స్టేషన్ ఘనపూర్ గులాబీ నాయకుల మధ్య పంచాయతీ మరీ నీచంగా మారుతోంది. ఇద్దరు నాయకులు రోడ్డున పడి నేలబారు విమర్శలు చేసుకోవడం వల్ల పార్టీ పరువు దారుణంగా దిగజారిపోతోంది. నాయకుల మధ్య వైషమ్యాలు ఎలాగైనా ఉండవచ్చు గాక.. వారి మధ్య దారుణమైన విమర్శలు ఎలాగైనా సాగవచ్చు గాక.. కానీ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడిన మాటలు సమర్థించదగినవి కాదు.
ప్రస్తుతానికి ఈ ఘనపూర్ నేతల పంచాయతీ ప్రగతి భవన్ కు చేరినట్లుగా వార్తలు వస్తున్నాయి. రాజయ్య దిగజారుడుస్థాయి విమర్శల గురించి ప్రగతిభవన్ పెద్దలు సీరియస్ క్లాస్ తీసుకోలేకపోతే గనుక.. పార్టీ పరువు మరింతగా నాశనం అవుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు.
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య, అదే నియోజకవర్గం నుంచి పోటీచేయాలనే కోరిక ఉన్న ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వివాదాలు చాలాకాలం నుంచి ఉన్నాయి. కడియంతో ఉన్న తగాదాలు ఒక ఎత్తు అయితే.. పాపం, ఎమ్మెల్యే రాజయ్యకు నియోజకవర్గంలో ఇంకా చాలాచాలా తలనొప్పులు ఉన్నాయి. మహిళా ప్రజాప్రతినిధులను లైంగికంగా వేధిస్తున్న ఆరోపణలు, నిధుల విడుదల విషయంలో సంకుచితంగా వ్యవహరిస్తూ, అవినీతికి పాల్పడుతున్న ఆరోపణలు అనేకం ఉన్నాయి. ఇన్నింటితో ఆయన సతమతం అవుతూ కడియంతో తగాదాల మీద కూడా ఫోకస్ పెడుతున్నారు.
ఈ ఇద్దరు మాజీ మంత్రుల నడుమ నీచరాజకీయ తగాదాలు ఎలాగైనా ఉండవచ్చు గాక.. కానీ కడియం గురించి తాటికొండ రాజయ్య మాట్లాడిన మాటలు మాత్రం ఏమాత్రం సమర్థించలేనివి. పైగా అసహ్యకరమైనవి. ‘కడియం శ్రీహరి తల్లి సత్యం, తండ్రి అపోహ’ అంటూ రాజయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదానికే దారి తీశాయి.
కడియం తల్లి పద్మసాలి కులానికి చెందినది కాగా, ఆయన తండ్రి ఎస్సీ అనే సంగతి సుప్రీంకోర్టులో కూడా తేలినట్టు శ్రీహరి చెబుతున్నారు. పిల్లలకు తండ్రికులమే వర్తిస్తుంది గనుక.. తాను ఎస్సీ అవుతాననేది ఆయన వాదన. ఈ రాజకీయ పదవుల కోసం చేసుకునే వాదనలు సంగతి ఎలా ఉన్నప్పటికీ.. ఇలా ‘తల్లి సత్యం, తండ్రి అపోహ’ అంటూ రాజయ్య మాట్లాడడం మాత్రం నీతిబాహ్యమైనది.
నిజానికి ఈ మాట ఒక సినిమా డైలాగు. ‘తల్లి నిజం.. తండ్రి నమ్మకం’ అంటూ అంతఃపురం చిత్రంలో డైలాగు ఉంటుంది. చాలా చేదు వాస్తవం ఈ డైలాగు. తండ్రి నమ్మకం అనేది నిజమే. కానీ.. కడియం విషయంలో మాత్రమే ఆ మాట వర్తిస్తుందని అనుకుంటే పొరబాటు. ఈ ప్రపంచంలో ప్రతి పుట్టుక విషయంలోనూ ఇదే సిద్ధాంతం సార్వజనీనంగా వర్తిస్తుంది.
ఇలాంటి నీచమైన విమర్శలతో కడియం పరువు తీశానని రాజయ్య అనుకుని ఉండవచ్చు. కానీ నిజానికి పోయింది భారాస పార్టీ పరువు కూడా. ప్రగతి భవన్ కు ఈ ఇద్దరు నాయకులను పిలిపించినట్లు వార్తలు వస్తుండగా.. తతిమ్మా వివాదం సంగతి ఎలా ఉన్నా.. ఈ ఒక్క మాట అన్నందుకు రాజయ్యకు సీరియస్ గా క్లాస్ పీకే ధైర్యం భారాస అగ్రనాయకులకు లేకపోతే.. వారు పార్టీని రుజుమార్గంలో ముందుకు తీసుకువెళ్లలేరు.