బాబులిద్దరూ ఎమ్మెల్సీ హామీతో… తమ్ముళ్ళు నో…!

అలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా టీడీపీ అధినేతల హామీలు ఉన్నాయని అంటున్నారు. ముందు ఎన్నికల్లో పోటీకి టికెట్ ఇవ్వు స్వామీ అంటే దానిని ఇవ్వలేమని రేపు అధికారం దక్కాక…

అలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా టీడీపీ అధినేతల హామీలు ఉన్నాయని అంటున్నారు. ముందు ఎన్నికల్లో పోటీకి టికెట్ ఇవ్వు స్వామీ అంటే దానిని ఇవ్వలేమని రేపు అధికారం దక్కాక ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తామని పోస్ట్ డేటెడ్ చెక్ లాంటి హామీని ఇస్తున్నారు అని ప్రచారం సాగుతోంది.

అయితే ఈ హామీని నమ్మడానికి చాలా మంది తమ్ముళ్లు ఇష్టపడడం లేదు అంటున్నారు. అరకు ఎమ్మెల్యే టికెట్ ఆశించిన దొన్ను దొరకు ఈ విధంగానే టీడీపీ అధినాయకత్వం ఎమ్మెల్సీ సీటు ఆఫర్ ఇచ్చిందట. అయితే తాను దాన్ని నమ్మలేనని ఎమ్మెల్యే టికెట్ కావాలని ఆయన పట్టుబట్టడం విశేషం.

విజయనగరం ఎస్ కోటలో కూడా ఈ విధంగానే టికెట్ ఆశించి భంగపడిన ఒక ఎన్నారై అభ్యర్ధికి ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చేశారుట.ఆయన కూడా ఆ హామీని పక్కన పెట్టేసి రెబెల్ గా పోటీకి దిగిపోతున్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశలు పెంచుకున్న మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ దంపతులకు షాక్ ఇచ్చేశారు. అయితే మాజీ మంత్రి మాత్రం ఎమ్మెల్సీ ఇస్తామన్నా తమకు అక్కరలేదని చెప్పడం విశేషం.

ఇలా ఒకరిద్దరు కాదు చాలా మంది తమ్ముళ్లు ఎమ్మెల్సీ అంటే నో అనేస్తున్నారు. ఎందుకంటే ముందుగా పార్టీ అధికారంలోకి రావాలి. తీరా వస్తే ఎమ్మెల్సీ సీట్లు కూడా ఏమీ ఎక్కువగా ఉండవు. ఆ సీట్లకు కూడా ఏపీలో ప్రతీ వారికీ హామీలు ఇచ్చేస్తున్నారు. అపుడు రాజు ఎవరో మంత్రి ఎవరో ఎవరికి తెలుసు అన్నదే చాలా మంది ఆలోచన. అందుకే టికెట్ లేకపోతే జనాల వద్దకు వెళ్ళి వారి మద్దతు తీసుకుని పోటీ చేయడానికే చూస్తున్నారు. లక్ కలసి వస్తే ఎమ్మెల్యే కావచ్చు. లేదా తమ బలం ఎంత ఉందో కూడా తెలియచేయవచ్చు. అలా రాజకీయంగా మనుగడ ఉంటుందని నమ్ముతున్న తమ్ముళ్లు చాలా మంది ఎమ్మెల్సీ అంటే ఎందుకు మాకు అనేస్తున్నారు.