ఇప్పుడు ఏపీ ఎన్నికల ప్రచారానికి సినిమా హీరో గ్లామర్ అద్దబడుతోంది. మెగా ఫ్యామిలీలో హీరో వరుణ్ తేజ్ ఏపీ ఎన్నికల ప్రచార పర్వంలోకి అడుగుపెట్టబోతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా వరుణ్ తేజ్ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నట్టుగా పార్టీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
అయితే ఇక్కడ సామాన్యులకు ఒక సందేహం కలుగుతోంది. సినిమా గ్లామర్ ప్రచారాలు పవన్ కల్యాణ్ కు అవసరమా? స్వయంగా పవర్ స్టార్ అయిన పవన్ కల్యాణ్ తన సొంత గ్లామర్ తో పాటు, తన కాపుకులం ఓట్లను నమ్ముకుని పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. వీటన్నింటికీ తోడు.. ఇప్పుడు ఇతర హీరోల గ్లామర్ కూడా ఉంటే తప్ప తాను గెలవను అనే భావనకు ఆయన వచ్చేశారా? అనేది సందేహం.
మరో పాయింట్ ఏంటంటే.. వరుణ్ తేజ్- బాబాయి ముఖ ప్రీతి కోసం ప్రచారానికి వెళుతున్నారా? లేదా, బాబాయి పార్టీకి మద్దతుగా వెళుతున్నారా? అనేది కూడా ఆలోచించాలి. స్వయంగా వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు కూడా జనసేన పార్టీకి కీలకమైన స్టార్ క్యాంపెయినర్! కానీ ఆయన పిఠాపురంలో ఉండి పడగల ఓట్ల లెక్కలను సమీక్షించుకుంటూ గడిపేయడం తప్ప.. పార్టీ కోసం లేదా కూటమి కోసం రాష్ట్ర మంతా పర్యటిస్తున్న సందర్భాలు కనిపించడం లేదు. ఇప్పుడు ఈ హీరో రంగంలోకి వస్తున్నారు. ఆయన ప్రచారం చేస్తే తప్ప పవన్ కల్యాణ్ గెలిచే అవకాశం లేదా? అనేది ప్రజల సందేహం.
నిజంగా వరుణ్ తేజ్ కు చిన్నాన్న మీద అంత ప్రేమ ఉంటే ఆయన పార్టీ కోసం 21 నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలి. ఆయన హీరోయిజం వల్ల పది ఓట్లు పడినా ఆ పార్టీకి మేలు జరుగుతుంది. పవన్ కల్యాణ్ కు నిజంగా వరుణ్ తేజ్ ప్రచారం మీద అంత శ్రద్ధ ఉంటే.. అలాగే కూటమి మీద ప్రేమ ఉంటే.. వరుణ్ తేజ్ తో కూటమి అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్న క్లిష్ట నియోజకవర్గాల్లో ప్రచారం చేయించాలి. ఆ రకంగా కూటమికి మేలు చేయాలి. అవేమీ చేయకుండా ఈ మెగా కుటుంబం డ్రామాలాడుతున్నదని ప్రజలు అంటున్నారు.
వరుణ్ తేజ్ పిఠాపురంలో మాత్రం ప్రచారం నిర్వహించడం అంటే.. కూటమి గెలుపు మీద వారికి నమ్మకం లేకపోవడానికి చిహ్నం అని వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ మళ్లీ గెలిస్తే.. ఏదో బాబాయి కోసం వెళ్లాను తప్ప మీకు వ్యతిరేకంగా కాదు.. అనే మాటతో జగన్ ను ఆశ్రయించి.. మళ్లీ తన సినిమాలకు ప్రభుత్వ పరంగా ఎడ్వాంటేజీలు పొందడానికి ఇలాంటి కుట్ర అని కూడా వినిపిస్తోంది.