కోర్టు కొట్టేసినా.. ఆ జీవో అవసరమే!

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. పరిపాలనలో ఉన్న అవ్యవస్థలను చక్కదిద్దాలనే ఒక ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఎంతో అవసరాన్ని గుర్తించి తీసుకున్న నిర్ణయాలు కూడా కొన్ని.. కోర్టు ఎదుట తేలిపోతుంటాయి. ఆ…

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. పరిపాలనలో ఉన్న అవ్యవస్థలను చక్కదిద్దాలనే ఒక ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఎంతో అవసరాన్ని గుర్తించి తీసుకున్న నిర్ణయాలు కూడా కొన్ని.. కోర్టు ఎదుట తేలిపోతుంటాయి. ఆ జీవోలను కోర్టు కొట్టేస్తుంటుంది. 

నిజానికి కోర్టు కొట్టేసిన జీవోలోని అంశాలు సరైనవేనా కాదా? అనే మీమాంసజోలికి వెళ్లకుండా.. జీవోను కోర్టు కొట్టేయడంతోటే.. పచ్చదళాలు అన్నీ పండగ చేసుకుంటూ ఉంటాయి. సర్కారును విమర్శించడానికి ఒక సరికొత్త అస్త్రం దొరికిందని మురిసిపోతుంటాయి. ఇలాంటి నేపథ్యంలో  తాజాగా హైకోర్టు జీవో నెంబరు 192 ను కొట్టివేయడం అనేది చర్చనీయాంశం అవుతోంది. 

ఇంటర్, విద్యా చట్టాలకు వ్యతిరేకంగా ఆ జీవో ఉన్నదని హైకోర్టు భావించి, ప్రస్తుతానికి జీవోను కొట్టివేసి ఉండవచ్చు గాక.. కానీ.. అలాంటి జీవో యొక్క అవసరం చాలా ఉన్నదని ప్రజలు భావిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి సర్కారు ఈ జీవోపై కోర్టులో జరిగిన వాదప్రతివాదాలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. లోపరహితంగా ఇదే ఏర్పాటుకోసం మరో జీవో తేవాల్సిన అవసరం ఉన్నదని ప్రజలు కోరుకుంటున్నారు.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఏపీలోని ప్రెవేటు జూనియర్ కళాశాలల్లో తనిఖీలకు ఒక కమిటీని నియమిస్తూ సర్కారు జీవో 192 జారీ చేసింది. ఈ జీవోను జూనియర్, వొకేషనల్ కళాశాలలు హైకోర్టులో సవాలు చేశాయి. కళాశాలల్లో సౌకర్యాల పరిశీలనకు తాము కమిటీ వేసినట్టుగా ప్రభుత్వం వాదనను కోర్టు తోసిపుచ్చి ఆ జీవోనే రద్దు చేసేసింది. ఇది జూనియర్ కళాశాలల మాఫియాకు పెద్ద ఊరట కావొచ్చు.

కానీ.. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యారంగం మెరుగ్గా ఉండాలంటే.. ఈ జీవో యొక్క అవసరం చాలా ఉన్నదని ప్రజలు భావిస్తున్నారు. ఎలాంటి వసతులు లేకుండా, లేబొరేటరీలు, క్రీడామైదానాలు, ఇతర కనీస వసతులు లేకుండా.. అపార్టుమెంట్లలో, షెడ్లలో కూడా నడుస్తున్న ప్రెవేటు జూనియర్ కళాశాలలు ఏపీలో వందల సంఖ్యలోనే ఉన్నాయి. ఫీజులు లక్షల్లో దోచుకుంటూ.. విద్యార్థులను పశువుల్లా ట్రీట్ చేస్తున్న సంస్థలు అనేకం ఉన్నాయి. 

వొకేషనల్ కాలేజీల పరిస్థితి అయితే మరీ దారుణం. వొకేషనల్ ట్రైనింగ్ నామమాత్రం ఇవ్వగల లేబ్ ఫెసిలిటీలు కూడా లేకుండా.. వంచనతో కూడిన చదువును అందించి సర్టిఫికెట్లు ఇచ్చి దేశం మీదికి పంపేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గపు పోకడల్ని సరిదిద్దడానికి తనిఖీల కోసం కమిటీ ఏర్పాటుచేస్తే.. ఇవాళ ఆ జీవో చెల్లకుండా పోయింది.

కానీ.. ఈ సంస్థల తనిఖీ అనేది చాలా అవసరం. అందుకోసం ప్రభుత్వం కాస్త ముందుచూపుతో ఇంటర్, విద్యా చట్టాలను జాగ్రత్తగా పరిశీలించి.. ఆయా చట్టాలకు లోబడిన విస్తృతాధికారాలతో సరికొత్త కమిటీని ఏర్పాటు చేయాలని విద్యార్థి వర్గాలు కోరుకుంటున్నాయి.