వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు శుభవార్త. తెలంగాణలో కాళ్లరిగేలా తిరుగుతూ, అధికార, ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నా షర్మిలను ఎవరూ పట్టించుకోని సంగతి తెలిసిందే. అలాంటి షర్మిల గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ సీరియస్ కామెంట్స్ చేశారు. విమర్శలే అయినప్పటికీ, తన ఉనికిని గుర్తించినందుకు షర్మిల సంతోషించాల్సిన క్షణాలని చెప్పక తప్పదు.
ఒక ప్రముఖ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ అనేక అంశాలపై మనసు విప్పి మాట్లాడారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు కేఏ పాల్, ప్రవీణ్‌కుమార్ (బీఎస్పీ), వైఎస్సీర్‌టీపీ అధినేత్రి షర్మిల ప్రతిపక్షాలు కావచ్చేమో అని వెటకరించారు.
ఈ ముగ్గురు నేతల పేర్లను ప్రస్తావించడం ద్వారా ప్రధాన ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీజేపీల ఉనికిని వ్యూహాత్మకంగా కేటీఆర్ గుర్తించలేదు. అలాగే కేంద్రప్రభుత్వాన్ని షర్మిల, ప్రవీణ్‌కుమార్ తదితరులు విమర్శించని నేపథ్యంలో, వారి వెనుక ఏ పార్టీలున్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు.
అసలు షర్మిలకు తెలంగాణలో పని ఏంటని ప్రశ్నించారు. తెలంగాణతో ఆమెకు ఏం సంబంధమని నిలదీశారు. అన్న (ఏపీ సీఎం వైఎస్ జగన్)తో గొడవ వుంటే ఆంధ్రాలో చూసుకోవాలని షర్మిలకు కేటీఆర్ హితవు చెప్పడం గమనార్హం.
ఒకప్పుడు తెలంగాణకు వెళ్లాలంటే వీసాలు, పాస్‌పోర్టులు తీసుకోవాలా అని షర్మిల తండ్రి దివంగత వైఎస్సార్ అన్న మాటలను కేటీఆర్ గుర్తు చేశారు. విమర్శ, పొగడ్తలకు నోచుకోని షర్మిలను కేటీఆర్ గుర్తు పెట్టుకుని సెటైర్స్ విసరడం విశేషం. కేటీఆర్ విమర్శలపై షర్మిల ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.