వారాహి యాత్ర పేరుతో జనంలోకి వచ్చిన పవన్‌కల్యాణ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. సీఎం వైఎస్ జగన్‌పై ద్వేషం పవన్‌లో విచక్షణను చంపేస్తోంది. ఈ క్రమంలో వాలంటీర్లపై నోరు పారేసుకుని, ఒక బలమైన వ్యవస్థను శత్రువుగా చేసుకోవడం కేవలం పవన్‌కే సాధ్యమైంది. నాక్కొంచెం తిక్కుందనే సినిమా డైలాగ్…రియల్‌గానే ఆయనలో ఉందేమో అనే అనుమానం కలిగిస్తోంది. వాలంటీర్ల విషయంలో పవన్‌కల్యాణ్ దోషిగా నిలబడ్డారు.
పవన్ కామెంట్స్‌ను సమర్థించేందుకు జనసేనలోని ఇద్దరు ముగ్గురు నేతలు నానా పాట్లు పడుతున్నారు. పవన్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశాలకు కొత్త భాష్యం చెప్పేందుకు యత్నిస్తున్నారు. అయితే ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియా ముందుకొచ్చారు. వాలంటీర్లపై పవన్ దారుణ ఆరోపణలు నాదెండ్లకు సమస్యలపై మాట్లాడ్డంగా కనిపిస్తోందట!
జనసేనలో అంతోఇంతో విషయ పరిజ్ఞానం కలిగిన నాయకుడిగా నాదెండ్ల మనోహర్‌కు గుర్తింపు వుంది. పాపం ఆయన పవన్ వివాదాస్పద కామెంట్స్ ను సమర్థించుకోడానికి అగచాట్లు పడుతున్నారు. సమస్యలపై మాత్రమే పవన్ విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఎందుకు తీసుకుంటున్నారని మాత్రమే పవన్ ప్రశ్నించారని తమ నాయకుడిని వెనకేసుకొచ్చారు.
జనసేన పార్టీ లోతుగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే మాట్లాడుతుందని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రజల నుంచి సేకరించిన ఇంత డేటా బేస్ ఎక్కడికి పంపుతున్నారో ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లు ప్రభుత్వ కార్యకర్తలు కాదా? కావాలనే వాలంటీర్లను రెచ్చగొడుతున్నారని నాదెండ్ల మండిపడ్డారు.
వైఎస్ జగన్‌పై పవన్ రోజూ విమర్శలు చేస్తుంటే వాలంటీర్లు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేయలేదని నాదెండ్ల గ్రహించాలి. తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా పవన్ కామెంట్స్ ఉండడం వల్లే వాళ్లంతా రగిలిపోతున్నారు. అయినా లోతుగా అధ్యయనం చేసిన వాళ్లు వాలంటీర్లపై ఇలా నోరు పారేసుకుంటారా? పవన్ కల్యాణ్ మాటల్లోని లోతు, పొడవు కేవలం జనసేన నేతలకు మాత్రమే తెలుసని, ఇక ఈ రాష్ట్రంలో మరో మానవమాత్రుడికి అర్థం కావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.