మనకి లెజెండ్ అంటే బాలకృష్ణ. కానీ కోలీవుడ్ లో ఓ లెజెండ్ ఉన్నారు. ఆయనే శరవణన్. ది లెజెండ్ సినిమాతో హీరోగా మారిన ఈ వ్యాపారవేత్త, మీమ్ స్టార్ అయ్యారు. ఇప్పటివరకు తమిళ చిత్ర సీమలో ఏ హీరోపై ఈ స్థాయిలో ట్రోలింగ్ జరగలేదు. ఇన్ని మీమ్స్ రాలేదు. అందుకే మీమ్ స్టార్ అయ్యారు శరవణన్.
మొదటి సినిమా ఘోరంగా బెడిసికొట్టడంతో ఆయనిక సినిమాల జోలికి రారని అంతా అనుకున్నారు. పైగా హీరోగా సినిమా చేయాలనే ముచ్చట తీరిపోయింది కాబట్టి మళ్లీ కోలీవుడ్ సైడ్ ఆయన కన్నెత్తిచూడరని అంతా భావించారు.
కానీ అందరి అంచనాలకు భిన్నంగా శరవణన్ మరో సినిమా ఎనౌన్స్ చేశారు. గరుడన్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దురై సెంథిల్ కుమార్ ను ఈసారి దర్శకుడిగా తీసుకున్నారు. పూజా కార్యక్రమాలు కూడా ముగించారు. సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం.
తొలి సినిమాలో క్లీన్ షేవ్ తో రోబోలా కనిపించిన శరవణన్, తన రెండో సినిమాకు మాత్రం పూర్తిగా మేకోవర్ అయ్యారు. గడ్డం, మీసం పెంచారు. డ్రెస్సింగ్ మార్చారు. మ్యాన్లీగా తయారై ప్రేక్షకుల ముందుకొచ్చారు. మొదటి సినిమాకు టెక్నీషియన్స్, హీరోయిన్స్ విషయంలో భారీ సెటప్ పెట్టుకున్న శరవణన్, రెండో సినిమాకు ఎలాంటి సెటప్ తో వస్తున్నారో చూడాలి.
శరవణన్ మరో సినిమా ప్రకటించడంతో మీమర్స్ మరోసారి రెడీ అయిపోయారు. మేకోవర్ అయ్యాడు సరే, యాక్టింగ్ నేర్చుకున్నారా లేదా అంటూ అప్పుడే ట్రోలింగ్స్ మొదలుపెట్టారు. మొదటి సినిమాలో శరవణన్ ఓ ఎమోషనల్ సీన్ లో నటిస్తే, థియేటర్లలో ప్రేక్షకులంతా కడుపుబ్బా నవ్వారు. ఆయన నవ్వుతున్నాడో, ఏడుస్తున్నాడో అర్థంకాక పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. ఈసారి అలాంటి తప్పులు జరగవనే ఆశిద్దాం.