బలగంతో హిట్ హీరోయిన్ అనిపించుకుంది కావ్య కల్యాణ్ రామ్. అంతకంటే ముందు మసూద సినిమాతో కూడా సక్సెస్ కొట్టింది. కానీ ఎప్పుడూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె బయటపెట్టలేదు. అయితే ప్రతి హీరోయిన్ కు ఉన్నట్టుగానే కావ్య కల్యాణ్ రామ్ కు కూడా ఇండస్ట్రీలో కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి.
హీరోయిన్ గా అవకాశాల కోసం ప్రయత్నించే టైమ్ లో చాలా ఆడిషన్స్ ఇచ్చిందంట కావ్య. అయితే కొంతమంది దర్శకులు మాత్రం ఆమె ఫిజిక్ బాగాలేదని ముఖంమీదే విమర్శించారట. హీరోయిన్లు స్లిమ్ గా, అందంగా ఉండాలని.. తను మాత్రం బొద్దుగా ఉన్నావని కొంతమంది దర్శకులు కామెంట్ చేసిన విషయాన్ని కావ్య కల్యాణ్ రామ్ బయటపెట్టింది.
అయితే తనను అలా కామెంట్ చేసిన దర్శకుల పేర్లు మాత్రం ఆమె బయటపెట్టలేదు. వాళ్లు చేసిన ఎగతాళి వల్ల హీరోయిన్ అవ్వాలనే కసి తనలో మరింత పెరిగిందని, అదృష్టం కూడా కలిసొచ్చి సక్సెస్ లు వచ్చాయని తెలిపింది కావ్య కల్యాణ్ రామ్.
ఇలాంటి బాడీ షేమింగ్ కామెంట్స్, ఇండస్ట్రీలో కొత్తేంకాదు. హీరోయిన్ అనుష్కపై ఇలాంటి విమర్శలు చాన్నాళ్లు నడిచాయి. ఆమె బొద్దుగా మారిందని, హీరోయిన్ పాత్రలకు పనికిరాదంటూ సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చ నడిచింది. అటు బాలీవుడ్ లో కూడా కొంతమంది ఈ తరహా కామెంట్స్ ఎదుర్కొన్నారు. ఇప్పుడీ బాడీ షేమింగ్ కామెంట్స్ లోకి కావ్య కల్యాణ్ రామ్ కూడా చేరింది.