జనసేనాని పవన్‌కల్యాణ్‌ను అనారోగ్య సమస్య వెంటాడుతోంది. ఇటీవల పిఠాపురంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లారు. పాపం… ఒకరోజు జనంతో వున్నాడు. వెంటనే ఆయనకు జ్వరం వచ్చింది. దీంతో హుటాహుటిన హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ఆ మరుసటి రోజు మళ్లీ పిఠాపురం పయనం. మళ్లీ సాయంత్రానికి… నిన్ను వదలబొమ్మాళి అనే చందంగా జ్వరం ఆయన్ను బాధించింది.
మళ్లీ ఆయన హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ఇలా పిఠాపురంలో నాలుగు రోజుల పర్యటనను, అక్కడే స్థిరంగా వుండి కొనసాగించలేని దయనీయ స్థితి. కీలకమైన ఎన్నికల సమయం కావడంతో జనంలోకి వెళ్లక తప్పనిసరి పరిస్థితి. తెనాలిలో నాదెండ్ల మనోహర్ కోసం ఈ నెల 3న వస్తున్నానంటూ పెద్ద ఎత్తున ప్రచారం. తీరా బహిరంగ సభ సమయానికి రెండు మూడు గంటల ముందు… అనారోగ్య కారణంతో రాలేనంటూ ప్రకటన.
ఓకే…ఆరోగ్యంగా వుంటేనే కదా ఏదైనా చేయొచ్చని అంతా అనుకున్నారు. మళ్లీ 6న ఉత్తరాంధ్ర పర్యటనకు పవన్ వెళ్తున్నారని జనసేన ప్రకటన. మళ్లీ సాయంత్రానికే మరో అప్డేట్. అబ్బబ్బే… ఆయనకు ఆరోగ్యం ఇంకా కుదటపడలేదు, 7 నుంచి మొదలు పెడతారని ప్రకటన. అనకాపల్లిలో ఎట్టకేలకు పవన్‌కల్యాణ్ బహిరంగ సభ. అనంతరం విశాఖ వెళ్తుండగా ఆయన సొమ్మసిల్లి పడిపోయినట్టు జనసేన అనుకూల చానళ్లలో బ్రేకింగ్ న్యూస్. మళ్లీ ఆయన హైదరాబాద్‌కు చలోచలో.
జనసేన ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం ఎలమంచిలిలో పవన్ పర్యటించాల్సి వుంది. ఆ తర్వాత 9న పిఠాపురంలో ఉగాది వేడుకల్లో ఆయన పాల్లొనాలి. సొమ్మసిల్లి హైదరాబాద్‌కు వెళ్లిన పవన్, ముందస్తు షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాల్లో పాల్గొంటారా? లేదా? అనేది ప్రశ్నార్థకమైంది. ఆరోగ్యమే మహాభాగ్యమన్నారని, ముందు రెస్ట్ తీసుకోండి పవన్ సార్ అంటూ వెటకారం ధ్వనించేలా పోస్టులు పెట్టడం చర్చనీయాంశమైంది.