నిన్నమొన్నటి వరకూ జనసేనతో పాటు బీజేపీతో పొత్తు పెట్టుకోడానికి చంద్రబాబు తహతహలాడడం చూశాం. ఇప్పుడేమో ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకోడానికి భయపడుతున్నారు. కేంద్రమంత్రి నారాయణస్వామి అనంతపురం జిల్లా పర్యటనలో పొత్తులపై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులుంటాయని, టీడీపీ-జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేస్తుందన్నారు.
మీడియా ప్రతినిధులతో తాజాగా చంద్రబాబు చిట్‌చాట్‌లో మాట్లాడారు. టీడీపీతో పొత్తు వుంటుందని కేంద్ర మంత్రి నారాయణస్వామి వ్యాఖ్యలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. దగా పడ్డ ఏపీ రాష్ట్ర ప్రయోజనాలే ఇప్పుడు తనకు ముఖ్యమన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన చైతన్యం తీసుకొచ్చి సెట్ చేయటమే తన ముందున్న లక్ష్యమన్నారు. తనపై పెద్ద బాధ్యత ఉన్నప్పుడు పెద్ద ఆలోచనలు అవసరమని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరెవరో మాట్లాడే వాటికి సమాధానాలిస్తూ పలుచన కాదల్చుకోలేదని ఆయన సెలవిచ్చారు.
కేంద్ర మంత్రి నారాయణస్వామిని పట్టుకుని ఆయన దారినపోయే దానయ్య కింద లెక్క కట్టారు. బహుశా చంద్రబాబు దృష్టిలో నాయకులంటే ప్రధాని మోదీ, అమిత్‌షా మాత్రమే. అందుకే వాళ్లిద్దరి ప్రాపకం కోసం చంద్రబాబు తపిస్తుంటారు. అయితే విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మోదీ సర్కార్ తీరని ద్రోహం చేసిందనే ఆగ్రహం ఏపీ ప్రజానీకంలో వుంది. అందుకే బీజేపీపై రాష్ట్ర ప్రజలు అక్కసుతో ఉన్నారని, ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే జగన్‌కే లాభమనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు.
టీడీపీతో పొత్తు వుంటుందని కేంద్ర మంత్రులు చెబుతున్నా, చంద్రబాబు వాటిపై మాట్లాడ్డానికి వణికిపోతున్నారు. మళ్లీ జగన్‌కు పాజిటివ్ అవుతుందనే ఆందోళన ఆయనలో కనిపిస్తోంది. నిన్నమొన్నటి వరకూ బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడిన చంద్రబాబేనా, కేంద్రమంత్రిని ఉద్దేశించి… ఎవరెవరో అని లెక్క లేకుండా మాట్లాడిందనే చర్చకు తెరలేచింది. చంద్రబాబా? మజాకా? రాజకీయంగా ప్రయోజనం లేదనుకుంటే ఎవరినైనా కరివేపాకులా తీసి పడేయడంలో చంద్రబాబుకు మించిన నాయకుడు మరొకరు లేరు.