రాజు గారు అడుగు పెడితే ర‌చ్చ రంబోలానే!

అదేంటో గానీ రాజుగారు లెగ్ మ‌హిమ‌. ఆయ‌న కాలు పెడితే చాలు… ర‌చ్చ రంబోలానే. అధికార పార్టీ త‌ర‌పున ఎన్నికై, నాలుగేళ్ల పాటు త‌మ‌కు సేవ‌లందించిన రాజు రుణం తీర్చుకోడానికి చంద్ర‌బాబు సుముఖంగా ఉన్నారు.…

అదేంటో గానీ రాజుగారు లెగ్ మ‌హిమ‌. ఆయ‌న కాలు పెడితే చాలు… ర‌చ్చ రంబోలానే. అధికార పార్టీ త‌ర‌పున ఎన్నికై, నాలుగేళ్ల పాటు త‌మ‌కు సేవ‌లందించిన రాజు రుణం తీర్చుకోడానికి చంద్ర‌బాబు సుముఖంగా ఉన్నారు. చంద్ర‌బాబు త‌న‌దైన తెలివి తేటల‌తో న‌ర‌సాపురం ఎంపీ సీటును బీజేపీ కోటాలో ఇప్పించాల‌ని చివ‌రి క్ష‌ణం వ‌ర‌కూ ప్ర‌య‌త్నించారు. ప్చ్‌… ఏం చేద్దాం, రాజు టైమ్ బాగా లేదు.

ఎప్పుడూ ఒక‌రి టైమే న‌డ‌వ‌దు క‌దా! ఆ విష‌యం ర‌ఘురామ‌కృష్ణంరాజుకు తెలిసినంత‌గా, మ‌రెవ‌రికీ తెలియ‌దు. పొత్తులో భాగంగా బీజేపీకి ఆరు ఎంపీ స్థానాలు ద‌క్కాయి. ఇందులో న‌ర‌సాపురం నుంచి బీజేపీ ఏకైక‌ నిఖార్సైన నేత వ‌ర్మ‌కు టికెట్ ద‌క్కడం విశేషం. న‌ర‌సాపురం టికెట్‌పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న ర‌ఘురామ‌కృష్ణంరాజుకు టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో స‌హ‌జంగానే ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది.

ఏపీ బీజేపీ నేత‌లు పురందేశ్వ‌రి, సోము వీర్రాజుపై త‌న మార్క్ ఆరోప‌ణ‌లు చేశారు. ప‌నిలో ప‌నిగా చంద్ర‌బాబుకు కూడా చుర‌క‌లు అంటించారు. ర‌ఘురామ‌కృష్ణంరాజు “ఫ్యాన్” ఫాలోయింగ్ ఎక్కువే. అరె… మ‌న కోసం దెబ్బ‌లు తిని నాలుగేళ్లుగా జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్న ర‌ఘురామ‌కు టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డం ఏంట‌ని ఆయ‌న కోసం ఉద్య‌మాలు జ‌రిగాయి. దీంతో ఎట్ట‌కేల‌కు చంద్ర‌బాబు దిగొచ్చారు.

ఒక శుభ ముహూర్తాన ఆయ‌న మెడ‌లో ప‌సుపు కండువా ప‌డింది. దీంతో ఆయ‌న వైసీపీ రెబ‌ల్ నాయ‌కుడు కాస్త‌, అధికారిక ప‌సుపు ద‌ళ నాయ‌కుడ‌య్యారు. టీడీపీలో చేర‌క‌నే ఆయ‌న‌కు ఉండి అసెంబ్లీ సీటు ఖ‌రారైంది. అస‌లే ఉండి టీడీపీలో త‌న‌కు సీటు ఇవ్వ‌లేద‌ని మాజీ ఎమ్మెల్యే క‌ల‌వ‌పూడి శివ‌రామ‌రాజు ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు నియోజ‌క‌వ‌ర్గ‌మంతా తిరుగుతున్నారు. తాజాగా సిటింగ్ ఎమ్మెల్యే రామ‌రాజును కాద‌ని, ర‌ఘురామ‌కృష్ణంరాజుకు టికెట్ ఇస్తార‌ని తెలియ‌డంతో అక్క‌డి టీడీపీలో ర‌చ్చ మొద‌లైంది.

సిటింగ్ ఎమ్మెల్యే రామ‌రాజును కాద‌ని, ర‌ఘురామ‌కృష్ణంరాజుకు సీటు ఇస్తే, ర‌చ్చ మామూలుగా వుండ‌ద‌ని ఆయ‌న అనుచ‌రులు హెచ్చ‌రిస్తున్నారు. అయితే త‌న‌కు సీటు ఇస్తాన‌ని చంద్ర‌బాబు చెప్ప‌లేద‌ని ర‌ఘురామ‌కృష్ణంరాజు అన్నారు. అలాగ‌ని ర‌ఘురామకు సీటు ఇవ్వ‌క‌పోతే, ఆయ‌న ఊరికే వుంటార‌ని అనుకోలేమ‌ని టీడీపీ నాయ‌కులు అంటున్నారు.

ర‌ఘురామ‌కృష్ణంరాజు ఎక్క‌డుంటే అక్క‌డ ఏదో ఒక ర‌చ్చ లేకుంటే, మీడియాకు, జ‌నానికి పొద్దు గ‌డ‌వ‌ద‌నే రేంజ్‌లో ఆయ‌న రాజ‌కీయం వుంటుంది. ర‌ఘురామ పొలిటిక‌ల్ స్టైల్ అట్లుంట‌ది మ‌రి. అన్నీ తెలిసే క‌దా, ఆయ‌న్ను ఇష్ట‌ప‌డి మెడ‌లో ప‌సుపు కండువా వేసింది. కోరి తెచ్చుకున్న నాయ‌కుడి కోసం ఆ మాత్రం ర‌చ్చ‌ను ఎదుర్కోలేక‌పోతే ఎట్లా? కానివ్వండి!