్న వైఎస్ జగన్‌తో ఆమెకు విభేదాలు ఎందుకో ఇంత వరకూ షర్మిల సమాజానికి చెప్పలేదు. కానీ అన్నపై ద్వేషాన్ని, విషాన్ని చిమ్మేందుకు ఆమెకు ఒక సాకు అవసరమైంది. ఆ సాకే వివేకా హత్య. గోతి కాడ గుంట నక్కల గురించి ప్రతి ఒక్కరూ కథగా చదువుకుని వుండొచ్చు. కానీ అంతకు మించి, ఏపీలో ఓట్ల కోసం వివేకా హత్య అంశాన్ని సజీవంగా ఉంచడాన్ని చూస్తున్నారు.
ఇందులో వైఎస్ కుటుంబ సభ్యులే వుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల వ్యవహార శైలి ఎలా వుందంటే… కొండకు వెంట్రుక వేసినట్టు. వస్తే కొండ, పోతే వెంట్రుక. కడప ఎంపీ అవినాష్‌రెడ్డిపై షర్మిల తీవ్ర విమర్శలు వింటే… ఔరా అని ఆశ్చర్యం కలగకుండా వుండదు. ఏకంగా ఆయన్ను హంతుకడంటూ తనే తీర్పు ఇవ్వడం గమనార్హం. దీన్ని బరి తెగింపు అంటే చిన్న మాట అవుతుందేమో!
షర్మిలకు తోడు వివేకా కుమార్తె సునీత. గతంలో వీళ్లిద్దరి మధ్య అంతంత మాత్రమే సంబంధాలు. వైఎస్సార్ జీవించిన రోజుల్లో షర్మిల ఎవరినీ ఖాతరు చేసేవారు కాదని అంటుంటారు. ఇప్పుడు రాజకీయంగా వివేకా హత్యను వాడుకోవాలంటే సునీత అవసరం తప్పనిసరి. అలాగే వైఎస్ కుటుంబంలో కనీసం ఒకరి మద్దతైనా వుందని చెప్పుకోడానికి షర్మిల అవసరం సునీతకు వుంది. ఇలా వ్యక్తిగత ప్రయోజనాలు షర్మిల, సునీతను కలిపాయి.
ఇంతకు మించి, ఇద్దరి మధ్య ప్రేమానుబంధాలకు చోటు లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వివేకా హత్య కేంద్రంగా తన ప్రత్యర్థి అవినాష్‌రెడ్డిపై వివాదాస్పద, సంచలన కామెంట్స్ చేస్తే ఎల్లో మీడియాలో పతాక శీర్షికలకెక్కడంతో పాటు కాసిన్ని ఓట్లు రాలుతాయనే చిన్న అశ షర్మిలలో ఉంది. ఓట్లు రాలడం సంగతి దేవుడెరుగు… ఏందిరా నాయనా మన రాజశేఖరరెడ్డి కూతురు ఇంత దిగజారిందే? మన ప్రియతమ నాయకుడి బిడ్డ అని చెప్పుకోడానికే సిగ్గుగా వుందని తిట్టిపోసే వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
వైఎస్సార్ కుటుంబ పరువు ప్రతిష్టలను బజార్న వేయడానికే మొన్నటి వరకూ తెలంగాణలో తిరుగుతూ అన్ని పార్టీల నేతలపై నోరు పారేసుకుందని గుర్తు చేశారు. ఇప్పుడు మన రాష్ట్రానికి, మన జిల్లాకు వచ్చి నోటికి హద్దూ అదుపూ లేకుండా మాట్లాడుతోందని కడప ప్రజానీకం మండిపడుతున్నారు. అక్కాచెల్లెళ్లూ ప్రచారం చేస్తా వుంటే, పట్టుమని పది మంది కూడా లేరంటే, వీళ్లకు జనం నుంచి ఎలాంటి నిరాదరణ వుందో అర్థం చేసుకోవచ్చనే చర్చకు తెరలేచింది.
వైఎస్సార్ అభిమానులెవరూ తనకు ఓటు వేయరని షర్మిలకు తెలుసని, అయితే ఆమె లక్ష్యం గెలుపు కాదని, జగన్‌ను భ్రష్టు పట్టించడమే అని అభిప్రాయపడుతున్నారు. జూన్ 4న ఫలితాలు వెలువడిన తర్వాత షర్మిల ఏ రాష్ట్రానికి వెళ్తారో చూడాలి అని కడప వాసులు సెటైర్స్ విసురుతున్నారు.