ముల్లును ముల్లుతోనే తీయాలి అనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారో ఏమో గానీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా రాహుల్ విమర్శలకు కౌంటర్ ఇవ్వడానికి తడబడుతున్నారు.. ఆ తడబాటులో ఆయన మాటలనే ఆయన మీదికి సంధిస్తున్నారు. విద్వేషాలు అనే విమర్శలకు, అదే విద్వేషాన్ని ప్రతివిమర్శగా సంధిస్తే సరిపోతుందని నడ్డాజీ అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే రాహుల్ మీద పసలేని విమర్శలు సంధిస్తున్నారు!
ప్రధాని నరేంద్ర మోడీ మీద విమర్శలతో విరుచుకు పడడంలో భాగంగా.. రాహుల్, ఆయన దేశం మొత్తానికి విద్వేష విషం పంచి పెడుతున్నారు అని తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. మోడీజీ పంచుతున్న విద్వేష విషానికి విరుగుడుగా.. తాము ప్రేమను పంచుతున్నామని రాహుల్ అనేక సందర్భాల్లో అంటుండడం మనం గమనిస్తాం.
తాను సాగించిన భారత్ జోడో యాత్రను కూడా ఉదాహరిస్తూ రాహుల్ పలు సందర్భాల్లో.. జోడో ద్వారా.. మనుషుల్ని ముడివేయడానికి ప్రయత్నిస్తున్నామని మోడీ మాత్రం మనుషుల్ని విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శలు చేస్తుండడం జరుగుతోంది.
ఇలాంటి నేపథ్యంలో జెపి నడ్డా, రాహుల్ విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు. రాహుల్ గురించి ఇతరత్రా ఏ విమర్శలు చేసినా చెల్లుబాటు అవుతాయేమోగానీ.. విద్వేషం విమర్శలతోనే ఆడిపోసుకుంటున్నారు. రాహుల్ విద్వేషపు మెగా మాల్ నడుపుతున్నారని అంటూ నడ్డా విమర్శించడం గమనార్హం.
ఇంతకూ విద్వేషం అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు సాధారణ ప్రజల దృష్టిలో ఉండే భావం ఏమిటో నడ్డాకు అవసరం లేదు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడడాన్నే ఆయన విద్వేషానికి నిదర్శనంగా పరిగణిస్తున్నట్టు ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. మోడీజీకి ప్రపంచమంతా దక్కుతున్న ఆదరణ చూసి కాంగ్రెసు నాయకులు అసూయపడుతున్నారట. ఈ టైపు సొంతడబ్బా కొట్టుకోవడం వరకు ఓకే గానీ.. తమ ప్రభుత్వం చేస్తున్న చేతలు కాకుండా, రాహుల్ మాటలే దేశంలో విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాయని ఆయన అంటేనే ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదు.
రాహుల్ అన్నా, అనకపోయినా దేశంలో విద్వేష ప్రచారం సాగిస్తున్న రాజకీయ పార్టీ ఏదో ప్రజలకు తెలుసు. కేవలం ఒక నాయకుడు ఒక మాట వదిలినంత మాత్రాన దేశప్రజలు మొత్తం దాన్ని గుడ్డిగా నమ్మరు. విద్వేష ప్రచారం వంటి విషయాల్లో తమ సొంత వివేచన ఉపయోగించే నాయకుల మీద అభిప్రాయం ఏర్పాటుచేసుకుంటారు. ఆ సంగతిని నడ్డా తెలుసుకుంటే మంచిది.