నీ చిత్రం చూసి నే చిత్తరువైపోతిని…

తెలుగు సినిమా దర్శకుల్లో అతి కొద్ది మందికి మాత్రమే ఓ స్టయిల్ అనేది వుంటుంది. అలాంటి వాళ్లలో శేఖర్ కమ్ముల ఒకరు. ఆయన సినిమాల జయాపజయాల సంగతి అలా వుంచితే ఆడియో విషయంలో ఎప్పుడూ…

తెలుగు సినిమా దర్శకుల్లో అతి కొద్ది మందికి మాత్రమే ఓ స్టయిల్ అనేది వుంటుంది. అలాంటి వాళ్లలో శేఖర్ కమ్ముల ఒకరు. ఆయన సినిమాల జయాపజయాల సంగతి అలా వుంచితే ఆడియో విషయంలో ఎప్పుడూ ఫెయిల్ అనేది వుండదు. తొలిసినిమా ఆనంద్ నుంచి గోదావరి మీదుగా నిన్న మొన్నటి ఫిదా వరకు ఇదే ట్రాక్ రికార్డు. ఆయన లేటెస్ట్ గా చేస్తున్న సినిమా లవ్ స్టోరీ. 

నాగ్ చైతన్య, సాయిపల్లవి జంటగా చేస్తున్న సినిమా., ఈ సినిమా నుంచి వాలంటైన్స్ డే సందర్భంగా ఓ సాంగ్ ను విడుదల చేసారు.  '' నీ చిత్రం చూసి, నా చిత్తం చెదిరి నే చిత్తరవుయితినయ్యో..ఇంచి ఇంచి లోన పొంచివున్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో….''  ఈ ఒక్క లైన్ చాలు శేఖర్ కమ్ముల టేస్ట్ తెలియడానికి.  

ఈ పాట ట్యూన్ సున్నితంగా సాగింది. విజవల్స్ ఈ పాటకు చాలా కీలకం అని అర్థం అయిపోతోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తను తీయబోతున్న ప్రేమ కథ ఎలాంటిదో పాటతో తెలియజేశారు. ఈ పాటకు మిట్టపల్లి సురేందర్ సాహిత్యాన్ని అందించగా, అనురాగ్ కులకర్ణి పాడారు. పవన్ సీహెచ్ సంగీతాన్ని అందించారు. 

పాటలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రేమ చిహ్నాలను పెయిటింగ్స్ రూపంలో చూపించారు. హైదరాబాద్ నగర జీవితాన్ని తన చిత్రాలతో అద్భుతంగా చూపించిన ప్రముఖ చిత్రకారుడు 'మోషే దయాన్' ఈ పాటలోని చిత్రాలను గీశారు. ఈ లిరికల్ వీడియో లో అలనాటి హైదరాబాద్ ప్రేమ చిహ్నలైన “పురాణ పూల్” ,”తారామతి బరాదారి”, “కోటి రెసిడెన్సీ”, “బ్రిటిష్ రెసిడెన్సీ” లను చూపించిన శేఖర్ కమ్ముల చివరగా రేవంత్ మౌనిక ప్రేమ వారధి అయిన 'రేవంత్ జుంబా సెంటర్' ను పాటలో చూపించారు.

ఏప్రిల్ 16న “లవ్ స్టోరి” సినిమా థియేటర్ లలో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు.