జనసేనాని పవన్‌కల్యాణ్‌తో బీజేపీ తెగదెంపులు చేసుకుందా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతితో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. ఆత్మకూరు అభ్యర్థిగా గౌతమ్‌రెడ్డి తమ్ముడు విక్రమ్‌రెడ్డి పేరును కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పంపారు. ఎన్నిక నోటిఫికేషన్ రావడమే ఆలస్యం … విక్రమ్‌రెడ్డి వైసీపీ తరపున బరిలో నిలవడం ఖాయం.
ఈ నేపథ్యంలో బీజేపీ ఇప్పటి నుంచే ఆత్మకూరు ఉప ఎన్నికకు సిద్ధమవుతోంది. మేకపాటి కుటుంబం నుంచే బీజేపీ అభ్యర్థి బరిలో నిలుస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు నెల్లూరులో బీజేపీ పదాధికారుల సమావేశంలో సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఆత్మకూరులో జరిగే ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేస్తుందని తేల్చి చెప్పారు. అభ్యర్థిని నిలబెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని సోము వీర్రాజు ప్రకటించడం విశేషం.
జనసేన, బీజేపీ పొత్తులో ఉన్న నేపథ్యంలో… ఆత్మకూరు అభ్యర్థి విషయమై సోము వీర్రాజు ఏకపక్షంగా ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ రెండు పార్టీల మధ్య ఎడబాటును సోము వీర్రాజు ప్రకటన ప్రతిబింబిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీ వైపు జనసేన మొగ్గు చూపుతున్న నేపథ్యంలో బీజేపీ గుర్రుగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. అందుకే జనసేనతో సంబంధం లేకుండా బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించిందనే చర్చకు తెరలేచింది. ఆత్మకూరులో బీజేపీ పోటీపై జనసేన ఎలా స్పందిస్తుందో!