రాజకీయాల్లో ఒంటరితనం మంచిది కాదు. రాజకీయం అంటే కేవలం అధికారమే కాదు. అనేక విషయాలు రాజకీయాల్లో ముడిపడి వుంటాయి. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలున్నప్పటికీ, కొన్ని ఉమ్మడి అంశాల్లో కలిసి ప్రయాణం చేయాల్సి వుంటుంది. అప్పుడు ఏ రాజకీయ పార్టీకైనా నైతిక బలం తోడవుతుంది. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ మిగిలిన పార్టీలను కలుపుకెళుతుండడం వల్లే చాలా తక్కువ సీట్లు వచ్చినప్పటికీ నిలబడగలిగింది.
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కూడిన ఇండియా కూటమి అధికారంలోకి రావచ్చనే టాక్ అప్పుడే మొదలైంది. ఈ సానుకూల ప్రచారం ప్రతిపక్ష పార్టీలకు చాలా ఉపయోగపడుతోంది. నీట్ పేపర్ లీక్ విషయంలో కాంగ్రెస్ సారథ్యంలో దేశ వ్యాప్తంగా ఆందోళనలు, మోదీ సర్కార్‌పై తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతున్నాయి. అందుకే కలిసి వుంటే కలదు సుఖమని పెద్దలు చెప్పారు.
ఏపీ రాజకీయాల విషయానికి వస్తే… జగన్ ఒంటరి. సింహం సింగిల్‌గా వస్తుందంటూ వైసీపీ ఊదరగొట్టింది. చివరికి ఎన్నికల్లో అధికార పార్టీ బొక్క బోర్లా పడింది. అధికారం అండగా ఉన్నప్పుడు ఏ పార్టీకి, ఏ నాయకుడికీ ఇతరులు కనిపించరు. వారితో అవసరం వుంటుందని కూడా అధికారంలో ఉన్న నాయకులకు అనిపించదు. అధికారం కోల్పోయినప్పుడు , అంత కాలం జేజేలు కొట్టిన వాళ్లంతా దూరమైనప్పుడు, భవిష్యత్ అంధకారంగా కనిపిస్తుంది. చీకట్లో చిరుదీపం వెలిగించే వ్యక్తి వుంటే బాగుండు అనిపిస్తుంది.
వైసీపీ నాయకుల ఆలోచనలు కూడా సరిగ్గా ఇలాగే ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన మొదలు, నిన్నటి వైసీపీ కేంద్ర కార్యాలయం విధ్వంసం వరకూ సొంత పార్టీ నేతలు తప్ప, ఎవరూ ఖండించిన పాపాన పోలేదు. ఏ ఒక్క పార్టీ కూడా వైసీసీకి నైతికంగా మద్దతుగా నిలబడలేదు. దీనికి కారణం… వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఖరే. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా జగన్ ఒంటరిగానే కొనసాగుతున్నారు. జగన్ ధోరణి అహంకారంగా కనిపించడంతో ఆయనకు చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఏ పార్టీ కూడా చేరువ కాలేకపోయింది.
ఇదే చంద్రబాబునాయుడికి అన్ని పార్టీల మద్దతు వుంటుంది. దీనికి కారణం ఆయన వ్యవహార శైలి. సిద్ధాంతపరంగా బీజేపీ, వామపక్షాలు ఉప్పునిప్పులా వుంటాయి. టీడీపీతో బీజేపీ కలిసి ఉన్నప్పటికీ, చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం వామపక్షాలు ఇప్పటికీ పని చేస్తున్నాయి. వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేస్తే, దాన్ని సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ సమర్థించడం గమనార్హం.
రాజకీయ పార్టీని ఒక ప్రైవేట్ కంపెనీలా నడుపుతుండడం వల్లే ఇవాళ జగన్ ఒంటరిగా మిగిలాల్సి వచ్చింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తదితరులతో జగన్ రాజకీయ సంబంధాలు పూర్తిగా వ్యక్తిగతమయ్యాయి. అందుకే ఎన్నికల్లో బీజేపీతో టీడీపీతో పొత్తు పెట్టుకుని, వ్యవస్థల సాయంతో రాజకీయ లబ్ధి పొందగలిగింది. రాజకీయాల్లో కేవలం ఓట్లు, సీట్లే కాదు… కొన్ని సందర్భాల్లో నైతిక మద్దతు అవసరమవుతుంటుంది. అందుకోసమైనా జగన్ తన పంథాను మార్చుకోవాల్సి వుంటుంది.
రాజకీయంగా వైసీపీ అంటరాని పార్టీగా మిగిలిపోకూడదు. అలా వుండకూడదంటే మిగిలిన పార్టీలతో ఉమ్మడిగా పోరాటాలు చేయడానికి తగిన కార్యాచరణ అవసరం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు కొన్ని చోట్ల ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల ఓట్లు టర్న్ అయ్యాయి. ఇది వైసీపీకి ప్రమాద హెచ్చరిక. ఎందుకంటే ఆ వర్గాలు వైసీపీకి బలమైన ఓటు బ్యాంక్. కావున రాజకీయ ఒంటరితనం నుంచి వైసీపీ బయట పడడానికి లౌకిక పార్టీలతో స్నేహసంబంధాలను ఏర్పరచుకునేందుకు ప్రయత్నించాలి.