తేనెతుట్టెను కెలికిన రేవంత్!

తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్తును రోజుకు 8 గంటలపాటు ఇస్తే సరిపోతుందని, ఎకరాకు గంటవంతున మూడు ఎకరాలు ఉన్న రైతు రోజుకు మూడు గంటలపాటు కరెంటు సరిపోతుందనే వ్యాఖ్యల ద్వారా.. టీపీసీసీ చీఫ్ రేవంత్…

తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్తును రోజుకు 8 గంటలపాటు ఇస్తే సరిపోతుందని, ఎకరాకు గంటవంతున మూడు ఎకరాలు ఉన్న రైతు రోజుకు మూడు గంటలపాటు కరెంటు సరిపోతుందనే వ్యాఖ్యల ద్వారా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తేనెతుట్టెను కదిపారు. ఇప్పుడు గులాబీ నాయకులందరూ ఒక్కపెట్టున విరుచుకుపడుతున్నారు. 

ఉచిత విద్యుత్తుకు  కాంగ్రెసు పార్టీ వ్యతిరేకం అని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ద్రోహం చేస్తుందని, అదేపనిగా ఊదరగొడుతున్నారు. రేవంత్ వ్యాఖ్యల వల్ల జరగగల నష్టాన్ని పూడ్చుకోవడానికి ఏం చేయాలో తెలియక కాంగ్రెసు పార్టీ ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

తానా సభలకు వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడి ఎన్నారైలు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇస్తూ.. రేవంత్ ఈ మాటలు చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలను భారాస లడ్డూలా వాడుకుంటోంది. కాంగ్రెసుకు వ్యతిరేకంగా పూర్తిస్థాయిలో యుద్ధం ప్రకటించేసింది. ఇవాళ రేవంత్ వ్యాఖ్యలపై స్పందించని భారాస నాయకుడు తెలంగాణలో లేడంటే అతిశయోక్తి కాదు. 

ప్రతి ఒక్కరూ కూడా రేవంత్ మాటలను తూలనాడుతున్నారు. రైతులకు అన్యాయం చేయడానికే రేవంత్ కంకణం కట్టుకున్నాడని విమర్శిస్తున్నారు. రైతులంటే కాంగ్రెసు పార్టీకి కక్ష అని కూడా మాట్లాడుతున్నారు. తన వ్యాఖ్యలు వక్రీకరణకు గురయ్యాయని రేవంత్ రెడ్డి ఎన్ని రకాలుగా సర్దిచెప్పుకునే ప్రయత్నాలైనా చేయవచ్చు గాక.. కానీ ఫలితం లేదు.

కేవలం రేవంత్ చేసిన వ్యాఖ్యలను అతి పెద్ద ప్రచారాస్త్రంగా మార్చుకోడానికి భారాస పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తోంది. ఒకప్పట్లో చంద్రబాబునాయుడు.. ఉచిత విద్యుత్తు ఇస్తే,.. కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందే.. అందుకు తప్ప మరెందుకూ పనికిరావు అని చేసిన వ్యాఖ్యల తరహాలో.. ఈ వ్యాఖ్యలు కూడా రేవంత్ ను బద్నాం చేయడానికి భారాస చేతికి బ్రహ్మాస్త్రాల్లాగా దొరికాయి.

అన్నదాతల విషయంలో భారత రాష్ట్ర సమితి విధానం.. ఏడాదికి మూడు పంటలు అనే దిశగా సాగుతుండగా.. కాంగ్రెసు పార్టీ విధానం ‘రోజుకు మూడు గంటలు కరెంటు’ అనే విధ్వంసక తీరులో సాగుతున్నదని వారు విమర్శిస్తున్నారు. పైగా, ఒకపట్టాన ఈ అస్త్రాన్ని విడిచిపెట్టే ఉద్దేశం భారాసకు లేనట్టుగా ఉంది. దీన్ని ఎన్నికలదాకా సజీవంగా వాడుకుంటూ.. రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరి ఇది అని చాటిచెప్పే ప్రయత్నంలో వారున్నారు. 

కల్వకుంట్ల కవిత ఏకంగా.. రాహుల్ గాంధీని ఉద్దేశించి రైతులంటే మీ పార్టీకి ఎందుకింత కక్ష అంటూ ట్వీట్ చేయడమూ సమస్యను మరింత తీవ్రం చేస్తోంది. మొత్తానికి రేవంత్ రెడ్డి తన మాటలతో తేనెతుట్టె కెలికారు.. ఆయన ఇంకా అమెరికాలోనే ఉన్నారు. ఇక్కడ రాష్ట్రం పూర్తిస్థాయిలో ఆ మంట అంటుకుంది.