ఉక్కులో మూడు ముక్కలాట

విశాఖ ఉక్కు కర్మాగారం ఇపుడు ప్రైవేటుకు గురి అవుతోంది. ఒక విధంగా బలిపీఠం మీద ఉంది. దాన్ని బతికించుకోవాలన్న ఆలోచనతో గత ఏడాదిగా ఉక్కు కార్మిక సంఘాలు అన్నీ ఏకత్రాటి మీదకు వచ్చి పోరాడుతున్నాయి.…

విశాఖ ఉక్కు కర్మాగారం ఇపుడు ప్రైవేటుకు గురి అవుతోంది. ఒక విధంగా బలిపీఠం మీద ఉంది. దాన్ని బతికించుకోవాలన్న ఆలోచనతో గత ఏడాదిగా ఉక్కు కార్మిక సంఘాలు అన్నీ ఏకత్రాటి మీదకు వచ్చి పోరాడుతున్నాయి. ఈ నేపధ్యంలో వచ్చి పడ్డ ఉక్కు గుర్తింపు యూనియన్ ఎన్నికలు కార్మిక యూనియన్ల మధ్యన  ఐక్యతను చీల్చేస్తున్నాయి.

ఎవరి మటుకు వారు తామే అధికార కార్మిక సంఘంగా నెగ్గాలన్న ఉద్దేశ్యంతో ఎన్నికల సమరంలో యూనియన్లు  ధీటుగా పాల్గొంటున్నాయి. ఇప్పటిదాకా అధికారంలో ఉన్న సీఐటీయూ, అధికారంలోకి రావాలని ఏఐటీయూసీ, ఇంకో వైపు ఐఎంటీయూసీ ఇలా విశాఖ ఉక్కులో పోరు ముమ్మరంగా సాగుతోంది.

మరి కీలక సమయంలో ఎన్నికలు జరుగుతున్నాయి. రేపటి రోజున ఎవరు గెలిచినా మిగిలిన వారు సహకరిస్తారా అన్నది చూడాలి. గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో గెలుపు కంటే ప్రైవేట్ పరం చేస్తున్న కేంద్రం మీద గెలుపు అతి ముఖ్యమని కార్మిక నాయకులు అంటున్నారు. పదివేలకు పై చిలుకు ఓటర్లు ఉన్నారు. తొమ్మిది సంఘాల నుంచి అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు.

మరి రేపటి రోజున ఎవరు గెలిచినా ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగించేలా చూస్తామని ప్రతిజ్ఞ‌ చేయాలని కార్మికులు అంటున్నారు. ఈ నెల 23న ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగే ఉక్కు ఎన్నికల ఫలితాలు విశాఖ ఉక్కు భవితవ్యాన్ని ఒక విధంగా తేల్చబోతున్నాయనే చెప్పాలి.