భారతీయజనతా పార్టీకి, ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ ఒక్కతాటిమీదకు వచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. మోడీని గద్దె దించడానికి విపక్షాలు అన్నీ కలవవలసిన ఆవశ్యకత ఉన్నదని.. విపక్ష కూటమికి సారథ్యం వహిస్తున్న కీలక పార్టీలు అంటున్నాయి. ఆ మేరకు దేశంలో ఉన్న పార్టీలు అన్నింటినీ సంప్రదించి జట్టులోకి తీసుకువస్తున్నాయి.
పాట్నాలో నితీశ్ కుమార్ సారథ్యంలో తొలి సమావేశం జరిగినప్పుడే.. సుమారు 17 పార్టీలకు చెందిన వారు ఆ భేటీకి హాజరయ్యారు. తర్వాతి సమావేశం సిమ్లాలో నిర్వహించాలని కూడా అనుకున్నారు. అయితే ఆ వేదిక కాస్తా సిమ్లానుంచి బెంగుళూరుకు మారింది.
ఇప్పుడు బెంగుళూరులో విపక్షాల భేటీ జరగబోతున్న సమయంలో.. మరో ఎనిమిది పార్టీలు ఈ కూటమికి మద్దతు ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. కేవలం అక్షరాల్లో గమనించినప్పుడు.. విపక్షాల కూటమిలో ఏకంగా 25 పార్టీలు ఉన్నట్టుగా కనిపిస్తోంది. విపక్ష కూటమి మహా బలంగా ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. కానీ వాస్తవంలో అదే పరిస్థితి ఉన్నదా? అనేది ప్రధానమైన చర్చ.
ఒకవైపు తెలంగాణ ఎన్నికల్లో తప్పుడు సంకేతాలు వెళతాయనే భయంతో.. భారాసను కూటమి దగ్గరకు కూడా రానివ్వం.. భారాస ఉంటే ఆ కూటమిలో తాము ఉండబోమని తేల్చి చెప్పేశాం అంటూ రాహుల్ ఆ నడుమ రకరకాల ప్రతిజ్ఞలు చేశారు. ఎంపీల సంఖ్యాపరంగా బలమైన పార్టీలు కొన్ని కూటమి వైపు చూడడం లేదు, మరి కొన్నింటిని వారు దగ్గరకు రానివ్వడం లేదు. అదే సమయంలో ఊరూపేరు లేని పార్టీలను లెక్కకు మిక్కిలిగా చేర్చుకుంటున్నారు. సింగిల్ ఎంపీ కూడా లేని పార్టీలను కూడా కూటమిలో జట్టుగా కలుపుకుంటున్నారు. ఇలాంటి పార్టీలు ఉండడం వలన ఉపయోగం ఏమిటి?
విపక్ష కూటమి గ్రూప్ ఫోటో దిగినప్పుడు.. ఆ ఫోటో చేతులు కలిపిన నాయకులతో నిండుగా కళకళలాడుతూ కనుల పండుగగా కనిపిస్తుంది. అంతే తప్ప అలాంటి పార్టీలతో కూటమికి బలం వస్తుందా? పైగా, రేపు ఎన్నికలు రాగానే విపక్ష కూటమిలో భాగంగా ఉన్నాము గనుక.. తమకు కూడా కొన్ని ఎంపీ సీట్లు కేటాయించాలని.. సొంతంగా బలం లేని ఈ పార్టీలన్నీ అడిగితే ఏం చేస్తారు?
కూటమి బలం మీద తాము లబ్ధి పొందాలని అనుకునే అనాకానీ పార్టీల వ్యూహానికి తలొగ్గుతారా? అలా జరిగితే అది కూటమికే నష్టదాయకం అవుతుంది కదా? అనేది ఇంకో రకమైన ప్రమాదం. మొత్తానికి సంఖ్యాపరంగా తప్ప.. విపక్ష కూటమికి ఏమాత్రం అవసరం లేని, మోడీ అండ్ కోను బెదిరించడానికి కూడా ఉపయోగపడని పార్టీలను చేర్చుకోవడం ద్వారా.. విపక్షాలు సాధించేది పెద్దగా ఉండదని, కేవలం అందమైన, నిండైన గ్రూప్ ఫోటో మాత్రమే వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.