ఒక్క‌టిగా వెళ్లి…బాబును ఢీకొట్టిన‌ ధీర మ‌హిళ‌!

విజ‌య‌వాడ‌లో మాన‌సిక విక‌లాంగురాలిపై లైంగిక‌దాడి రాజ‌కీయ పులుముకుంది. ఈ ఘ‌ట‌న‌ను రాజ‌కీయంగా సొమ్ము చేసుకోవాల‌ని ప్ర‌ధాన ప్ర‌తిపక్షం టీడీపీ ఉత్సాహం ప్ర‌ద‌ర్శించింది. అయితే మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ రూపంలో టీడీపీకి అడ్డంకి…

విజ‌య‌వాడ‌లో మాన‌సిక విక‌లాంగురాలిపై లైంగిక‌దాడి రాజ‌కీయ పులుముకుంది. ఈ ఘ‌ట‌న‌ను రాజ‌కీయంగా సొమ్ము చేసుకోవాల‌ని ప్ర‌ధాన ప్ర‌తిపక్షం టీడీపీ ఉత్సాహం ప్ర‌ద‌ర్శించింది. అయితే మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ రూపంలో టీడీపీకి అడ్డంకి ఎదురైంది. బాధితురాలిని ప‌రామ‌ర్శించ‌డానికి ఒక్క‌టిగా వెళ్లిన వాసిరెడ్డి ప‌ద్మ‌ను చంద్ర‌బాబు నేతృత్వంలో ఎల్లో బ్యాచ్ చుట్టుముట్టినా …ఆమె అద‌ర‌లేదు, బెద‌ర‌లేదు.

చంద్ర‌బాబు త‌న‌దైన స్టైల్‌లో క‌ళ్లు పెద్ద‌వి చేసి, గుడ్లురుముతూ, చేయి చూపిస్తూ బెదిరించినా వాసిరెడ్డి ప‌ద్మ … త‌గ్గేదే లే అని అదే స్థాయిలో స్పందించారు. బాబుతో పాటు మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, పంచుమ‌ర్తి అనురాధ‌, ఇత‌ర మ‌హిళా నాయ‌కురాళ్లు గ‌ట్టిగా కేక‌లు వేస్తూ వాసిరెడ్డి ప‌ద్మ‌ను భ‌య‌పెట్టి అక్క‌డి నుంచి పంపేందుకు కుట్ర‌ప‌న్నారు. విజ‌య‌వాడ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో వాసిరెడ్డి ప‌ద్మ చుట్టూ ఎల్లో బ్యాచ్ చుట్టుముట్ట‌డం… కౌర‌వ‌స‌భ‌లో ద్రౌప‌ది ప‌రాభ‌వ సీన్‌ను గుర్తు చేసింది. అయితే  కౌర‌వ‌స‌భ‌లో ద్రౌప‌ది ప‌రాభ‌వానికి గురైతే, ఇక్క‌డ మాత్రం వాసిరెడ్డి ప‌ద్మ ప్ర‌తిఘ‌టించింది. ఇక్క‌డ రాజ‌కీయాలు చేయ‌డానికి వ‌చ్చావా? అని చంద్ర‌బాబు గ‌ద్దిస్తే, అదే ప్ర‌శ్న నేన‌డుగుతున్న అని వాసిరెడ్డి ప‌ద్మ నిల‌దీసింది.

నాలుగు ద‌శాబ్దాల పైబ‌డి సీనియార్టీని, 14 ఏళ్ల ప‌రిపాల‌నా అనుభ‌వాన్ని, అలాగే ప్ర‌తిప‌క్ష నేత‌గా సుదీర్ఘ కాలం ప‌ని చేసిన అనుభ‌వాన్ని వాసిరెడ్డి ప‌ద్మ ఒక్క ప్ర‌శ్న‌తో నిల‌దీసిన‌ట్టైంది. అస‌లు అత్యాచార బాధితురాలిని ప‌రామ‌ర్శించ‌డానికే వెళ్ల‌కుండా అడ్డుకోవాల‌నే టీడీపీ ప్ర‌య‌త్నాల్ని వాసిరెడ్డి ప‌ద్మ తిప్పికొట్టారు. బాధితురాలిని ప‌రామ‌ర్శించి, అక్కున చేర్చుకోవ‌డాన్ని టీడీపీ జీర్ణించుకోలేక‌పోయింది. మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌తో పాటు మ‌హిళ అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నోర్ముయ్ అని బొండా త‌న స‌హ‌జ స్వ‌భావాన్ని బ‌య‌ట‌పెట్టుకున్నాడు. ఇందుకు చంద్ర‌బాబు సాక్షిగా నిలిచి, పైశాచిక‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించారు.

అత్యాచార బాధితురాలి ప‌రామ‌ర్శ‌ను కూడా రాజ‌కీయ వివాదానికి దారి తీసేలా చేయ‌డం చంద్ర‌బాబుకే చెల్లింది. అయితే వాసిరెడ్డి ప‌ద్మ ముందు వారి ఆట‌లు సాగ‌లేదు. త‌న స్థాయిని దిగ‌జార్చుకుని వాసిరెడ్డి ప‌ద్మ‌తో వాద‌న‌కు దిగ‌డం చంద్ర‌బాబు ప‌త‌నానికి నిద‌ర్శ‌న‌మనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో విజ‌య‌వాడ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌ల‌ను మ‌హిళా క‌మిష‌న్ సీరియ‌స్‌గా తీసుకుంది.

ఈ విష‌య‌మై చంద్ర‌బాబు, బొండా ఉమాకు రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ శుక్ర‌వారం స‌మ‌న్లు జారీ చేసింది. ఈ నెల 27న ఉద‌యం 11 గంట‌ల‌కు మంగ‌ళ‌గిరిలోని రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ కార్యాల‌యానికి చంద్ర‌బాబు, బొండా ఉమా స్వ‌యంగా రావాల‌ని వాసిరెడ్డి ప‌ద్మ స‌మ‌న్లు జారీ చేశారు. అవినీతి కేసుల్లో కూడా చంద్ర‌బాబు ఏనాడూ కోర్టు మెట్లు ఎక్క‌లేదు. త‌న‌దైన మేనేజ్‌మెంట్ విద్య‌తో వ్య‌వ‌స్థ‌ల విచార‌ణ నుంచి త‌ప్పించుకుంటూ వ‌చ్చారు. 

కానీ మ‌హిళా క‌మిష‌న్ విచార‌ణ అయినా ఎదుర్కొంటారో లేక త‌న‌దైన దారిలో వెళ్లి స్టే తెచ్చుకుంటారో చూడాలి. మ‌హిళ‌లను కించ‌ప‌రిచే అంశాల‌కు సంబంధించి విచార‌ణ‌ను అడ్డుకునే ఆస్కారం ఉండ‌ద‌ని న్యాయ‌వ‌ర్గాలు చెబుతున్నాయి. అదే జ‌రిగితే చంద్ర‌బాబును విచారించిన మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా వాసిరెడ్డి ప‌ద్మ చ‌రిత్ర‌లో నిలిచిపోతారు. చూద్దాం ఏమ‌వుతుందో.