ఈ ప‌ని అధికారంలో ఉండ‌గా చేయాల్సింది జ‌గ‌న్‌!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తాను ప్రాతినిథ్యం వ‌హిస్తున్న పులివెందుల నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రెండో రోజు పులివెందుల క్యాంప్ కార్యాల‌యంలో ఆయ‌న ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు. అనూహ్య ఓట‌మి అనంత‌రం ఆయ‌న…

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తాను ప్రాతినిథ్యం వ‌హిస్తున్న పులివెందుల నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రెండో రోజు పులివెందుల క్యాంప్ కార్యాల‌యంలో ఆయ‌న ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు. అనూహ్య ఓట‌మి అనంత‌రం ఆయ‌న మొద‌టిసారిగా పులివెందుల వెళ్లారు. ఒక‌వైపు అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా రెండో రోజు కొన‌సాగుతుండ‌గా ఆయ‌న తాడేప‌ల్లి నుంచి పులివెందుల‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే.

క‌డ‌ప విమానాశ్ర‌యంలో జ‌గ‌న్‌కు శ‌నివారం జ‌నం ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ఆయ‌న రోడ్డు మార్గంలో పులివెందుల చేరుకున్నారు. అప్ప‌టికే ఆయ‌న కోసం జ‌నం వేలాదిగా సిద్ధంగా ఉన్నారు. త‌న‌ను ప‌ల‌క‌రించ‌డానికి, ఓదార్చ‌డానికి వ‌చ్చిన జ‌నాన్ని చూడ‌గానే జ‌గ‌న్ క‌ళ్ల‌లో ఆనందం క‌నిపించింది. రెండో రోజు ఆదివారం పులివెందుల జ‌గ‌న్ క్యాంప్ కార్యాలయానికి జ‌నం పోటెత్తారు.

మ‌హిళ‌లు, వృద్ధులు, యువ‌కులు, రైతులు పెద్ద ఎత్తున జ‌గ‌న్‌ను చూడడానికి వెళ్లారు. ప్ర‌తి ఒక్క‌ర్నీ జ‌గ‌న్‌తో క‌లిసేలా వైసీపీ నాయ‌కులు ఏర్పాట్లు చేయ‌డం విశేషం. జ‌గ‌న్ సీఎం అయిన త‌ర్వాత ఏ ఒక్క‌రోజు ఇలా ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయిన దాఖ‌లాలు లేవు. త‌మ‌ను క‌ల‌వ‌లేద‌నే అసంతృప్తి జ‌గ‌న్‌పై ఉండింది. ఇప్పుడు ఓట‌మి త‌ర్వాత పూర్తిగా ప‌రిస్థితి మారింది. బ్యారికేడ్లు పెట్టి, అంద‌ర్నీ జ‌గ‌న్ ద‌గ్గ‌రికి పంపుతున్నారు.

ఇదే మాదిరిగా జ‌గ‌న్ సీఎంగా ఉన్న‌ప్పుడు చేసి వుంటే, ఇవాళ రాజ‌కీయంగా ఈ దుస్థితి వ‌చ్చేది కాద‌ని అక్క‌డికి వ‌చ్చిన కార్య‌క‌ర్త‌లు ఆవేద‌న‌తో చెబుతున్నారు. ఇదే రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న్ ప‌ర్య‌టించి, ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో మూడు రోజులు చొప్పున పార్టీ కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌ల‌తో మాట్లాడాల‌ని కోరుకుంటున్నారు.