క్లాస్ కంటే గ్లాస్ గొప్ప‌ది

మాన‌వ చ‌రిత్ర స‌మ‌స్తం వ‌ర్గ‌పోరాట‌మే అన్నాడు మార్క్స్‌. క్లాస్ వార్ కంటే గ్లాస్ వార్ గొప్ప‌ద‌ని ఆంధ్ర ప్ర‌జ‌లు నిరూపించారు. పేద‌ల‌కి పెత్తందార్ల‌కి మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధ‌మ‌ని జ‌గ‌న్ అన్న‌ప్ప‌టికీ, క్లాస్ కంటే గ్లాస్…

మాన‌వ చ‌రిత్ర స‌మ‌స్తం వ‌ర్గ‌పోరాట‌మే అన్నాడు మార్క్స్‌. క్లాస్ వార్ కంటే గ్లాస్ వార్ గొప్ప‌ద‌ని ఆంధ్ర ప్ర‌జ‌లు నిరూపించారు. పేద‌ల‌కి పెత్తందార్ల‌కి మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధ‌మ‌ని జ‌గ‌న్ అన్న‌ప్ప‌టికీ, క్లాస్ కంటే గ్లాస్ గొప్ప‌ద‌ని న‌మ్మ‌డ‌మే కాకుండా, జ‌న‌సేన‌ని అన్ని సీట్ల‌లో గెలిపించి గ్లాస్‌కి హైక్లాస్ ప‌ట్టం క‌ట్టారు.

జ‌గ‌న్ అతి తెలివితో మందుబాబుల జోలికెళ్లాడు. గెలుపు కిక్కుని దించేశారు. ఓట‌మికి తాగుబోతులే కార‌ణ‌మా అంటే కాదు కానీ, వాళ్ల ఆర్త‌నాదాలు తెలుగుదేశం సింహ‌నాదంగా మారింది. వెనుక‌టికి ఎన్టీఆర్ ఇలాగే మ‌ద్య‌నిషేధం అని చివ‌రికి తానే రాజ‌కీయ నిషేధానికి గుర‌య్యాడు. ప‌ద‌వి పోతే వీధుల్లో గొడ‌వ చేసేవాళ్లే లేకుండా పోయారు. చుక్క ప‌డ‌క‌పోతే ఆవేశం ఎందుకొస్తుంది?

జ‌గ‌న్ ద‌శ‌ల‌వారీ నిషేధం అన్న‌ప్పుడే చాలా మంది ఉలిక్కి ప‌డ్డారు. మ‌ద్యం ప్ర‌భుత్వ‌మే అమ్ముతుంది అంటే, ఏదో సిండికేట్ల‌ని నివారించ‌డానికి అనుకున్నారు. కానీ ప‌ర‌మ నీచ‌మైన‌, కుళ్లు కంపు కొట్టే వైన్ షాప్‌ల ముందు నిల‌బ‌డి హాకిన్స్ (విస్కీ), బూంబూం (బీర్‌) కొనాల్సి వ‌స్తుంద‌ని వూహించ‌లేక‌పోయారు. ధ‌ర‌లు పెరిగినా స‌హిస్తారు కానీ, బ్రాండ్లు దొర‌క్క‌పోతే స‌హించ‌రు. పర్మిట్ రూంలు మాయ‌మ‌య్యాయి. బార్‌లోకి వెళితే గోచి కూడా అమ్ముకోవాలి. రోడ్ల మీద తాగితే పోలీసులు తంతారు. ఇంట్లో తాగితే పెళ్లాం తంతుంది. పైగా ప‌థ‌కాల డ‌బ్బులు నేరుగా ప‌డేస‌రికి ప‌ట్ట‌ప‌గ్గాలు లేకుండా పోయింది. ఇక కైపు జీవులు ఎలా బ‌త‌కాలి?  ఏ ధైర్యంతో బ‌త‌కాలి?

న‌లుగురు మందిస్ట్‌లు క‌లిస్తే చాలు జ‌గ‌న్‌కి తిట్లు, శాప‌నార్థాలు. తాగితే ఇల్లు మ‌రిచిపోవాలి కానీ, కొనాలంటే మాన్ష‌న్ హౌస్ దొర‌క్క‌పోతే ఎలా?  దేశాన్ని ముంచేసిన విజ‌య్ మాల్యాని నిత్యం గుర్తు చేసే కింగ్‌ఫిష‌ర్ ఎక్క‌డికో ఎగిరిపోయింది. నెపోలియ‌న్ లేడు, సిగ్నేచ‌ర్ కనిపించ‌దు. టీచ‌ర్స్ దొర‌క‌రు. కావాల్సిన చీప్ లేదు, కాస్టీ కూడా దొర‌క‌దు. అడుగులు స‌రిగా వేయ‌లేని వాడికి కూడా ప్రెసిడెంట్ మెడ‌ల్ బ‌హూక‌రిస్తున్నారు. అది తీసుకోడానికీ కూడా క్యూలో నిల‌బ‌డాలి. క్యాష్ ఇవ్వ‌క‌పోతే క‌సురుకుంటారు. ఆన్‌లైన్‌కి నో లైన్‌.

తాగితే మరిచిపోగ‌ల‌రు. కానీ తాగినా జ‌గ‌న్‌ని మ‌రిచిపోలేరు. ఆవేశం త‌న్నుకొస్తుంది. బూంబూం తాగితే కిక్కుకి బ‌దులు క‌క్కు. స్టార్ హోట‌ల్ తెలుసు కానీ, స్టార్ విస్కీ ఎవ‌రికైనా తెలుసా, ఆంధ్ర స్పెష‌ల్ అదే. క్లాసిక్ మ్యూజిక్ తెలుసు కానీ, ఆ పేరుతో విస్కీ వుంద‌ని విన్నారా?  

999, యంగ్‌స్టార్‌, రాయ‌ల్ ఆర్మ్‌, గెలాక్సీ చివ‌ర‌గా ఆంధ్ర గోల్డ్‌. ఫైన‌ల్‌గా పార్టీ క్లీన్ బౌల్డ్‌. స్విచ్ ఆఫ్ చేసి ఫ్యాన్ రెక్క‌లు పీకేసారు. అవ్వాతాత‌, అక్క‌చెల్లెమ్మ‌లు కూడా కాపాడ‌లేక‌పోయారు.

రాజ‌కీయ నాయ‌కులంతా క‌లిసి బ‌తుకుని ఎలాగూ దుర్భ‌రం చేసేసారు. కనీసం మ‌త్తులో వుండి ద‌రిద్రాన్ని మ‌రిచిపోదామంటే, నోటికాడ మందుని లేకుండా చేస్తారా? మందుజోలికి ఎవ‌రొచ్చినా ఇదే గ‌తే. మా మందు మ‌మ్మ‌ల్ని తాగ‌నివ్వండి. మా బ్రాండ్లు మాకు దొర‌క్క‌పోతే పులులు, సింహాలై గాండ్రుమంటాం -ఇది తాగుబోతులు రాసుకున్న రాజ్యాంగం. ఉల్లంఘిస్తే రెండు నిలువు గీత‌లే!