తాను జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే ఉద్దేశంతో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చాడు. జాతీయ రాజకీయాల్లో గాయిగాత్తర లేపుతానని, దేశంలో మంట పెడతానని పెడబొబ్బలు పెట్టాడు. చాలా రాష్ట్రాలు తిరిగాడు. అక్కడి ముఖ్యమంత్రులతో చర్చలు జరిపాడు.
కారణాలేవైనా చివరకు రాష్ట్రానికే పరిమితమయ్యాడు. ఎన్నికల్లోనూ ఓడిపోయాడు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చాలామంది పార్టీ నుంచి వెళ్లిపోయారు. తాను బాగా నమ్ముకున్నవాళ్ళు సైతం కారు దిగి చేయి అందుకున్నారు. కొందరు కమలం పార్టీలోకి వెళ్లారు. మొత్తం మీద పార్టీ కకావికలైంది.
పార్టీ పేరు మార్చినందువల్లనే ఎన్నికల్లో ఓడిపోయామని, తెలంగాణ సెంటిమెంట్ ను వదిలేసాం కాబట్టే ఇలా అయిపోయామని నాయకులు గగ్గోలు పెట్టారు. మళ్ళీ పార్టీ పేరు మార్చాలని బాస్ మీద ఒత్తిడి తెచ్చారు. చాలా రోజులు దీనిపై ఏమీ మాట్లాడని బాస్ చివరకు పార్టీ పేరు మారదని క్లారిటీ ఇచ్చాడు. అంటే పార్టీ జాతీయ పార్టీగానే ఉంటుందని అర్ధం.
కానీ ఒక జాతీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలేవీ బీఆర్ఎస్ కు లేవు. కేసీఆర్ కూడా జాతీయ రాజకీయాల గురించి అసలు మాట్లాడటంలేదు. ప్రస్తుతం ఆయన తన పూర్తి కాన్సంట్రేషన్ రాష్ట్రంలో ఎక్కువ పార్లమెంటు స్థానాలను గెలుచుకోవడం మీదనే పెట్టాడు. తన పార్టీకి ఇంకా ప్రజాదరణ ఉందని నిరూపించుకోవాలని అనుకుంటున్నాడు.
పార్టీ కకావికలైనా, కూతురు కవిత జైలుకు వెళ్లినా అన్ని బాధలు దిగమింగుకొని ప్రచారం చేస్తున్నాడు. సాధారణంగా ఎన్నికల ప్రచారంలో ఎవరైనా చెప్పిందే చెబుతుంటారు. కేసీఆర్ కూడా అదే చేస్తున్నాడు. ఇక ఆయన నిన్న మహబూబ్నగర్ ప్రచారంలో ఒక మాటన్నాడు.
కాంగ్రెస్ అండ్ బీజేపీ పనిగట్టుకొని ప్రాంతీయ పార్టీలను దెబ్బ తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డాడు. కేసీఆర్ తన పార్టీకి జాతీయ పార్టీగా పేరు మార్చుకున్నా ఇప్పటికీ ప్రాంతీయ పార్టీగానే ఉంది కాబట్టి ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాయని అనడంలో తన పార్టీని కూడా కలుపుకొని అన్నట్లే కనబడుతోంది. పార్టీ ఓడిపోగానే చాలామంది కాంగ్రెస్ అండ్ బీజేపీలోకి వెళ్లిపోయారు. కూతురు కవిత లిక్కర్ కుంభకోణంలో తీహార్ జైలుకు వెళ్ళింది. వీటిని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ అలా అని ఉండొచ్చు.
బీఆర్ఎస్ ఇప్పటికీ ప్రాంతీయ పార్టీయే అని ఆయన పరోక్షంగా చెప్పినట్లయింది. పార్టీ పేరు మార్చుకున్నా కేసీఆర్ ఇప్పట్లో జాతీయ రాజకీయాల్లోకి పోవడం, చక్రం తిప్పడం జరిగే ఛాన్స్ లేదు.