ఏపీ సీఎం చంద్రబాబును, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని రాజకీయాల్లో గురు శిష్యులుగా చెప్పుకుంటారు. ఇదే విషయాన్ని ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూ లో ప్రశ్నించినప్పుడు నాకు చంద్రబాబు గురువు కాదని చెప్పాడు. ఇద్దరం ఒక పార్టీలో కలిసి పనిచేశామన్నాడు. కానీ రాజకీయాల్లో మాత్రం రేవంత్ రెడ్డికి బాబును గురువుగానే చెప్పుకుంటారు. సరే …ఈ సంగతి అలా ఉంచితే ఏపీ సీఎంగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబుతో తాను పోటీ పడాలని రేవంత్ రెడ్డి అన్నాడు. అభివృద్ధిలో, సంక్షేమంలో తాను చంద్రబాబుతో పోటీపడాలని అంటున్నాడు.
రోజుకు పన్నెండు గంటలు పనిచేయాలని తాను అనుకున్నానని, అందుకు సిద్దపడ్డానని, కానీ ఇప్పుడు చంద్రబాబుతో పోటీ పడాలంటే 18 గంటలు పనిచేయాల్సి ఉంటుందని అన్నాడు. అంటే బాబు అంత స్పీడుగా ఉంటాడని చెప్పడమన్నమాట. చంద్రబాబు ముందు ఉన్న తక్షణ కర్తవ్యాలు రెండు. ఒకటి అమరావతి అంటే రాజధాని నిర్మాణం వేగంగా చేయడం. రెండు పోలవరం నిర్మాణం పూర్తి చేయడం. చంద్రబాబు విభజిత ఏపీకి మొదటిసారి సీఎం అయినప్పుడు ఆయన హయాంలో ఈ రెండు పనులు పూర్తి చేయలేకపోయాడు.
ప్రధానంగా ఈ రెండు అంశాల మీదనే కూటమిని ఏపీ ప్రజలు గెలిపించారు. కాబట్టి ఈసారి ఆయన చాలా కసిగా పనిచేస్తాడని అనుకోవచ్చు. బహుశా ముఖ్యమంత్రిగా ఇది ఆయనకు చివరి అవకాశం కావొచ్చు కూడా. ఈ అవకాశాన్ని బాబు వదులుకుంటే మరోసారి జగన్ కే ఛాన్స్ వస్తుంది. బాబు అధికారంలోకి రావడానికి తగినట్లుగా కేంద్రంలోనూ మోడీ మళ్ళీ ప్రధాని అయ్యారు. ఎన్నికల కారణంగా బాబు అండ్ మోడీ మధ్య సఖ్యత కుదిరింది.
అందులోనూ ఎక్కువ పార్లమెంటు స్థానాలతో కేంద్రంలో కీలక పాత్ర పోషించే అవకాశం బాబుకు వచ్చింది. అంటే కేంద్రాన్ని డిమాండ్ చేసి సాధించునే అవకాశం బాబుకు ఉంది. సాధారణంగా ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కొందరిని పని రాక్షసుడు అంటుంటారు. రోజుకు 18 గంటలు కష్టపడతారు అని చెబుతుంటారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి పేరే ఉంది. సాధారణంగా సీఎం అయినవారికి సాధారణ ఉద్యోగుల మాదిరిగా ఆఫీసు టైమింగ్స్ అంటూ ఏమీ ఉండవు. వాళ్ళు 24 గంటలు ఆన్ డ్యూటీ కిందే లెక్క. కానీ మీడియాలో కొందరే హైలైట్ అవుతుంటారు. అలాంటివారిలో చంద్రబాబు ఒకడు.
ఆయన ఉన్నతాధికారుల సమావేశాలు నిర్వహిస్తే అవి కొన్ని గంటలపాటు జరుగుతాయని, అధికారులకు విసుగొస్తోందని గతంలో టీడీపీ అనుకూల మీడియాలోనే కథనాలు వచ్చాయి. ఎన్ టీ ఆర్ సీఎం గా ఉన్నప్పుడు ఆయన తెల్లవారుజామున రెండు గంటలకే లేచి నాలుగు గంటలకు అధికారులను తన ఇంటికి పిలిపించుకొని మాట్లాడేవాడు. మరో ముఖ్యమంత్రి (విజయ భాస్కర్ రెడ్డి కావొచ్చు) అర్ధరాత్రి 12 దాటాక అధికారుల సమావేశాలు పెట్టేవాడట. ఇలా ఒక్కొక్కరిది ఒక్కోవిధమైన శైలి. మరి చంద్రబాబుతో రేవంత్ రెడ్డి ఏ విధంగా పోటీ పడతాడో చూడాలి.