కోతికి కొబ్బరి చిప్ప.. బాబుకి నోటీసు

అసలే విజయవాడ అత్యాచారం వ్యవహారంతో ప్రభుత్వంపై విమర్శలొస్తున్నాయి. ఈ దశలో చంద్రబాబుకి మహిళా కమిషన్ తరపున నోటీసు ఇచ్చి ఆయన్ని సీన్ లోకి లాగాలా..? విజయవాడ అత్యాచారాన్ని మరిన్ని రోజులు లైమ్ లైట్ లో…

అసలే విజయవాడ అత్యాచారం వ్యవహారంతో ప్రభుత్వంపై విమర్శలొస్తున్నాయి. ఈ దశలో చంద్రబాబుకి మహిళా కమిషన్ తరపున నోటీసు ఇచ్చి ఆయన్ని సీన్ లోకి లాగాలా..? విజయవాడ అత్యాచారాన్ని మరిన్ని రోజులు లైమ్ లైట్ లో ఉంచాలా..? జరగరాని ఘోరం జరిగిపోయింది, ఇద్దరు పోలీసులు సస్పెండ్ అయ్యారు. 10లక్షల రూపాయల పరిహారం ఇచ్చారు. అక్కడితో అలాంటి దుర్ఘటనను అందరూ మరచిపోయి, అలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టిపెట్టాలి.

కానీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ ని అడ్డుకుని అవమానించారంటూ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుతో చంద్రబాబు విచారణకు రావాలంటూ నోటీసిచ్చారు. ఇలాంటి వాటితో ఎల్లో మీడియా ఎంత రాద్ధాంతం చేస్తుందో అందరికీ తెలిసిందే..? నోటీసులతో వచ్చేదేంటి..? చంద్రబాబు అండ్ కో కి కొన్నిరోజులు చేతులారా సమస్యలను అందించి ప్రభుత్వంపై నిందలేయించడం దేనికి..?

ఈనెల 27 ఉదయం మంగళగిరిలోని మహిళా కమిషన్ కార్యాలయానికి వచ్చి విచారణ ఎదుర్కోవాలంటూ చంద్రబాబు, బొండా ఉమా సహా మరికొందరికి నోటీసులందాయి. అసలు ఈ నోటీసుల ఉద్దేశం ఏంటి..? విజయవాద దుర్ఘటనను చంద్రబాబు రాజకీయం చేయాలనుకున్నారు సరే, అక్కడికొచ్చిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ తో దురుసుగా మాట్లాడారు సరే, ఆమెను లోపలకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు సరే.. దానికి ప్రతిగా ఇలా వ్యక్తిగత కక్ష తీర్చుకున్నట్టు చంద్రబాబుకి నోటీసులిస్తే పోలీసుల వైఫల్యాన్ని ఎలుగెత్తి చాటినట్టే కదా. 

నిందితుల్ని పట్టుకోవడంలో శ్రద్ధ చూపించని ప్రభుత్వం, బాధితుల తరపున పోడాడటానికి వెళ్లిన ప్రతిపక్ష నాయకులకు నోటీసులిచ్చిందనే అపప్రధ మూటగట్టుకున్నట్టే..!

వాస్తవానికి భావోద్వేగాలు పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు అక్కడికి వాసిరెడ్డి పద్మ వచ్చినా, సీఎం జగన్ వచ్చినా కచ్చితంగా స్థానికులు అడ్డుకుంటారు, అనరాని మాటలంటారు. ఇక్కడ సమస్య ఏంటంటే.. ఒకవేళ పరామర్శకు ఎవరూ రాకపోయినా టీడీపీ అనుకూల మీడియా చేసే రాద్ధాంతం అంతా ఇంతా కాదు. అందుకే అక్కడ పరిస్థితి అనుకూలంగా లేకపోయినా మహిళా కమిషన్ తరపున చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వెళ్లారు. 

బాధితుల ముసుగులో టీడీపీ కార్యకర్తలు ఆమెను అడ్డుకున్నారు. అయితే అక్కడితో ఆమె సంయమనం పాటించి ఉంటే హుందాగా ఉండేది. చంద్రబాబుకి నోటీసులిచ్చి ఆయన్ను కమిషన్ కార్యాలయానికి లాక్కొస్తున్నామనే క్రెడిట్ కోసం ప్రయత్నించినట్టు కనిపిస్తోంది.

ప్రతిపక్షం కంటే, ప్రతిపక్ష మీడియాతోనే మనం ఎక్కువగా యుద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ పదేపదే చెబుతున్నారు. ఇలాంటి సందర్భంలో బాబుకి నోటీసులివ్వడమంటే.. ఎల్లో మీడియా చేతికి పెద్ద అస్త్రాన్ని అందించినట్టే. విచారణ రోజు చంద్రబాబు ఆడే హైడ్రామా, ఆయన అనుకూల మీడియా చేసే రాద్ధాంతానికి అంతా రెడీ అవ్వాల్సిందే.