“ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్” అంటారు. ఎదుటి వ్యక్తిపై తొలిసారి మనం ఎలాంటి ముద్రవేస్తామో, ఇక అదే ఇమేజ్ కొనసాగుతుందంటారు చాలామంది. ఇందులో నిజం ఎంతో తెలుసునే ప్రయత్నం చేసింది వాషింగ్టన్ కు చెందిన మెక్ గిల్ యూనివర్సిటీ. ఇదేదో నానుడి కాదని, సైంటిఫిక్ గా ఇందులో చాలా నిజం దాగుందని చెబుతోంది ఆ స్టడీ.
వ్యక్తులకు సంబంధించి తొలి చూపులో లేదా తొలి పరిచయంలో ఏర్పడిన అభిప్రాయాలు.. 50శాతానికి పైగా నిజం అవుతాయనే విషయాన్ని శాస్త్రీయంగా ఈ యూనివర్సిటీ నిర్థారించింది. 372 జంటలపై నిర్వహించిన సర్వేతో ఈ విషయాన్ని రూఢి చేసుకుంది. ఈ జంటలకు కేవలం 3 నిమిషాల ఫస్ట్-డేట్ ను ఏర్పాటుచేశారు.
అలా తొలిసారి కలిసిన జంటలు తమ భాగస్వామిపై ఏర్పాటుచేసుకున్న అభిప్రాయాల్లో దాదాపు 50శాతం అభిప్రాయాలు, సదరు వ్యక్తి వ్యక్తిత్వానికి సూట్ అయినట్టు కనుగొన్నారు. కేవలం 3 నిమిషాల పరిచయంతోనే చాలా జంటలు, తమ భాగస్వామితో శృంగారానికి కూడా రెడీ అయ్యేంత లోతుగా అర్థం చేసుకున్నాయని స్టడీలో తేలింది.
అయితే ఈ విషయంలో ఇంకా 45 శాతం మంది సర్వేకు కొరుకుడు పడలేదు. ఫస్ట్ డేట్ లోనే భాగస్వామి (ఆడ/మగ) మనసును తెలుసుకోవడం కష్టంగా ఉందంటూ 45శాతం అభిప్రాయపడ్డారు. ఓవరాల్ గా సర్వే చెప్పేది ఏంటంటే.. ఎదుటి వ్యక్తిపై పైపైన ఓ అభిప్రాయానికి రావడానికి మాత్రమే ఫస్ట్ డేట్ పనికొస్తుంది.
ఇంకా చెప్పాలంటే, కాలేజ్ ప్రారంభమైన కొత్తల్లో పరిచయ కార్యక్రమం లాంటిదే ఇలాంటిది. పూర్తిగా అర్థం చేసుకొని, ఓ నిశ్చితాభిప్రాయానికి రావాలంటే మాత్రం కొన్నాళ్లు కలిసి ఉండాల్సిందేనని చెబుతున్నారు.