పని రాక్షసుడు – చంద్రబాబు

ఆరంభిపరు నీచమానవులు..పని జరుగుతుందో జరగదో అన్న భయంతో…ఆరంభించి వదిలేస్తారు కొందరు…అడ్డంకి వస్తే చాలు…కానీ వేరే బాపతు జనాలు కూడా వుంటారు..వారిని ధీరులు అంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పోరాడుతూ పని నెగ్గించుకోవడానికి చూస్తూనే వుంటారు.…

ఆరంభిపరు నీచమానవులు..పని జరుగుతుందో జరగదో అన్న భయంతో…ఆరంభించి వదిలేస్తారు కొందరు…అడ్డంకి వస్తే చాలు…కానీ వేరే బాపతు జనాలు కూడా వుంటారు..వారిని ధీరులు అంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పోరాడుతూ పని నెగ్గించుకోవడానికి చూస్తూనే వుంటారు. ఈ లెక్కన చూసుకుంటే నాలుగు పదుల అనుభవం పండించుకున్న చంద్రబాబు ధీరుడు. అందులో అణుమాత్రం సందేహం లేదు.

నాలుగు దశాబ్దాల కిందట తెలుగుదేశం పార్టీ నిర్వహణ బాధ్యతలు ఏ క్షణాన చేపట్టారో అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కష్టం పడుతూనే వున్నారు. ఈ ఏడు పదుల వయసులో కూడా ఆయన పార్టీ కోసం కిందా మీదా అవుతూనే వున్నారు. కొందరి జాతకాలు అంతేనేమో? వాళ్లు అలా పని చేస్తూనే వుంటారు. కష్టపడుతూనే వుంటారు. అలా కాకుండా వుండడం వాళ్లకు చాతకాదేమో?

ఓ ముచ్చట చెబుతాను.. చంద్రబాబు పార్టీలోకి వచ్చిన కొత్త రోజులు. అప్పటికి పబ్లిక్ కు ఇంకా పెద్దగా ఆయన తెలియదు. అలాంటి టైమ్ లో తెలుగుదేశం పార్టీ ఆఫీసుల్లో పార్టీ బాధ్యులకు తలకు మించిన పని వుండేది. తొలివారంలో పార్టీ నుంచి వచ్చిన అసైన్ మెంట్ ను పూర్తి చేయడానికి మూడు వారాలు పట్టేది. అది పూర్తయ్యేసరికి మరో అసైన్ మెంట్ వచ్చి పడేది. 

సర్వేలు, జనాలు ఏమనుకుంటున్నారు, ఇలా ఒకటి కాదు రెండుకాదు. దీనంతటికి వెనుక పార్టీ బాధ్యతలు నిర్వహించే చంద్రబాబు వుండేవారు. పార్టీ జనాలను ఖాళీగా వుంచితే వాళ్లు నాయకుల కేసి చూస్తారు..ఖాళీ బుర్రలు దెయ్యాల కార్ఖానాలు అని ఊరికనే అనలేదు కదా. అందుకే బాబుగారు సదా బిజీగా వుంటూ, పార్టీ జనాలను బిజీగా వుంచేవారు.

మరో ముచ్చట. లక్ష్మీ పార్వతి హవా పార్టీలో సాగుతున్న రోజులు. బాబు అనుకూలమైన ఎమ్మెల్యేలు ఎందరో వుండేవారు. వారు మౌనంగా వుండేవారు.  ఎటువంటి రియాక్షన్ వుండేది కాదు. అలాంటి ఓ ఎమ్మెల్యేను పలకరిస్తే….'బాబుగారు ఇప్పుడేం మాట్లాడవద్దన్నారు. టైమ్ వచ్చేవరకు వేచి వుండమన్నారు..' ఇదీ జవాబు.  బాబు ఓపిక అలాంటిది. తన టైమ్ వచ్చే వరకు వేచి వుండడం, లాంగ్ టెర్మ్ ప్రణాళికలు వేయడం ఆయనకు మొదటి నుంచీ అలవాటు.

ఈ రెండు విషయాలు ఎందుకు చెప్పడం అంటే పార్టీ మీద ఆయనకు వున్న నియంత్రణ, పార్టీ కోసం ఆయన ఆలోచించే విధానం. తన టైమ్ వచ్చేవరకు ఓపిగ్గా వేచి వుండే విధానం…అలా వుండేవి. అంతే కాదు, అప్పటికే కాదు, ఇప్పటికీ అలాగే వున్నాయి. తెలుగునాట రాజకీయాల్లో పార్టీ కోసం, అధికార సాధన కోసం అంత రాక్షసంగా పనిచేసిన, చేస్తూ వున్న మరో నాయకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు.

ఎవరైనా అనొచ్చు. రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసాడు. జగన్ అంతకన్నా రాక్షసంగా జనాల్లోనే వుండి గెలిచాడు అని. కానీ ఇక్కడ చంద్రబాబుకు వాళ్లకు ఓ తేడా వుంది. గెలిచిన తరువాత రిలాక్స్ అయ్యారు ఆ ఇద్దరూ. పార్టీ బాధ్యతలు వేరే వాళ్లకు అప్పగించారు. కానీ బాబు అలా కాదు. ఆయన కొడుక్కు పార్టీ బాధ్యతలు అప్పగించినా కూడా తన నియంత్రణ, తన కార్యాచరణ చూసుకుంటూనే వచ్చారు. 

ఆ క్రమంలో ఆయన ఆలోచనలు లేదా, ఆయన నిర్ణయాలు తప్పు అయి వుండొచ్చు. లేదా ఫలితం ఇచ్చి వుండకపోవచ్చు. కానీ ఆయన ప్రయత్నంలో లోపం మాత్రం లేదని ఎవరైనా అంగీకరించాల్సిన విషయం.

పైగా చంద్రబాబు దగ్గర వున్న మరో గొప్ప గుణం ఏమిటంటే గెలుపు వచ్చే వరకు ఓటమిని అంగీకరించరు. ఓటమితో పోరాటం సాగిస్తూనే వుంటారు. చాలా మంది అంటారు మీడియా లేకపోతే బాబు లేరని, అది కూడా నిజమే. మీడియా మద్దతు లేకపోతే బాబు లేని మాట నిజమే. అది తెలంగాణలో ప్రూవ్ అయింది కూడా. కానీ ఆ మీడియాను కూడా ఆ విధంగా తనకు అనుకూలంగా వాడడంలో సైతం బాబు స్ట్రాటజీలు వున్నాయి. అంతే కాదు, ఎప్పుడో విత్తనాలు వేసారు, ప్లాంట్ చేసారు అంటారు. 

అదీ నిజమే. ఆ ముందు చూపు మరి మరెవరికీ ఎందుకు లేదు?  వైఎస్ రాజశేఖర్ అలా విత్తనాలు జల్లి వుంటే జగన్ కు పనికి వచ్చేవి అనుకోవచ్చు. కానీ అందరికీ అలా చల్లడమూ రాదు. చల్లగా మెలకెత్తిన వాటిని తన దగ్గర పట్టుకుని వుంచుకోవడమూ రాదు.  అది చంద్రబాబుకే పట్టుబడిన విద్య.

పరిస్థితులకు అనుకూలంగా తగ్గడం, లేవడం అన్నది చంద్రబాబు దగ్గర నేర్చుకోవాలి. మోడీతో పొత్తు వున్నపుడు, పొత్తు చిత్తయినపుడు, మళ్లీ ఇప్పుడు బాబు వైఖరిని పరిశీలిస్తే అది అర్థం అవుతుంది. చంద్రబాబు ఇప్పటికి మోడీ పేరు ప్రస్తావించి ఎన్నాళ్లయింది. రెండేళ్లు కావస్తోంది. అదే ఆయన ఓర్పు సహనానికి నిదర్శనం. మళ్లీ మోడీకి దగ్గర కావాలి. అది అర్జెంట్ గా జరగదు అని తెలుసు. అలా ఓపిగ్గా వేచి వుంటారు.

ఇప్పుడు బాబుగారి వయస్సు 70 ఏళ్లు. కానీ ఈ వయసులో కూడా ఆయన గర్జిస్తున్నారు. అధికారపక్షాన్ని ఢీకొంటున్నారు. ఆయన కన్నా ఇరవై ఏళ్లు చిన్న అయిన పవన్ కళ్యాణ్ కనీసం పార్టీ నిర్మాణం చేపట్టలేకపోతున్నారు. ఇక లోకేష్ బాబు అయితే పూర్తిగా తండ్రి చాటు బిడ్డ అయిపోయారు. ట్విట్టర్ లో తప్ప ఆయన హడావుడి ఎక్కడా లేదు.  పంచాయతీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు తిరిగి మళ్లీ పార్టీ కేడర్ కు ఇంతో అంతో ఆశలు చిగురించేలా చేసారు. ఎన్ని స్థానాలు గెల్చుకున్నాము అన్నది పక్కన పెడితే కేడర్ యాక్టివ్ అయ్యేలా చేయగలిగారు.

మొన్నటి వరకు తిరుపతి ఎన్నిక జరిగి, తేదేపా మూడో స్థానానికి వెళ్లిపోతే పరిస్థితి ఏమిటి అని చాలా మంది లెక్కలు గట్టారు. కానీ ఇప్పుడు మొహమాటం లేకుండా భాజపాను మూడో ప్లేస్ కు నెట్టే స్థాయికి మళ్లీ తేదేపాను తీసుకువచ్చేలా కనిపిస్తోంది చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం.

ఇలాంటి పట్టుదల కలిగిన, పనిరాక్షసులైన రాజకీయ నాయకులు అరుదుగా వుంటారు. తెలుగునాట అలాంటి నాయకుడు చంద్రబాబు.

చాణక్య

ఆ విధంగా చంద్రబాబు ధీరుడు

ప్ర‌తి ఒక్క‌రూ జ‌గ‌న్ పాల‌న‌లో ల‌బ్ధిదారులే