రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిని స్పీకర్‌గా ఎన్నుకోనున్నారంటూ గత కొన్ని రోజులుగా కూటమి అనుకూల మీడియా హడావుడి అంతా ఇంతా కాదు. తీరా స్పీకర్ ఎంపిక సమయానికి పురందేశ్వరి పేరుకు బదులు మరో పేరు తెరపైకి వచ్చింది.
గత లోక్‌సభలో స్పీకర్‌గా పని చేసిన ఓంబిర్లానే మరోసారి ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఇండియా కూటమి నుండి కాంగ్రెస్ ఎంపీ సురేశ్ పోటీలో ఉన్నారు. రేపు ఉదయం స్పీకర్ ఎన్నిక జరగనుంది.
ఈ దఫా బీజేపీ పూర్తిస్థాయి మెజార్టీ సాధించలేదు. మిత్రపక్షాల బలంపై మోదీ సర్కార్ ఏర్పాటైంది. అయినప్పటికీ స్పీకర్‌గా తమ పార్టీ అభ్యర్థినే నిలబెట్టడం గమనార్హం. ఇదిలా వుండగా దగ్గుబాటి పురందేశ్వరి కేంద్రమంత్రి పదవిని ఆశించారు. మంత్రి పదవి దక్కకపోవడంతో పురందేశ్వరికి స్పీకర్ పదవి ఇస్తారనే ప్రచారాన్ని హోరెత్తించారు. అయితే పురందేశ్వరికి ఏపీలో రాజకీయ శత్రువులు సొంత పార్టీలో ఎక్కువే. చివరికి ఆమెకు స్పీకర్ పదవి అనేది ఉత్తుత్తిదే అని తేలిపోయింది.