ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమర్థతను ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాటలు ప్రతిబింబిస్తున్నాయి. గ్రామ స్వరాజ్యం తీసుకురావాలన్న జాతిపిత గాంధీజీ కలలను నెరవేర్చే క్రమంలో వైఎస్ జగన్ తీసుకొచ్చిన అద్భుత వ్యవస్థే సచివాలయం. జగన్ పరిపాలనమైన దూరదృష్టికి సచివాలయం వ్యవస్థ నిదర్శనంగా నిలుస్తోంది. ఈ వ్యవస్థ ఎంత గొప్పదంటే తాము అధికారంలోకి వస్తే దాన్ని తొలగిస్తామని ప్రతిపక్షాలు చెప్పలేనంత.
ఇవాళ మీడియాతో చంద్రబాబు చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాలంటీర్లపై జనసేనాని పవన్‌కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలపై తప్పించుకు తిరుగువాడు ధన్యుడనే రీతిలో సమాధానాలు ఇచ్చారు. పవన్ వ్యాఖ్యల్ని సమర్థించలేని పరిస్థితి. ఇదే సందర్భంలో వాలంటీర్లపై బాబు మనసులో మాటను పంచుకున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజాసేవ వరకే వాలంటీర్లను ఉపయోగించుకుంటామన్నారు. ఇటీవల పాదయాత్రలో లోకేశ్ కూడా ఇదే రకంగా స్పందించారు.
టీడీపీ అధికారంలోకి వస్తే సచివాలయ వ్యవస్థ కొనసాగుతుందని, వాలంటీర్లు కూడా ఉంటారని అన్నారు. ఇదే చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలను తీసుకొచ్చారు. ఈ కమిటీలు టీడీపీ అధికారం కోల్పోవడంలో ప్రధాన పాత్ర పోషించాయి. జన్మభూమి కమిటీల్లో స్థానిక టీడీపీ నాయకులే సభ్యులు. ఎవరికైనా ప్రభుత్వ లబ్ధి జరగాలంటే జన్మభూమి కమిటీలోని టీడీపీ నాయకుల ఆమోదముద్ర తప్పనిసరి చేశారు.
దీంతో టీడీపీ నాయకులు ఇష్టమొచ్చినట్టు వ్యవహరించి, ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కలగడానికి కారణమయ్యారు. ఇది వాస్తవం. కానీ సచివాలయ వ్యవస్థ, వాటికి అనుసంధానంగా పని చేసే వాలంటీర్లు అలా చేయలేదు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను కులమతాలు చూడకుండా అమలు చేస్తున్నారు. అందుకే సచివాలయ వ్యవస్థను, వాలంటీర్లను తొలగించని విధంగా కట్టుదిట్టంగా జగన్ ఏర్పాటు చేశారు. పవన్‌కల్యాణ్ విమర్శిస్తున్నట్టుగా వాలంటీర్లు బ్రోకర్లుగా పని చేస్తుంటే, మరి టీడీపీ ఏం చేస్తున్నట్టు?
పవన్ ఆరోపణల్లో నిజం లేదు కాబట్టే, చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కారు. పవన్ ఆరోపణలపై కాకుండా, తనకిష్టమొచ్చిన విషయాన్ని మాట్లాడారు. వాలంటీర్లపై పవన్ ఆరోపణలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు అడగ్గా… వ్యక్తిగత సమాచారం సేకరించడం ద్రోహమన్నారు. వలంటీర్లు పౌరసేవకు పరిమితం కాకుండా రాజకీయ జోక్యం చేసుకుంటే కుదరదన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజా సేవ వరకే వలంటీర్ల సేవలను పరిశీలిస్తామన్నారు.
చంద్రబాబు డొంకతిరుగుడు సమాధానాల్లోనే, పవన్ ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం వుందో అర్థమవుతోంది. వాలంటీర్ల వ్యవస్థను తొలగిస్తానని చంద్రబాబు చెప్పలేని నిస్సహాయస్థితి. అంటే వైఎస్ జగన్ ఒక వ్యవస్థను ఎంత పకడ్బందీగా ఏర్పాటు చేశారో చంద్రబాబు అభిప్రాయాలే చెబుతున్నాయి. ఇదే చంద్రబాబు టీడీపీ అధికారంలోకి వస్తే జన్మభూమి కమిటీలు మళ్లీ తీసుకొస్తానని పొరపాటున కూడా చెప్పలేరు. ఎందుకంటే ఆ మాటంటే జనాలు వెంటపడి తంతారని భయం. ఇదే జగన్, చంద్రబాబు తమ పాలనలో తీసుకొచ్చిన వ్యవస్థల మధ్య తేడా.