రాష్ట్రంలో అధికారం ఎవరిదో స్పష్టంగా చెప్పలేని పరిస్థితులున్నాయి. టీడీపీ, వైసీపీకి కంచుకోట అనుకున్న జిల్లాల్లో రాజకీయ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. దీంతో ఇరు వైపు శ్రేణుల్లోనూ ఆందోళన నెలకుంది.
వైసీపీకి కంచుకోటగా పేరున్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా వున్నాయో తెలుసుకుందాం.
2014లో ఏపీలో టీడీపీ కూటమిని అధికారం వరించింది. ఆ సమయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడింటిని వైసీపీ, మూడు స్థానాలను టీడీపీ గెలుచుకుంది. ఉదయగిరి, వెంకటగిరి, కోవూరు నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపొందింది. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, కావలి, గూడూరు, సర్వేపల్లి, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు.
ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ నెల్లూరులో క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీకి ఒక్క సీటు కూడా రాలేదు. పదికి పది స్థానాల్లో వైసీపీ అభ్యర్థులే గెలుపొందడం విశేషం. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో నెల్లూరులో ఎలా వుంటుందనే చర్చకు తెరలేచింది. ఈ దఫా నెల్లూరులో హోరాహోరీ తలపిస్తోంది. ఇటీవల వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఒక రోజు విరామం ఇచ్చి, నెల్లూరు జిల్లాపై ప్రత్యేకంగా నాయకులతో సమీక్షించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రతి సీటూ గెలవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల వారీగా రాజకీయ పరిస్థితులు ఎలా వున్నాయంటే…
నెల్లూరు సిటీలో వైసీపీ తరపున ఎండీ ఖలీల్ అహ్మద్, టీడీపీ నుంచి మాజీ మంత్రి పొంగూరు నారాయణ పోటీ చేస్తున్నారు. ఏ రకంగా చూసినా టీడీపీకి అనుకూలత కనిపిస్తోంది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ వరుసగా రెండుసార్లు ఇక్కడి నుంచి గెలుపొందారు. అనిల్ చేసిన అభివృద్ధి కంటే, ఆయన సంపాదించుకున్న వ్యతిరేకతే ఎక్కువగా ఇక్కడ కనిపిస్తోంది. దీంతో ఆయన్ను నరసారావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ పంపింది.
తన మనిషి డిప్యూటీ మేయర్‌ను ఎమ్మెల్యే అభ్యర్ధిగా అనిల్ సూచించారు. దీంతో వైసీపీకి ఆర్థికంగా అండగా నిలిచిన ఆ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అధికార పార్టీని వీడి టీడీపీలో చేరారు. వేమిరెడ్డితో పాటు ఆయన భార్య ప్రశాంతిరెడ్డి కూడా టీడీపీ కండువా కప్పుకున్నారు.
ఏ రకంగానూ మాజీ మంత్రి నారాయణకు వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ పోటీ ఇవ్వలేరనే టాక్ వినిపిస్తోంది. ఆర్థికంగా సంపన్నుడైన నారాయణ వ్యూహాత్మకంగా వెళుతున్నారు. గతంలో నారాయణ నేతృత్వంలో సెంట్రల్ డ్రైనేజీ, ప్రతి ఇంటికీ మినరల్ వాటర్ సప్లై, పైప్‌లైన్ల పనులు టీడీపీ అధికారం నుంచి దిగిపోవడంతో ఆగిపోయాయి. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ పనుల్ని గాలికి వదిలేసింది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పటికీ, ఆయన ఏమీ చేయలేదు. అలాగే నారాయణ ప్రతి ఏరియాకు పార్క్ ఏర్పాటు చేశారు. మిగిలిపోయిన ప్రాంతాల్లో తనను గెలిపిస్తే ఏర్పాటు చేస్తానని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు.
నెల్లూరు సిటీలో ఎక్కువగా ఉద్యోగులు ఉన్నారు. వారిలో మెజార్టీ అధికార పార్టీపై వ్యతిరేకంగా ఉన్నారు. నారాయణ ప్రతి వీధికి వాలంటీర్‌ను, డివిజన్‌కు ఇద్దరు చొప్పున కోఆర్డినేటర్లను నియమించుకుని గెలుపు బాటలో పయనిస్తున్నారు. ఇక వైసీపీ బలమంతా సంక్షేమ పథకాల లబ్ధిదారులు, ముస్లిం మైనార్టీ ఓటర్లు, మరికొన్ని సామాజిక వర్గాల ఓటర్లు. నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి ఉండడం ఆ పార్టీకి అంతోఇంతో కలిసొచ్చే అంశం. విజయసాయిరెడ్డి చొరవ తీసుకుని నెల్లూరు సిటీ బాధ్యతల్ని తీసుకుంటే తప్ప, ఆ నియోజకవర్గంపై వైసీపీ ఆశలు వదులుకోవచ్చు.
నెల్లూరు రూరల్‌లో వైసీపీ తరపున ఆదాల ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తలపడుతున్నారు. గతంలో రెండుసార్లు నెల్లూరు రూరల్ నుంచి వైసీపీ తరపున కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గెలుపొందారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన తమ్ముడు గిరిధర్‌రెడ్డిపై భూఆక్రమణల ఆరోపణలున్నాయి. అయితే కోటంరెడ్డి, ఆదాల మధ్య పోల్చితే… స్వల్పంగా ప్రభాకర్‌రెడ్డి వైపే మొగ్గు కనిపిస్తోంది.
ఆత్మకూరులో వైసీపీ , టీడీపీ నుంచి మేకపాటి విక్రమ్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో వెంకటగిరి నుంచి ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ తరపున గెలుపొంది, ఆ తర్వాత జగన్‌ను విభేదించారు. రెండు నెలల క్రితం టీడీపీలో చేరారు. గతంలో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఆత్మకూరు నుంచే మరోసారి ఆయన పోటీ చేస్తున్నారు. గతంలో ఉన్న సంబంధాలు తనకు కలిసొస్తాయని ఆనం భావిస్తున్నారు.
మేకపాటి గౌతమ్‌రెడ్డి అనారోగ్యంతో చనిపోవడంతో ఆయన తమ్ముడు విక్రమ్ ఆత్మకూరు తెరపైకి వచ్చారు. రాజకీయంగా మంచి వ్యూహకర్తగా పేరు సంపాదించుకున్నారు. తక్కువ సమయంలోనే జనానికి చేరువ అయ్యారు. సంక్షేమ పథకాలు, మేకపాటి కుటుంబానికి ఉన్న పలుకుబడి విక్రమ్‌ను గెలిపించే అవకాశాలే ఎక్కువ.
ఆత్మకూరు సమీపంలో ఉండే ఉదయగిరిలోనూ మేకపాటి కుటుంబ సభ్యుడే పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఉదయగిరి నుంచి మేకపాటి చంద్రశేఖరరెడ్డి గెలుపొందారు. అయితే స్వీయ తప్పిదాలతో ఆయన రాజకీయంగా, వ్యక్తిగతంగా అల్లరిపాలయ్యారు. దీంతో టికెట్ ఇవ్వనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారన్న కారణంతో ఆయన్ను వైసీపీ నుంచి గెంటేశారు. అనంతరం ఆయన టీడీపీకి చేరువయ్యారు. అయితే చంద్రబాబు ఆయనకు టికెట్ ఇవ్వలేదు.
మేకపాటి కుటుంబ నుంచి రాజమోహన్‌రెడ్డి మరో తమ్ముడు రాజగోపాల్‌రెడ్డిని బరిలో నిలిపారు. టీడీపీ నుంచి ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ పోటీ చేస్తున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు మనస్థాపం చెందారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. చంద్రబాబు పిలిచి మాట్లాడ్డంతో బొల్లినేని మెత్తబడ్డారు. ప్రస్తుతం ఎన్ఆర్ఐ అభ్యర్థికి మద్దతు ఇచ్చాడే గానీ, క్షేత్రస్థాయిలో తన వాళ్లతో పని చేయిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఏది ఏమైనా ఉదయగిరిలో వైసీపీకే గెలుపు అవకాశాలున్నాయి.
కోవూరు నియోజకవర్గంలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. టీడీపీ ఇన్‌చార్జ్ పోలంరెడ్డి దినేష్‌రెడ్డిని కాదని వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి టికెట్ ఇచ్చారు. దీంతో దినేష్‌రెడ్డి కొంత కాలం అలిగారు. ప్రస్తుతం ప్రశాంతిరెడ్డికే పని చేస్తున్నారు. ప్రశాంతిరెడ్డి రాకను వ్యతిరేకిస్తూ కొంత మంది టీడీపీ నాయకులు వైసీపీలో చేరారు. అలాగే ఇటు వైపు నుంచి అటు వైపు కొందరు వెళ్లారు. ప్రశాంతిరెడ్డి డబ్బు వైసీపీ నేతల్ని బాగా ఆకర్షిస్తోంది. మరోవైపు కోవూరు వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వద్ద డబ్బు అంతంత మాత్రమే. అయితే ఇక్కడ వైసీపీ అభ్యర్థికి కలిసొచ్చే అంశం దళిత ఓట్లు. ఈ నియోజకవర్గంలో వారి ఓట్లు ఎక్కువ. సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎక్కువగా ఉండడం, జగన్‌పై విధేయత ప్రదర్శిస్తుండడం అధికార పార్టీకి కలిసొచ్చే అంశం. సంక్షేమ పథకాల లబ్ధిదారులైన పేద, బడుగు వర్గాలే నల్లపురెడ్డికి శ్రీరామ రక్ష. ప్రస్తుతానికి వైసీపీ, టీడీపీ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ప్రశాంతిరెడ్డి డబ్బు రాజకీయానికి వైసీపీ అడ్డుకట్ట వేయలేకపోతే అనూహ్య ఫలితం రావొచ్చు.
కావలిలో వైసీపీ నుంచి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, టీడీపీ తరపున పారిశ్రామికవేత్త కావ్య కృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు. రామిరెడ్డిపై వ్యతిరేకత వుందనే కారణంతో అభ్యర్థిని మారుస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆయన్నే వైసీపీ బరిలో నిలిపింది. అయితే టీడీపీలో వర్గ విభేదాలున్నాయి. టీడీపీ ఇన్‌చార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు , మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, బీద రవిచంద్ర ఈ సీటును ఆశించి భంగపడ్డారు.
ఇటీవల వైఎస్ జగన్ సమక్షంలో విష్ణువర్ధన్‌రెడ్డి వైసీపీలో చేరడం రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి కలిసొచ్చే అంశం. అలాగే రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావుకు ఆ నియోజకవర్గంలోని మత్స్యకారులతో మంచి సంబంధాలున్నాయి. బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ కావలి డివిజన్ వ్యవస్థాపక అధ్యక్షుడితో సహా వైసీపీలో చేరారు. అలాగే తెలుగు మహిళ రాష్ట్ర నాయకురాలు కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. వీళ్లంతా టీడీపీ వీడడానికి కావ్య కృష్ణారెడ్డి అహంకారమే కారణం అంటున్నారు. మరీ ముఖ్యంగా కావ్య కృష్ణారెడ్డి తన కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు పార్టీ బాధ్యతల్ని అప్పగించడంతో, నిజమైన నాయకులు తీవ్ర అసంప్తికి గురి అవుతున్నారు.
దీంతో ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవుతున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఒంటేరు, కావ్య కృష్ణారెడ్డి జలదంకి మండలవాసులు. ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలున్నాయి. ఒంటేరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావ్య కృష్ణారెడ్డి జలదంకి ఎంపీపీగా ఉన్నారు. ఇప్పటికీ ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేవు. కానీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కోసం ఒంటేరు టీడీపీలో చేరారు. మాలేపాటి సుబ్బానాయుడు, బీద రవిచంద్ర పైకి టీడీపీకి పని చేస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ, అంతర్గతంగా వ్యతిరేకం చేస్తారనే ప్రచారం వుంది. ఇవన్నీ వైసీపీకి అనుకూలంగా మారుతున్నాయి. దీంతో కావలిలో వైసీపీ గెలుస్తుందన్న వాతావరణం నెలకుంది.
సర్వేపల్లిలో వైసీపీ తరపున మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, టీడీపీ నుంచి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తలపడుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు సర్వేపల్లిలో కాకాణిపై సోమిరెడ్డి ఓడిపోయారు. అలాగే వరుసగా ఐదు సార్లు ఓడిపోయిన ఘనత సోమిరెడ్డిది. ఈ దఫా మరోసారి ఆయన బరిలో నిలిచారు. ఇక్కడ కాకాణి విజయం గురించి మరో ఆలోచనే చేయాల్సిన అవసరం లేదు.
గూడూరు (ఎస్సీ రిజర్వ్‌డ్) నియోజకవర్గం నుంచి వైసీపీ, టీడీపీ తరపున మేరిగ మురళీధర్, పాశం సునీల్‌కుమార్ తలపడుతున్నారు. గూడూరు టౌన్‌లో టీడీపీకి కొద్దిగా అనుకూలత కనిపిస్తోంది. అయితే సునీల్‌ను గెలిపిస్తే అనవసరంగా ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టిస్తారనే భయం గూడూరు పట్టణవాసుల్లో వుంది. వైసీపీ అభ్యర్థి మెతకతనం కలిసొస్తుంది. గూడూరు రూరల్‌లో టీడీపీ, వైసీపీ బలాబలాలు సరిసమానంగా ఉన్నాయి. మిగిలిన మండలాలు చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో వైసీపీ ఆధిక్యత కనబరుస్తోంది. అన్నిటికి మించి ఇక్కడ వైసీపీ ముఖ్య నాయకులంతా కలిసి పని చేస్తున్నారు. దీంతో ఇక్కడ వైసీపీ విజయం ఖాయమని మెజార్టీ అభిప్రాయం.
వెంకటగిరి బరిలో వైసీపీ తరపున మాజీ ముఖ్యమంత్రి దివంగత నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి తనయుడు రామ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీసాయి ప్రియ పోటీ చేస్తున్నారు. హోరాహోరీ పోరు నడుస్తోంది. వైసీపీలో అసంతృప్తులు ఎక్కువే. ఇంత కాలం ఇక్కడ ఆనం రామనారాయణరెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగారు. టీడీపీలో చేరిన ఆయన ఆత్మకూరు నుంచి పోటీ చేస్తున్నారు. అనంతరం రామ్‌కుమార్‌రెడ్డికి వైసీపీ పగ్గాలు చేతికి ఇచ్చింది.
అయితే నాయకుల్ని కార్యకర్తల్ని సరిగా పట్టించుకోరని రామ్‌కుమార్‌రెడ్డిపై సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వుంది. ఇటీవల రామ్‌కుమార్‌రెడ్డి తల్లి, మాజీ మంత్రి రాజ్యలక్ష్మి రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు. దీంతో వారంతా దారికొస్తున్నారు. అలాగే వెంకటగిరి టౌన్‌లో రాజా సర్వజ్ఞ యాచేంద్ర మద్దతు వైసీపీకి కలిసొచ్చే అంశం. అలాగే ఇటీవల టీడీపీ బీసీ నాయకుడు మస్తాన్ యాదవ్ టీడీపీలో చేరడం కూడా అధికార పార్టీకి రాజకీయంగా ఎంతో ప్రయోజనం.
మరోవైపు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ రౌడీయిజం చేస్తారనే భయం వుంది. అలాగే రామకృష్ణ కాకుండా, ఆయన కుమార్తె నిలబడడంతో అభ్యర్థి గుర్తింపు సమస్య కూడా టీడీపీకి నష్టం తెస్తోంది. అయినప్పటికీ వైసీపీకి వెంకటగిరిలో చెప్పుకో దగ్గ సానుకూలత లేదు. ప్రస్తుతానికి వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. చివరి వరకూ గెలుపు ఎవరిదో చెప్పలేని పరిస్థితి.
సూళ్లూరుపేటలో వైసీపీ తరపున కిలివేటి సంజీవయ్య, టీడీపీ నుంచి ఆ పార్టీ ఇన్‌చార్జ్ నెలవల సుబ్రమణ్యం కుమార్తె, డాక్టర్ విజయశ్రీ బరిలో ఉన్నారు. కిలివేటికి టికెట్ ఇవ్వొద్దని పెద్ద ఎత్తున సొంత పార్టీలోని ఆయన వ్యతిరేకులు ఆందోళనలు నిర్వహించారు. అయినప్పటికీ ఆయన వైపే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొగ్గు చూపారు. ఇక టీడీపీ విషయానికి వస్తే నెలవల సుబ్రమణ్యం కుమార్తెకు టీడీపీ నాయకులు , కార్యకర్తల నుంచి పెద్దగా ఆదరణ లభించడం లేదు. ఒక దశలో ఆమెను మారుస్తారనే ప్రచారం కూడా బాగా జరిగింది. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు.
కిలివేటిపై సొంత పార్టీ నేతల్లో అసంతృప్తి నెమ్మదిగా తగ్గుతోంది. వైసీపీని గెలిపించుకోవాలనే పట్టుదల క్రమంగా పెరుగుతోంది. టీడీపీ నుంచి వలసలు కూడా పెరిగాయి. సంజీవయ్య గతంలో తన వైపు నుంచి జరిగిన తప్పిదాలకు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పడం కూడా, వ్యతిరేకులు చల్లబడేలా చేసింది. అంతా కలిసి జగన్‌ను మరోసారి సీఎం చేసుకోవాలనే ఏకైక ఆలోచనే సంజీవయ్య గురించి వ్యతిరేకులు ఆలోచింప చేయనివ్వడం లేదు. ప్రస్తుతానికి వైసీపీ తప్పనిసరిగా గెలిచే నియోజకవర్గాల్లో సూళ్లూరుపేట పేరు రాసుకోవచ్చు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో నెల్లూరు సిటీ టీడీపీ, అలాగే సర్వేపల్లి, సూళ్లూరుపేట, ఆత్మకూరు, గూడూరు, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుంది. నెల్లూరు రూరల్, వెంకటగిరి, కోవూరు నియోజకవర్గాల్లో పోటీ నువ్వానేనా అన్నట్టుగా వుంది. వైసీపీకి కంచుకోట లాంటి నెల్లూరు నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఇదీ.