రాజధాని వ్యవహారంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన ఫిటిషన్ను కోర్టు డిసెంబర్ నెలకు వాయిదా వేసింది. ఇప్పటికే హైకోర్టు తీర్పులోని కొన్ని ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ కీలకమైన రాజధాని విషయంలో తదుపరి చట్టం చేసే అధికారం ఏపీ అసెంబ్లీకి లేదన్న ఆదేశాలపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పలేదు. వాస్తవానికి ఈ అంశంపై వాదనలు కూడా ప్రారంభం కాలేదు.
సుప్రీం తీర్పు ఎలా ఉంటుందన్న విషయంలో ఇబ్బంది లేకపోయినా తీర్పు ఎన్నికలకు ముందే వస్తుందా? రాదా? అన్న విషయంలో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. అమరావతి రైతులు కూడా తీర్పు కన్నా వాయిదానే కోరుకుంటున్నట్లు వారి స్పందన బట్టి అర్థం చేసుకోవచ్చు.
అంటే ఎన్నికల్లోపు తీర్పు రాకపోతే మధ్య కోస్తా జిల్లాల్లో రాజధానిని మారుస్తున్నారు అన్న వ్యతిరేకతను ప్రభుత్వం ఎదుర్కోవలసి ఉంటుంది. అదే సమయంలో రాజధాని వస్తే సంతోషం వ్యక్తం కావల్సిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రాజధాని రాలేదు కనుక ప్రభుత్వం పట్ల కొద్దో గొప్పో అసంతృప్తి వ్యక్తం అవుతుంది.
స్థూలంగా రాష్ట్రం మొత్తం మీద ఆలోచనా పరులు ఏమిటీ గందరగోళం అన్న విమర్శలు ఇప్పటికే చేస్తున్నారు. స్థూలంగా ఎన్నికల్లోపు తీర్పు రాకపోతే అధికార పార్టీని ఇరుకన పెట్టె ఆలోచన విపక్ష పార్టీది అయితే – మేము చేయాలనుకున్నాము కాని కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారు.. మేము గెలిస్తే రాయలసీమలో హైకోర్టు, విశాఖలో సచివాలయం ఏర్పాటు చేస్తాం అంటే రెండు ప్రాంతాల్లో ప్రజలు ఆహ్వానిస్తారన్న ఆలోచన అధికార పార్టీది. అధికార, విపక్షాల ఆలోచనలు, వ్యూహాలు ఎలా ఉన్నా రాజధాని వ్యవహారంలో అధికార వైసీపీ ప్రభుత్వం రాజధాని లేదా రాజకీయ సుడిగుండంలో ఇరుక్కుందని చెప్పక తప్పదు.
మధ్య కోస్తాంధ్రలో వ్యతిరేకత
అమరావతి కేంద్రంగా మధ్య కోస్తాంధ్రలో మూడు రాజధానుల విషయంలో స్పష్టమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వం మూడు రాజధానులపై విధానపరమైన నిర్ణయం తీసుకుని అమలు పూర్తి చేసి ఉంటే అసంతృప్తి మాత్రమే ఉండేది. పై పెచ్చు విశాఖలో సచివాలయం, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసినా లేదా కనీసం అధికారిక నిర్ణయం జరిగి ఉన్నా రానున్న ఎన్నికల్లో విపక్షాలు తాము అధికారంలోకి వస్తే అమరావతినే ఏకైక రాజధానిగా చేస్తామని చెప్పే సాహసం చేసి ఉండరు.
మధ్య కోస్తాంధ్రలో కూడా ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత ఉన్నా చేసేదేమీ లేదు కాబట్టి అసంతృప్తికే పరిమితం అయ్యేది. కానీ ఎన్నికల్లోపు విధాన నిర్ణయం తీసుకునే అవకాశం కనపడటం లేదు కనుక మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని ఉండదని, తాము అధికారంలోకి వస్తే ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని స్పష్టంగా విపక్ష తెలుగుదేశం ప్రకటిస్తుంది. అక్కడి ప్రజలు కూడా సానుకూలంగా ఉండే అవకాశం ఉంది.
రాయలసీమ ప్రజలలో సడలుతున్న ఆశలు..
మూడు రాజధానుల ప్రతిపాదనతో మధ్య కోస్తాంధ్రలో వ్యతిరేకత వ్యక్తం కావడం సహజం. అదే సమయంలో మాకు మూడు రాజధానుల ఆలోచనతో న్యాయం జరుగుతుందని సీమ ప్రజలు సానుకూలంగా ఉండాలి.
ప్రారంభంలో అలాంటి వాతావరణం ఉన్నా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వల్ల క్రమేణా ఆశలు కోల్పోతున్నారు. అందుకు కారణం సీమ ప్రజలలో ఆకాంక్షలు లేక కాదు వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ వ్యవహారాలే అనక తప్పదు.
శ్రీబాగ్ స్ఫూర్తి అంటే తెలుసా ?
అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం శ్రీబాగ్ ఒప్పందాన్ని పదే పదే ప్రస్తావిస్తోంది. అలా అని శ్రీబాగ్ స్ఫూర్తి ఆచరణలో కనపడుతుందా అంటే అదీ లేదు. శ్రీబాగ్ ప్రకారం రాయలసీమలో ఉండాల్సింది రాజధానే. కానీ ప్రతిపాదించింది హైకోర్టు, న్యాయ స్వభావం కలిగి ఉన్న కార్యాలయాల ఏర్పాటు.
హైకోర్టు పరిస్థితి ఎలా ఉన్నా కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని సంబందం లేని విశాఖలో ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశారు. జ్యూడిషియల్ అకాడమీని తాత్కాలికంగా అనే పేరుతో మంగళగిరిలో ఏర్పాటు చేయడం, తెలుగు అకాడమీని తిరుపతిలో అని జీఓ ఇచ్చి పనులు అన్నీ విజయవాడ నుంచి నిర్వహించడం దేనికి సంకేతం. తమ చేతిలో మాత్రమే లేని హైకోర్టు రాయలసీమకు ఇస్తామని చెప్పి తమ చేతిలో ఉన్న వాటిని రాయలసీమకు ఇవ్వకపోతే ప్రభుత్వ నిబద్ధతపై విశ్వాసం సన్నగిల్లుతుందన్న స్పృహ కూడా లేకుండా పోయింది.
శ్రీబాగ్ లో అత్యంత కీలకం నీటి ప్రాజెక్టులు
శ్రీబాగ్ అవగాహన మేరకు కృష్ణా, తుంగభద్రపై రాయలసీమ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం చేయాలి. అవగాహన కుదిరి దాదాపు శతాబ్దం కావస్తున్నా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. అలాంటి భావోద్వేగాలతో కూడిన అంశాన్ని భుజానికెత్తుకొని ఆచరణలో ఏమి చేస్తోంది… కేంద్రం జాతీయ రహదారిలో భాగంగా కృష్ణా పై తీగల వంతెన ఏర్పాటుకు పూనుకుంది.
రాయలసీమ ప్రజలు ముఖ్యంగా రాయలసీమ నీటి ప్రాజెక్టులపై అవగాహన కలిగిన వారు అడుగుతుంది తీగల వంతెన స్థానంలో సిద్దేశ్వరం అలుగు చేపట్టాలని. కేంద్రంతో మంచి సంబంధాలు కలిగి పోలవరానికి నిధులు సాధిస్తున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధేశ్వరం అలుగును ఒప్పించలేదా? కనీసం ప్రభుత్వం నోట ఆ మాట కూడా రావడం లేదు. పోనీ సిద్ధేశ్వరం అలుగు అవసరం లేదు …ఇది మా ప్రత్యామ్నాయ ఆలోచన అని కూడా చెప్పరు.
కర్ణాటక చేపట్టిన ఎగువభద్రకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చింది. అదే తుంగభద్రపై ప్రతిపాదనలో ఉన్న గుండ్రేవులకు జాతీయ హోదా ఎందుకు తీసుకురారు? కనీసం అడగరు కూడా. మూడు రాజధానుల ప్రతిపాదనలలో సమ న్యాయం లేకుండా తమ పరిధిలోని అంశాల అమలులో గందరగోళం ఏర్పడింది.
కీలకమైన నీటి ప్రాజెక్టుల విషయంలో శ్రీబాగ్ స్ఫూర్తి కనుచూపు మేరలో కనపడదు. అలాంటి సమయంలో తాము అధికారంలోకి వస్తే శ్రీబాగ్ స్ఫూర్తితో రాయలసీమకు న్యాయ రాజధాని అంటే రాయలసీమ ప్రజలు ఎలా విశ్వసిస్తారు? మరో వైపు అత్యంత కీలకమైన సచివాలయం విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కీలకమైన రాజధాని కార్యాలయం వచ్చే ఉత్తరాంధ్ర ప్రజలు వస్తే సంతోషం… రాకపోయినా పర్వాలేదు అన్న ధోరణితో ఉన్నారు.
స్థూలంగా అభివృద్ధి వికేంద్రీకరణ- మూడు ప్రాంతాల్లో కీలక కార్యాలయాల ఏర్పాటు చేయాలన్న రాజకీయ నిర్ణయం ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వల్ల అటకెక్కినట్టైంది. ముఖ్యంగా ఎన్నికల్లోపు సుప్రీంకోర్టు తీర్పు తదనంతర విధాన నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండా పోయింది.
దీంతో రాజధాని పోతుందని మధ్య కోస్తాంధ్రలో, సచివాలయంపై ఉత్తరాంధ్రలో అంతంత మాత్రంగా స్పందన, శ్రీబాగ్ స్ఫూర్తి కావాలన్న రాయలసీమ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ అడుగులు లేకపోవడంతో సీమలో ఆశలు సన్నగిల్లుతున్న నేపథ్యంలో నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజధాని రాజకీయ సుడిగుండంలో ఇరుక్కుందని చెప్పక తప్పదు.
మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి, రాయలసీమ మేధావుల ఫోరం.