ఒక పక్క నిర్మాణ వ్యయం తగ్గించుకోవాలని నిర్మాతల గిల్డ్ లో తలలు బద్దలు కొట్టుకుంటూ వుంటారు. మరోపక్క కొత్త ఖర్చులు అలవాటు చేసుకుంటూ వుంటారు.
టాలీవుడ్ లో టాప్ హీరోలు ఇప్పుడు చార్టర్ ఫ్లయిట్ లేనిదే ఎక్కడకూ వెళ్లడం లేదు. టాప్ హీరోలు అందరిదీ ఇదే పరిస్థితి. ఊ అంటే చార్టర్ ఫ్లయిట్ ఎక్కుతున్నారు. నార్త్ లో ప్రచారం చేయాలన్నా చార్టర్ ఫ్లయిట్ బుక్ చేస్తున్నారు.
ఇప్పుడు ఈ చార్టర్ ఫ్లయిట్ వాడకం మిడ్ రేంజ్ హీరోల దగ్గరకు కూడా వచ్చేసింది. ఈ రోజు విశాఖలో ‘సుందరం మాస్టార్’ టీజర్ లాంచ్ జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో సాయి ధరమ్ తేజ్ ను గెస్ట్ గా పిలిచారు. ఆయన ఓకె అన్నారు. మరో ఒకరిద్దరు దర్శకులు కూడా గెస్ట్ లుగా వచ్చారు. అయితే వీరందరికీ కలిపి చార్టర్ ఫ్లయిట్ బుక్ చేయడం విశేషం.
సుందరం మాస్టార్ అనేది వైవా హర్ష హీరోగా తయారు చేసిన చిన్న సినిమా. ఓ చిన్న సినిమాకు కూడా ఇరవై పాతిక లక్షలు ఖర్చు చేసి చార్టర్ ఫ్లయిట్ బుక్ చేసి మరీ టీజర్ ఫంక్షన్ చేయడం నిజంగా విశేషమే. ఇది అలవాటు అయితే ఇంకేం వుంది. ఏ హీరోను ఎక్కడకు రమ్మన్నా, చార్టర్ ఫ్లయిట్ అంటారేమో?