షటిల్ సర్వీస్ చేస్తున్న బొత్స!

వైసీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణకు ఈసారి ఎన్నికలు చాలా పెద్ద పని చెబుతున్నాయి. ఆయన గతంలో అయితే విజయనగరం జిల్లా వరకే పరిమితం అయ్యేవారు. ఈసారి ఆయన సతీమణి బొత్స ఝాన్సీలక్ష్మి విశాఖ…

వైసీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణకు ఈసారి ఎన్నికలు చాలా పెద్ద పని చెబుతున్నాయి. ఆయన గతంలో అయితే విజయనగరం జిల్లా వరకే పరిమితం అయ్యేవారు. ఈసారి ఆయన సతీమణి బొత్స ఝాన్సీలక్ష్మి విశాఖ ఎంపీగా వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. దాంతో బొత్స విశాఖ జిల్లా మీద దృష్టి పెడుతున్నారు.

ఆయన విశాఖ విజయనగరం జిల్లాల మధ్యన షటిల్ సర్వీస్ చేస్తున్నారు అని సెటైర్లు పడుతున్నాయి. బొత్స ఉదయం విశాఖలో ఉంటే సాయంత్రం విజయనగరంలో ఉంటున్నారు. ఆయన విజయనగరం రాజకీయాలను చక్కబెడుతూ విశాఖ జిల్లా వైపు కూడా చూస్తున్నారు.

విశాఖ ఎంపీగా వైసీపీ విజయం సాధించాలంటే ఎస్ కోట భీమిలీ నియోజకవర్గాలలో మెజారిటీ బాగా రావాల్సి ఉంటుంది. దాంతో ఈ రెండు నియోజకవర్గాల మీద ఆయన ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. మూడు లక్షలకు పైగా ఓటర్లు భీమిలీలో ఉన్నారు. ఇక్కడ కాపుల జనాభా పాతిక శాతం పైగా ఉంది.

అలాగే ఎస్ కోటలో రెండున్నర లక్షల దాకా ఓటర్లు ఉన్నారు. ఇందులో కాపులు ఎక్కువగా ఉన్నారు. దాంతో ఈ రెండింటి మీద బొత్స కసరత్తు చేస్తున్నారు. అలాగే విశాఖలోని గాజువాక, విశాఖ తూర్పు నియోజకవర్గాలలో ఆయన తనదైన శైలిలో సలహా సూచనలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. గాజువాకలో మంత్రి గుడివాడ అమర్నాథ్ పోటీలో ఉన్నారు.

మొదట్లో ఆయన అభ్యర్ధిత్వం పట్ల సొంత పార్టీలో వ్యతిరేకత కొంత వచ్చినా ఇపుడు అంతా సర్దుకుంది. విశాఖ తూర్పులో అయితే ఎంపీ ఎన్నికల ఆఫీసుని ఏర్పాటు చేసి బీసీల ఓట్లు వైసీపీ వైపు టర్న్ అయ్యేలా సీనియర్ మంత్రి రాజకీయ వ్యూహ రచన చేస్తున్నారు.

బొత్స రాజకీయ అనుభవానికి ఈసారి ఎన్నికలు పరీక్షగానే చెబుతున్నారు. ఈసారి ఆయన వ్యూహాలు ఫలిస్తే విశాఖ విజయనగరం రెండు జిల్లాలలో వైసీపీ హవా బలంగా వీస్తుందని అంటున్నారు. విశాఖ జిల్లాలో వైసీపీకి బలం ఉంది. కానీ ఐక్యంగా నడిపించే నాయకత్వం ఇంతవరకూ లేదు. ఇపుడు బొత్స ఆ కొరత తీరుస్తున్నారు అంటున్నారు. బొత్స ఎత్తులతో బెంబేలెత్తడం టీడీపీ వంతు అవుతోంది. లోకల్ కార్డు, బీసీ కార్డులతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూని ఆయన కావాలనే ముందుకు తెస్తున్నారు. వలసవాదులకు విశాఖ అడ్డా కాకుండా చూస్తామని అంటున్నారు.