దత్త పుత్రుడు పవన్‌కల్యాణ్‌ను రాజకీయంగా భ్రష్టు పట్టించడానికి చంద్రబాబు భారీ కుట్రకు తెరలేపారా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. వారాహి యాత్రలో భాగంగా ఏలూరు బహిరంగ సభలో పవన్ అనవసరంగా వాలంటీర్లపై నోరు పారేసుకున్నారు. పరోక్షంగా వారిని బ్రోకర్లగా అభివర్ణించారు. మహిళల అక్రమ రవాణాకు వాలంటీర్లు పాల్పడుతున్నారని, ఈ విషయాన్ని తనకు కేంద్ర నిఘా సంస్థలు తెలియజేశాయని అన్నారు.
ఒక్కోసారి రాజకీయ నేతలు నోరు జారుతుంటారు. ఎందుకంటే వాళ్లూ మనుషులే. తప్పు దొర్లి, రాజకీయంగా నష్టం వస్తుందని తెలిసినప్పుడు విజ్ఞత ఉన్న వారెవరైనా దిద్దుబాటు చర్యలు చేపడతారు. కానీ పవన్‌కల్యాణ్ ఆ పని చేయడం లేదు. కనీసం తనకు మిత్రపక్షమైన బీజేపీ, అలాగే వైసీపీ ఆరోపిస్తున్నట్టు దత్త తండ్రి పార్టీ నుంచి కూడా కనీస మద్దతు లభించలేదు. అప్పుడైనా ఆయన తాను మాట్లాడింది తప్పని గ్రహించాల్సి వుంది.
మళ్లీ ఆయన తన వ్యాఖ్యల్ని సమర్ధించుకునేలా పుండు మీద కారం చల్లినట్టు మాట్లాడారు. వాలంటీర్ల తీవ్ర స్పందన చూస్తే… తాను కరెక్ట్‌గానే మాట్లాడినట్టు అర్థమవుతోందన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో బాబు కుట్రపై పౌర సమాజానికి ఒక అనుమానం కలుగుతోంది. పవన్‌కల్యాణ్ వ్యక్తిగత ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే క్రమంలో ఆయనకు పనికిమాలిన స్క్రిప్ట్ ఇచ్చారనే అనుమానాలు కలుగుతున్నాయి. తద్వారా దత్త పుత్రుడు కంటే సొంత పుత్రుడే బెటర్ అని ప్రజానీకం భావించేలా చంద్రబాబు కుట్రకు తెరలేపారనే చర్చకు తెరలేచింది.
ఎంతైనా దత్త పుత్రుడు, సొంత పుత్రుడికి తేడా వుంటుంది. ఎవరికైనా సొంత బిడ్డలపై ఉన్న మమకారం ఇతరులపై ఎలా వుంటుంది? ఇక్కడ పవన్ విషయంలోనూ అదే జరుగుతోందన్న అనుమానాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. పవన్‌కల్యాణ్ రెండో దశ వారాహియాత్ర అట్టర్ ప్లాప్ అని చెప్పక తప్పదు. ఒక పెద్ద వ్యవస్థపై అవాకులు చెవాకులు పేలడంతో ఆయన యాత్ర ఉద్దేశం పక్కదారి పట్టింది. చంద్రబాబు కోరుకుంటున్నది కూడా ఇదే.
పవన్‌కల్యాణ్ నమ్మదగిన నాయకుడు కాదనేది చంద్రబాబు బలమైన అభిప్రాయం. ఎప్పుడు ఎలా వుంటారో ఆయనకే తెలియదని, అలాంటి వాన్ని పట్టుకుని రాజకీయం చేయడం అంటే కుక్క తోక పట్టుకుని గోదారిని ఈదిన చందమవుతుందని టీడీపీ భావన.
చంద్రబాబు వయసు పైబడుతున్న దృష్ట్యా లోకేశ్‌ను నాయకుడిగా తీర్చిదిద్దాల్సిన బాధ్యతను టీడీపీ భుజాన వేసుకుంది. వైఎస్ జగన్‌కు ప్రత్యామ్నాయ నాయకుడిగా లోకేశ్‌ను తయారు చేసుకోవాల్సి వుంది. అయితే పవన్‌కల్యాణ్ సినిమా హీరో కావడంతో ఆయనక ఇమేజ్ వుంది. దాన్ని దెబ్బ తీయాలంటే ….అజ్ఞానంతో కూడిన కామెంట్స్ చేయించడం ఒక్కటే మార్గం. ఈ పరంపరలో వాలంటీర్లపై పవన్‌తో వివాదాస్పద వ్యాఖ్యలు చేయించారనే చర్చ జరుగుతోంది. ఇదంతా లోకేశ్ బెటర్ అని నిరూపించేందుకు వేసిన ఎత్తుగడగా అనుమానిస్తున్నారు.