రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కడప నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా యథేచ్ఛగా భూకబ్జాలు జరుగుతున్నాయని, అక్రమ లే-అవుట్లు వేస్తున్నారని టీడీపీ కడప లోక్‌సభ అభ్యర్థి ఆర్.శ్రీనివాసులరెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్రమ లే-అవుట్లలో స్థలాలు కొనవద్దని హెచ్చరించడం గమనార్హం. ఒకవేళ ఎవరైనా తెలియక కొంటే నష్టపోతారని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే అక్రమ లేఅవుట్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
ఆర్టీఐ కింద కడప నగరంలో చోటు చేసుకున్న అక్రమ లేఅవుట్ల గుట్ట బయట పెడుతున్నట్టు ఆయన చెప్పారు. చివరికి వైసీపీ బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధ ప్లాట్‌ను కూడా కబ్జా చేశారని ఆయన సంచలన ఆరోపణ చేశారు. కడప ప్రకాష్ నగర్ లోని బద్వేలు ఎమ్మెల్యేకు చెందిన ఫ్లాట్‌ను కూడా కబ్జా చేసి అమ్మేశారని ఆయన సంచలన ఆరోపణ చేశారు. ప్రజా ప్రతినిధుల స్థలాలకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన నిలదీశారు.
కడపలో దొంగ డాక్యుమెంట్లతో వైసీపీ నేతలు భూకబ్జాలు చేస్తూ రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. భూకబ్జాలు, అక్రమ లే-అవుట్ల నిర్మాణంలో కడప ఎమ్మెల్యే, మేయర్, కార్పొరేటర్ల హస్తం వుందని ఆరోపించారు. మూడేళ్ల కాలంలో కడపలో కేవలం సాయిమిత్ర డెవెలపర్స్ పేరు మీద 90 వేల గజాలకు మాత్రమే అధికారిక అనుమతి ఉందన్నారు. కడపలో నాలుగేళ్లలో ఇన్ని వందల వెంచర్లు, అక్రమ లేఔట్లు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు.
కడపలో మినిస్టర్ లేఅవుట్ పేరుతో అనుమతిలేని కొత్త లేఅవుట్ సృష్టించారన్నారు. దీనికోసం ప్రైవేట్ భూమి కొని, పక్కనే వున్న ప్రభుత్వ భూమిని కొట్టేశారని ఆరోపించారు. మంత్రి లేఅవుట్‌కు ఇంకా ల్యాండ్ కన్వర్షన్ కాకుండానే ఆయన గారు అప్పుడే అమ్మకానికి పెట్టారన్నారు. ప్రజలెవరూ వైసీపీ భూదొంగలు అమ్మకానికి పెట్టే స్థలాలు, లేఅవుట్లు, భూములు కొనద్దని శ్రీనివాసులరెడ్డి విజ్ఞప్తి చేశారు.
కడప నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ లేఅవుట్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భూసమస్యలపై సిగ్గులేకుండా పోలీసులే పంచాయితీలు చేస్తున్నారని విమర్శించారు. కడప ప్రజలు తమ ఆస్తులు, భూములు, ఖాళీ స్థలాలు ఉన్నాయో లేదో తరచూ చూసుకోవాలని ఆయన విన్నవించారు. వైసీపీ నాయకులు పట్టపగలే భూ దొంగతనాలకు పాల్పడుతుండడంతో ఈ హెచ్చరిక చేయాల్సి వస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.