టాలీవుడ్ పెద్దలు ఆంధ్ర వెళ్లి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి వచ్చారు. బయలు దేరిన దగ్గర నుంచి వచ్చే వరకు లైవ్ కవరేజ్. ప్రత్యేక విమానంలో కొందరు. రోడ్ దారిన మరికొందరు వెళ్లారు. మొత్తానికి హడావుడి ముగిసింది. అంతా అయిన తరువాత అల్లు అరవింద్ కామెంట్స్ ఏమిటంటే…
‘’..ఈరోజు మా అందరికీ సంతోషకరమైన రోజు.. కులాసాగా పవన్ కళ్యాణ్ తో మాట్లాడుకున్నాం.. చంద్రబాబు అపాయింట్మెంట్ కోరాం.. చంద్రబాబు, పవన్ లకు సన్మానం చెయ్యడానికి సమయం అడిగాం.. మనస్పూర్తిగా అన్ని విషయాలు మాట్లాడాం.. త్వరలో ఇండస్ట్రీ గురించి రిప్రెండేషన్ ఇస్తాం…’’
ఇవీ అల్లు అరవింద్ మాటలు. ప్రభుత్వ అధినేతలు ఇద్దరికీ ఇండస్ట్రీ సన్మానం చేయడం మంచిదే. కేవలం సిఎమ్ అపాయింట్ మెంట్ కోరడానికి ఇంత మంది స్పెషల్ ఫ్లయిట్ వేసుకుని వెళ్లారా? పవన్ ను కలవడానికి అపాయింట్ మెంట్ మరి ఎలా తీసుకున్నారు? పోనీ పవన్ కు ఇండస్ట్రీతో వున్న సాన్నిహిత్యంతో, వస్తున్నామని చెప్పి నేరుగా వెళ్లిపోయారని అనుకుందాం. అదే ఒకటి రెండు రోజులు ఆగి సిఎమ్ అపాయింట్ మెంట్ సంపాదించి, ఇద్దరినీ ఒకేసారి కలిసి వస్తే బాగుండేది కదా?
దానికి ముందుగా ఇండస్ట్రీ సమస్యలు, చర్చలు, విన్నపాలు అంటూ మరి ఫీలర్లు బయటకు ఎవరు వదిలారు? ఇంత హడావుడి చేసింది దేనికీ అంటే జస్ట్ పవన్ కళ్యాణ్ ను కలిసి రావడానికి మాత్రమే. కనీసం ఒకటి రెండు మాటలు అయినా పవన్ కళ్యాణ్ నుంచి వచ్చి వుంటే బాగుండేది.
లేదా బయటకు వచ్చిన తరువాత మరి కాస్త వివరంగా అల్లు అరవింద్ మాట్లాడినా బాగుండేది.