‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఒక కార్యాలయాన్ని నిర్మించుకోవాలని అనుకుంది. అందుకోసం తమకు స్థలాలు లీజుకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం స్థలాలు లీజుకు మంజూరు చేసింది. ఆ స్థలాల్లో భవనాలు కట్టుకోవడానికి ప్లాన్ అప్రూవల్స్ కోసం పార్టీ ఆయా మునిసిపల్ కార్పొరేషన్లకు దరఖాస్తు చేసుకుంది. నిర్మాణాలను ప్రారంభించింది. ఆ నిర్మాణాలు ఇప్పుడు వేర్వేరు ప్రాంతాల్లో వివిధ దశల్లో ఉన్నాయి.’’ టెక్నికల్ గా చూసినప్పుడు జరిగింది ఇదే! ఇందులో తప్పు ఎక్కడ ఉంది? అని మనకు అనిపిస్తుంది.
కానీ జరిగినదేంటంటే.. ‘ప్లాన్ అప్రూవల్ కోసం దరఖాస్తు చేసి.. ఆ అనుమతులు రాకముందే నిర్మాణం ప్రారంభించేయడం’! దీనిని గమనించినప్పుడు ప్రజలకు ఆశ్చర్యం అనిపిస్తుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ సమయంలో అధికారంలో ఉన్నది. రాజధాని నుంచి చిన్న చిన్న గ్రామ సచివాలయాల వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాట వేదంలాగా చెల్లుబాటు అవుతోంది. వారి మాటకు ఎదురు చెప్పగల వారు లేరు. వారు ఆదేశిస్తే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా సరే.. ఆ మిషమీద అడ్డు చెప్పగల ధైర్యం అధికారుల్లో ఎవ్వరికీ లేదు.
చెప్పింది చేసుకుంటూ పోవడమే తమ బాధ్యత అన్నట్టుగా అధికార వర్గాలు అయిదేళ్లు పనిచేశాయని అనేక విమర్శలు వచ్చాయి. అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ అలాగే జరుగుతంది. ఆ పోకడలో అటు పార్టీలను గానీ, ఇటు అధికారుల్ని గానీ తప్పుపట్టి ప్రయోజనం లేదు. ఇవాళ్టి రాజకీయాల్లో ఈ పోకడ సహజపరిణామంగా మారిపోయింది.
కానీ ఇవాళ జిల్లాల్లో నిర్మాణంలో వైసీపీ కార్యాలయాల్ని కూల్చివేసే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే.. ప్లాన్లకు అప్రూవల్స్ రావడానికంటె ముందే నిర్మాణాలు ప్రారంభించేశారు. వారు తలచుకుంటే అప్రూవల్ తీసుకోవడం చిటికెలో పని అయి ఉండేదేమో. కానీ.. మనల్ని అడిగేదెవరు.. అనే అహంకారం వల్ల వారు అప్రూవల్స్ గురించి పట్టించుకోలేదు. తమంతట తాము నిర్మాణాలు చేసుకుంటూ పోయారు. ఆ అతివిశ్వాసమే ఇవాళ దెబ్బకొట్టింది.
అనుమతులు లేవు అనే సాకు చూపించి.. కార్యాలయాల భవనాలను తెలుగుదేశం ప్రభుత్వం కూల్చివేస్తోంది. కూల్చివేయడానికి నోటీసులు ఇస్తోంది. వైసీపీ నాయకులు తాము అధికారంలో ఉండగానే కొద్దిగా జాగ్రత్త పడి, ప్లాన్ల అనుమతులకు దరఖాస్తు చేసిన వెంటనే, అనుమతులు తీసేసుకుని ఉంటే.. ఇప్పుడు ఈ సమస్య తలెత్తేదే కాదనే అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.