తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలుగా పలు మార్లు గెలిచిన ఎమ్మెల్యేలుగా ఆ ఇద్దరికీ చంద్రబాబు వద్ద ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే ఆయన మరో మాట లేకుండా తొలి విడత జాబితాలోనే ఆ ఇద్దరి పేర్లు ప్రకటించేశారు. వారిలో ఒకరు విశాఖ తూర్పు నుంచి సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడి రామక్రిష్ణ బాబు. రెండవవారు విశాఖ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబు.
ఇందులో వెలగపూడి ఎమ్మెల్యేగా పదిహేనేళ్ళు పూర్తి చేశారు. నాలుగవ విడత గెలిచేందుకు ఆయన చూస్తున్నారు. ఆయన పట్ల నెమ్మదిగా వ్యతిరేకత మొదలైంది అని వైసీపీ నేతలు అంటున్నారు. ఇప్పటిదాకా వెలగపూడి గెలుస్తున్నారు అంటే అది వైసీపీ వైఫల్యం కూడా అంటున్నారు. సరైన అభ్యర్ధిని నిలబెట్టడంతో వైసీపీ చేసిన పొరపాట్లు ఆయనకు వరం అవుతూ వచ్చాయి అంటున్నారు.
ఇదిలా ఉంటే 2019లో చివరి నిముషంలో వైసీపీ అభ్యర్ధిని మార్చి పొరపాటు చేసింది. దాని పుణ్యం వెలగపూడి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు అని ఫ్యాన్ పార్టీలో అంటున్నారు. ఇపుడు అలా కాకుండా ఏడాదికి ముందే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను అక్కడ దింపేశారు. వెలగపూడి నియోజకవర్గాన్ని ఇప్పటికి అనేకసార్లు చుట్టేశారు. జనాలతో డైరెక్ట్ ఇంటరాక్షన్ పెట్టుకున్నారు. ఆయన ప్రచార హోరు ఒక స్థాయిలో సాగుతోంది.
నాకు చాన్స్ ఇవ్వండి ఈసారికి అని జనాలకు కొత్త ఆశలు కల్పిస్తున్నారు. దాని మీద జనాలలో చర్చ సాగుతోంది. వెలగపూడికే మళ్ళీ మళ్ళీ ఎందుకు ఓటు ఈసారికి కొత్త ముఖాన్ని చూడవచ్చు కదా అన్న వైసీపీ స్లోగన్ బలంగా పనిచేస్తే తూర్పులో సైకిల్ పార్టీకి ఇబ్బందులే అంటున్నారు.
విశాఖ పశ్చిమలోనూ అలాగే సీన్ ఉంది. అక్కడ కూడా గత రెండు ఎన్నికల్లో వైసీపీ చేసిన తప్పులు ఈసారి చేయలేదు ఏడాది ముందు నుంచే విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ ని ఇదే మీ సీటు అని చెప్పి జనంలోకి పంపించేసింది. దాంతో ఆయన పశ్చిమలో ప్రతీ గుమ్మం లోకి వెళ్ళగలిగారు. జనాలకు తాను ఆల్టర్నేషన్ గా ఉన్నాను అని చెప్పగలిగారు.
ఇపుడు చూస్తే ఈ రెండు సీట్లలో సిట్టింగులు ఇద్దరూ గెలుపు కోసం ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది అని అంటున్నారు. విశాఖ సిటీలో తెలుగుదేశం గాలి వీస్తుంది అని పోటీ చేయడమే గెలుపు సులువు అనుకుంటే మాత్రం ఈసారి తేడా కొట్టడం ఖాయం అంటున్నారు. ఈ రెండు సీట్లలో వైసీపీ ఖాయంగా గెలుస్తుంది అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇదే కనుక జరిగితే విశాఖ ఎంపీ సీటుకు కూడా టీడీపీకి షాక్ తగులుతుంది అంటున్నారు