తెలంగాణ గవర్నర్ తమిళిసై, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కొంత కాలంగా విభేదాలున్నాయి. ఈ గొడవ రోజుకో మలుపు తిరుగుతోంది. గవర్నర్ తమిళిసై కాస్త స్పీడ్ పెంచారు. మెడికల్ సీట్ల అవకతవకలపై వెంటనే నివేదిక సమర్పించాలని సంబంధిత వీసీని ఆమె ఆదేశించారు. అలాగే బీజేపీ కార్యకర్తతో పాటు మరో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంపై కూడా ఆమె జోక్యం చేసుకున్నారు. అసలేం జరిగిందో నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆమె ఆదేశించారు.
గవర్నర్ వైఖరి తెలంగాణ సర్కార్ పుండుపై కారం చల్లినట్టుగా ఉంది. మరోవైపు గవర్నర్ పరిధి దాటి నడుచుకుంటున్నారని మంత్రులు విమర్శలకు పదును పెట్టారు. రాజకీయ నాయకుల్లా ఆమె విమర్శలు చేస్తున్నారని మండిపడుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్తో కలిసి పని చేయడం కష్టమని ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.
ఈ గొడవలోకి తాజాగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తలదూర్చారు. ఆయన మరో వివాదాన్ని తెరపైకి తేవడం చర్చనీయాంశమైంది. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తన పీఆర్వోగా బీజేపీ సభ్యుడిని గవర్నర్ నియమించు కోవడాన్ని ఆయన తప్పు పట్టారు.
ఇది చాలా అక్రమమని అన్నారు. ఈ నియామకం వల్ల తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ చేస్తున్న ఫిర్యాదులు … రాజకీయంగా చాలా అనుమానాలకు తావిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఢీ అంటే ఢీ అని గవర్నర్ తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీఆర్వో నియామకంపై వెల్లడైన అనుమానాలపై గవర్నర్ స్పందన ఎలా ఉంటుందోననే ఆసక్తి నెలకుంది.