సుఖ పురుషుడైన నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తారనే వార్త బయటికొచ్చినప్పుడు ప్రత్యర్థులు నవ్వుకున్నారు. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉలిక్కి పడ్డారు. సోషల్ మీడియాకే పరిమితం అవుతూ ట్వీట్లు చేస్తూ కాలం గడిపే లోకేశ్… సుదీర్ఘ పాదయాత్ర చేయగలరా? అనే చర్చ జరిగింది. పులిని చూసి నక్క వాత పెట్టుకన్న చందంగా, సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర చేశాడని, తాను కూడా చేయడానికి సిద్ధం కావడం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమైంది.
జగన్‌లా లోకేశ్‌కు పట్టుదల లేదని, మధ్యలోనే నడక ఆగుతుందనే విస్తృతమైన చర్చ జరిగింది. కానీ అందరూ ఊహించినట్టు ఆయన నడక ఆగలేదు. ఈ ఏడాది జనవరి 27న కుప్పంలో వేసిన మొదటి అడుగు 153వ రోజుకు చేరుకునే సరికి 2 వేల కిలోమీటర్లకు చేరుకుంది. 9 జిల్లాల్లో 53 నియోజకవర్గాల్లో లోకేశ్ పాదయాత్ర సాగింది. ఒక రాజకీయ నాయకుడికి పాదయాత్ర అనేది ఎంతో ప్రయోజనం కలిగించే అంశం.
ప్రజలతో మమేకం కావడం అనేది రాజకీయ నాయకులకు అత్యంత ఆవశ్యకమైంది. చిన్న వయసులోనే లోకేశ్ పాదయాత్ర చేయాలని నిర్ణయించుకోవడం, పట్టుదలతో నడక సాగించడం అభినందించదగ్గ విషయం. అయితే నడక వరకూ ఓకే. కానీ ఆయన నడతలో పెద్దగా మార్పు వచ్చినట్టు కనిపించడం లేదు. లోకేశ్‌లో పాదయాత్రకు ముందు ఎలాంటి స్వభావం ఉన్నదో, 2 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న నాటికి కూడా అదే మనస్తత్వం. పాదయాత్ర అనేది నడతలో మార్పు కోసం చేసేది. అంతే తప్ప, అదేమీ వాకింగ్ రేస్ కాదని గ్రహించాలి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలపై ఇష్టానుసారం మాట్లాడ్డమే నాయకత్వ లక్షణమని లోకేశ్ భావిస్తుంటే ఎవరూ ఏమీ చేయలేరు. ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు చేస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. అదేంటో గానీ, తాము అధికారంలోకి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తానని, అమెరికా వెళ్లినా, అండమాన్‌లో దాక్కున్నా ఈడ్చుకొచ్చి శిక్షిస్తామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.
లోకేశ్ మాటలు ఎలా వున్నాయంటే… వైసీపీపై ప్రతీకారం తీర్చుకోడానికి అధికారం ఇవ్వమని వేడుకుంటున్నట్టు కనిపిస్తోంది. నాలుగేళ్ల క్రితమే తమ ప్రభుత్వం దిగిపోయిందని ఆయనకు గుర్తున్నట్టు లేదు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన పార్టీకి చెందిన నాయకుడు హామీలిస్తున్నట్టుగా… అన్నీ కొత్తగా ప్రకటిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇస్తున్న హామీలు అమలు చేయడానికి ఇబ్బంది ఏంటో ఆయనకే తెలియాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. లోకేశ్ చుట్టూ చిల్లర బ్యాచ్ వుందని, ఆయన ప్రసంగాల్ని వింటే ఎవరికైనా అర్థమవుతుంది.
ఇంత వరకూ ఒక్కటంటే ఒక్కటి కూడా ఆకట్టుకునే ప్రసంగం చేయలేదు. తన తండ్రి రాముడు, తాత దేవుడని, తాను మూర్ఖుడని చెప్పుకోడానికి రాష్ట్రమంతా నడుస్తున్నారనే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సింది సమర్థుడైన లీడర్ షిప్. ప్రత్యర్థికంటే అన్ని విషయాల్లో మెరుగైన లీడర్నని నిరూపించుకుంటేనే లోకేశ్‌కు ప్రయోజనం. అలా కాకుండా సైకో పోవాలి, సైకిల్ రావాలనే నినాదంతో ముందుకెళుతూ, తాను కూడా మూర్ఖుడని లోకేశే స్వయంగా అందరికీ చెప్పడం ఆయన అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనం. అందుకే నడత మారలేదని చెప్పడం.